తెలంగాణ గాంధీ ఇక లేరు | Spicy Gandhi longer | Sakshi
Sakshi News home page

తెలంగాణ గాంధీ ఇక లేరు

Published Mon, Feb 16 2015 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 PM

తెలంగాణ గాంధీ ఇక లేరు

తెలంగాణ గాంధీ ఇక లేరు

  • హన్మకొండలోని తన స్వగృహంలో కన్నుమూసిన భూపతి కృష్ణమూర్తి
  • గాంధీతో కలసి దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న యోధుడు
  • హన్మకొండ: స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 89 ఏళ్ల వయసున్న భూపతి కృష్ణమూర్తి తెలంగాణ ప్రజా సమితిని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ కూడా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఆయన... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు తనకు మరణం లేదని పలుసార్లు వ్యాఖ్యానించడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజున ఆరోగ్యం సహకరించకున్నా.. అభిమానులతో సందడిగా గడిపారు.
     
    స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న యోధుడు..

    భూపతి కృష్ణమూర్తి 1926 ఫిబ్రవరి 21న వరంగల్‌లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు భ్రమరాంబ-రాఘవులు. 1942 నుంచి 1948 వరకు ఆయన వరంగల్ నగర కాంగ్రెస్ కోశాధికారిగా పనిచేశారు. 1944 అక్టోబర్ 2న మహాత్మాగాంధీతో మహారాష్ట్రలోని వార్ధా ఆశ్రమంలో గడిపారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. 1946లో ఖాదీ బోర్డు ప్రచార కమిటీ సభ్యుడిగా ఎన్నికైన కృష్ణమూర్తి... టి.హయగ్రీవచారితో కలిసి 1946 ఆగస్టు 11న వరంగల్ కోట మీద కాంగ్రెస్ జెండా ఎగురవేశారు.

    ఈ క్రమంలో నిజాం రజాకార్లు వీరిపై దాడి కూడా చేశారు. 1948లో గ్రంథాలయ ఉద్యమంలో భూపతి కృష్ణమూర్తి చురుకుగా పాల్గొన్నారు. 1949 నుంచి 1960 వరకు వరంగల్ నగర కాంగ్రెస్ సభ్యుడిగా చురుకైన పాత్ర పోషించారు. 1960 నుంచి 1986 వరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుడిగా కొనసాగిన ఆయన... ముల్కనూర్ కో ఆపరేటివ్ గ్రామీణ బ్యాంకు అధ్యక్షుడిగా 1970 నుంచి 1974 వరకు వ్యవహరించారు. వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్‌గా 1968 నుంచి 1972 వరకు పనిచేశారు.

    వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శిగా, వరంగల్‌లోని ఏవీవీ జూనియర్ కళాశాల అధ్యక్షుడిగానూ పనిచేశారు. వరంగల్ అసెంబ్లీ స్థానంలో నాలుగు సార్లు పోటీ చేశారు. కానీ ప్రతిసారి స్వల్పతేడాతో ఓటమి పాలై ద్వితీయ స్థానంలో నిలిచారు. తెలంగాణ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. భూపతి కృష్ణమూర్తి 1986లో ‘ప్రజాబంధు’ అవార్డు పొందారు. 2009 జనవరిలో ‘తెలంగాణ గాంధీ’ బిరుదు వరించింది. స్వాతంత్య్ర సమర కేసరి అవార్డును 2009లో అందజేశారు. అదే ఏడాది కాళోజీ అవార్డును కూడా అందుకున్నారు.
     
    సీఎం సంతాపం: తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తంచేశారు. ఇటీవల వరంగల్ వెళ్లినప్పుడు ఆయనను పలకరించిన విషయాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. భూపతి కృష్ణమూర్తి మరణం తెలంగాణ సమాజానికి తీరనిలోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

    ప్రభుత్వ లాంఛానాలతో అంత్యక్రియలు: ఆయన అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వ లాంఛానాలతో సోమవారం జరపనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హాజరుకానున్నారు. అంతేకాకుండా,ఈ కార్యక్రమంలోపలువురు ఎమ్మెల్యేలు, పార్టీల నాయకులు, అధికారులు, పోలీసులు పాల్గొననున్నారు.

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement