డెత్‌ ట్రాక్స్‌!  | Special story on without railway gates | Sakshi
Sakshi News home page

డెత్‌ ట్రాక్స్‌! 

Published Thu, Feb 7 2019 2:08 AM | Last Updated on Thu, Feb 7 2019 2:08 AM

Special story on without railway gates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజధానిలోని రైలుపట్టాలు మరణమృదంగం మోగిస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఓచోట రైల్వేట్రాక్స్‌ రక్తసిక్తమవుతున్నాయి. జనాల నిర్లక్ష్యం కొంత.. అధికారుల వైఫల్యం మరికొంత.. వెరసి విలువైన ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. ఏటా వందలాది మంది పట్టాలు దాటుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. రైల్వే పట్టాలకు ఇరువైపులా ఉండే కాలనీ, బస్తీవాసులు నిర్లక్ష్యంగా పట్టాలు దాటుతూ మృత్యువాతపడుతున్నారు. త్వరగా వెళ్లొచ్చనే ఒకే ఒక్క కారణంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఫెన్సింగ్‌లు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జీలు ఉన్నచోట్ల సైతం పట్టాల మీద నుంచే వెళుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక కాలకృత్యాలు తీర్చుకునేందుకు పట్టాలపైకి వెళ్లినవారు సైతం రైళ్లు ఢీకొని ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఏడాది కాలంలో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే పోలీసుల పరిధిలో 409 మంది మృత్యువాత పడ్డారు. కొన్నిచోట్ల ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జీలు లేకపోవడం.. మరికొన్నిచోట్ల ప్రహరీ గోడలు, ఫెన్సింగ్‌ లేకపోవడం వల్ల జనం పట్టాలు దాటేస్తున్నారు. కొన్నిచోట్ల ఫెన్సింగ్‌ ఉన్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా ట్రాక్స్‌ దాటేసి వెళ్లిపోతున్నారు. ఇలాంటి చోట్ల అధికారుల నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మరోవైపు రైలు కింద పడి ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాదిలో ఇలా 117 మంది బలవంతంగా తనువు చాలించారు. మొత్తమ్మీద హైదరాబాద్‌లో 13 చోట్ల అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు రైల్వే పోలీసుల పరిశీలనలో వెల్లడైంది. ఈ డెత్‌ ట్రాక్స్‌ను బుధవారం ‘సాక్షి’క్షేత్రస్థాయిలో పరిశీలించింది. వివరాలివీ... 

భరత్‌నగర్‌ పరిధిలో అధికం... 
రైలు పట్టాలపైకి వెళ్లడం ప్రమాదమని తెలిసి కూడా జనం సాహసం చేస్తున్నారు. రైలు రావడంలేదు కదా.. వచ్చేలోపు దాటేయొచ్చులే అనుకుంటూ విలువైన ప్రాణాల్ని ఫణంగా పెడుతున్నారు. భరత్‌నగర్‌ రైల్వే ఇన్‌స్పెక్టర్‌ పరిధిలోని నేచర్‌క్యూర్‌–లింగంపల్లి మార్గంలో అధిక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 2017లో ఈ మార్గంలో 180 మంది, 2018లో 150 మంది వరకు చనిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అలాగే ఫతేనగర్‌ రైల్వేస్టేషన్, భరత్‌నగర్, బోరబండ, హైటెక్‌ సిటీ, హఫీజ్‌పేట రైల్వేస్టేషన్ల వద్ద కూడా పట్టాలు దాటే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ స్టేషన్లన్నింటిలోనూ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జీలు ఉన్నప్పటికీ, 90 శాతం మంది వాటిని పట్టించుకోవడంలేదు. ఇక సనత్‌నగర్‌ రైల్వేస్టేషన్‌లో దూర ప్రాంతం నుంచి వచ్చే రైళ్లు ఆగుతుంటాయి. దీంతో చాలామంది ప్రయాణికులు ఇక్కడే రైలు దిగి పట్టాల మీదుగా నడుచుకుంటూ వెళ్లి భరత్‌నగర్‌ ఫ్లైఓవర్‌ వద్ద బస్సులు, ఆటోలు ఎక్కుతుంటారు. ఇలా వెళ్లేవారు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఫతేనగర్‌ రైల్వేస్టేషన్‌ వద్ద రైల్వే పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. అక్కడ పట్టాలు దాటుతున్న 60 మందిపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపించారు. పట్టాలు దాటడం వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించి, వారికి కౌన్సెలింగ్‌ కూడా ఇచ్చారు. 

కాలకృత్యాల కోసం వెళ్లి... 
సికింద్రాబాద్‌లోని జేమ్స్‌ స్ట్రీట్, సంజీవయ్య పార్కు ట్రాక్‌లోనూ పెద్ద సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. జేమ్స్‌ స్ట్రీట్‌ రైల్వే స్టేషన్‌ నుంచి సంజీవయ్య పార్కు మధ్య ఉన్న ట్రాక్స్‌ పైకి కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి ప్రమాదాలబారిన పడుతున్నారు. సంజీవయ్య పార్కు స్టేషన్‌ దాటిన తర్వాత పీవీ ఘాట్‌ ఎదురుగా నెక్లెస్‌రోడ్‌ నుంచి పట్టాలు దాటితే ప్రకాశ్‌నగర్‌లోకి వెళతారు. ఇక్కడ పట్టాలు దాటకుండా నిర్మించిన ప్రహరీ కూలిపోయింది. దీంతో చాలామంది అక్కడ పట్టాలు దాటి వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. మౌలాలీ–లాలాగూడ రైల్వేస్టేషన్‌ల మధ్యలో ఉన్న లాలాపేట్‌ డైరీఫామ్‌ వద్ద ఉన్న ట్రాక్‌ తరచుగా రక్తమోడుతోంది. ప్రతి నెలా కనీసం ఒకటి, రెండు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ రైల్వే అధికారులు ఏర్పాటుచేసిన ఫెన్సింగ్‌ తొలగించి మరీ వెళుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.  

గేటు వేసినా మా దారి మాదే... 
రాజ్‌భవన్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఎమ్మెస్‌ మక్తా వాసులకు రైల్వేలైన్‌ క్రాసింగ్‌ కారణంగా తిప్పలు తప్పడంలేదు. ప్రధాన రహదారి నుంచి మక్తాకు వెళ్లాలంటే రైల్వే ట్రాక్‌ దాటాల్సిందే. నాంపల్లి నుంచి వచ్చే రైళ్లన్నీ ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తాయి. దీంతో రైలు రావడానికి పది నిమిషాల ముందు గేట్లు వేస్తారు. కానీ జనం ఆ గేటు కింద నుంచి వెళ్లిపోతుంటారు. తమ వాహనాలను సైతం గేటు కింద నుంచే తీసుకెళ్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ ఆర్‌ఓబీ నిర్మించాలని ప్రజలు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నప్పటికీ, అధికారులకు పట్టడంలేదు. 

ప్రమాదమని తెలిసినా... 
మల్కాజ్‌గిరి, దయానంద్‌నగర్, సఫిల్‌గూడ రైల్వేస్టేషన్‌ల మీదుగా ప్రతి రోజూ వందల సంఖ్యలో రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ ప్రాంతాల్లో ఉదయం ఆఫీసులకు వెళ్లేవారు, విద్యార్థులను పాఠశాలలకు తీసుకెళ్లే తల్లిదండ్రులు సైతం ప్రమాదమని తెలిసీ పట్టాలు దాటుకుంటూ వెళుతున్నారు. మల్కాజ్‌గిరి రైల్వేస్టేషన్‌లో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి ఉన్నా.. ఎక్కువ మంది ప్రయాణికులు పట్టాలు దాటి వెళ్లడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక చందానగర్‌ ఎంఎంటీఎస్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో జనం పట్టాలు దాటడం నిత్యకృత్యంగా కనిపిస్తుంది. పాపిరెడ్డి కాలనీ, సురభి కాలనీ, రాజీవ్‌ గృహకల్ప, రాజీవ్‌ స్వగృహ నుంచి పట్టాలు దాటి హుడా కాలనీకి చేరుకుంటున్నారు. ఆర్‌వోబీ నుంచి బైక్‌లు, కార్లు మాత్రమే వెళ్తున్నాయి. ఆర్‌వోబీ నిండా డ్రైనేజీ నీరు చేరడంతో నడిచి వెళ్లలేని పరిస్థితి నెలకొనడం కూడా జనం పట్టాల మీద నుంచి వెళ్లడానికి మరో కారణం. 

సెల్ఫీల కోసం ప్రాణాలు పణంగా... 
మలక్‌పేట రైల్వేస్టేషన్‌ సమీపంలో ఏటా సుమారు 50 మంది వరకు మృత్యువాత పడుతున్నారు. ట్రాక్‌పై నడిచే ప్రయాణికులు రైళ్ల రాకను గమనించలేక ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు తాగిన మైకంలో ట్రాక్‌ మీదకు వచ్చి పడిపోతున్నారు. దీంతో రైళ్లు ఢీకొని చనిపోతున్నారు. ఇక సెల్ఫీల పిచ్చితో విద్యార్థులు పట్టాలు ఎక్కుతున్నారు. రైలు వచ్చే ముందు సెల్ఫీ తీసుకోవాలనే ఆరాటంతో ప్రాణాలనే ఫణంగా పెడుతున్నారు. ఇక్కడ ప్రయాణికులు ట్రాక్‌పై నడవకుండా, ఫుట్‌ ఓవర్‌బ్రిడ్జ్‌ నిర్మించాలని చాలా ఏళ్ల క్రితమే ప్రతిపాదించినప్పటికీ, ఆచరణకు మాత్రం నోచుకోవడంలేదు. 

ఈ 13 చోట్ల ప్రమాదకరంగా పట్టాలు... 

►లాలాపేట విజయ డెయిరీ దగ్గర 
► మౌలాలీ సమీపంలోని నోమా ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో... 
►చర్లపల్లి ట్రాక్‌ (ఘట్కేసర్‌) మాధవరెడ్డి బ్రిడ్జి దగ్గర 
► ఘట్కేసర్‌ సమీపంలోని శ్రీనిధి ఇంజనీరింగ్‌ కాలేజ్‌ దగ్గర 
►మల్కాజిగిరి రైల్వేస్టేషన్‌–సఫిల్‌గూడ స్టేషన్‌ మార్గంలో... 
► సంజీవయ్యపార్కు స్టేషన్‌ సమీపంలోని జీహెచ్‌ఎంసీ డంప్‌ దగ్గర 
►గుండ్ల పోచంపల్లి, డబీర్‌పురా (మేడ్చల్‌), మనోహరాబాద్‌ మార్గం 
►మలక్‌పేట్‌ రైల్వేస్టేషన్, విద్యానగర్, జామై ఉస్మానియా స్టేషన్‌ల సమీపంలో... 
► బోరబండ ఎంఎంటీఎస్‌ స్టేషన్‌కు 200 అడుగుల దూరంలో ఉన్న టర్నింగ్‌ వద్ద 
►హైటెక్‌సిటీ–బోరబండ మార్గంలో... 
►ఫతేనగర్‌ వద్ద ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జీ కింద...  
►నేచర్‌క్యూర్‌ హాస్పిటల్‌–ఫతేనగర్‌ల మధ్య 
► హైటెక్‌సిటీ–మాదాపూర్‌ మధ్య ట్రాక్‌లో... 

ప్రమాదాల నివారణకు  ఏమి చేయాలి? 
►అవసరమైన చోట ట్రాక్‌కు రెండు వైపులా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలి. 
►సైడ్‌వాల్స్‌ కట్టించాలి 
►ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జీలు ఏర్పాటు చేయాలి. 
►ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ బృందాలు నిరంతరం నిఘా కొనసాగించాలి. 
►డెత్‌ట్రాక్స్‌ను గుర్తించి నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలి. 

మలక్‌పేటలో సెక్యూరిటీ పెంచాలి 
మలక్‌పేట రైల్వేస్టేషన్‌లో సెక్యూరిటీ పెంచాలి. ట్రాక్స్‌పై నడవకుండా పూర్తిగా మూసివేసి, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జ్‌ నిర్మించాలి. ఇక్కడ తాగుబోతుల బెడద కూడా ఎక్కువ. వారిని అడ్డుకోవాలి.  
– రవికుమార్, మలక్‌పేట 

స్వీయ భద్రత పాటించాలి 
ప్రధాన రైల్వేస్టేషన్లలో వృద్ధులు, లగేజీ ఉన్నవారు ఒక ప్లాట్‌ఫామ్‌ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌ మీదకు వెళ్లడానికి ఎస్కలేటర్స్, లిఫ్ట్‌ సదుపా యాలను కల్పించాలి. పట్టాలు దాటి వెళ్లకూడ దని ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నా మార్పు రావడంలేదు. ఈ విషయంలో వారు స్వీయ భద్రత పాటించాలి. 
– నూర్, సబర్బన్‌ బస్‌ అండ్‌ ట్రావెలర్స్‌ అసోసియేషన్‌ మల్కాజ్‌గిరి ప్రధాన కార్యదర్శి   

ఆర్‌వోబీలో మురికినీరు తొలగించాలి 
చందానగర్‌ రైల్వేస్టేషన్‌లోని ఆర్‌వోబీలో మోకాళ్లలోతు ఉన్న మురికి నీటిలో నడవలేని పరిస్థితి ఉంది. జీహెచ్‌ఎంసీ అధికారులు మురుగునీరు ఆర్‌వోబీలోకి రాకుండా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జీ నిర్మిస్తే పాపిరెడ్డి కాలనీ వైపు నుంచి వచ్చే వారికి సౌకర్యవంతంగా ఉంటుంది. 
– మల్లేష్, పాపిరెడ్డి కాలనీ   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement