రాష్ట్రానికే తొలి ప్రాధాన్యం!
* రామగుండం ఎన్టీపీసీ విద్యుత్‌లో రాష్ట్రానికి 85 శాతం వాటా
* కేటాయించని 15 శాతం విషయంలో తొలి ప్రాధాన్యం రాష్ట్రానిదే
* ప్రపంచ స్థాయి నాణ్యత వల్లే ఎన్టీపీసీ కొత్త ప్లాంట్ల వ్యయం పెరుగుదల
* కొత్త ప్లాంట్ల విద్యుత్ ధరలు యూనిట్‌కు రూ.5 నుంచి రూ.6
* ఎన్టీపీసీ దక్షిణ ప్రాంతీయ ఈడీ ఫడ్నవీస్ స్పష్టం
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా రామగుండంలో నిర్మిస్తున్న 1,600 (2‘800) మెగావాట్ల తెలంగాణ సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి మిగిలిన 15 శాతం విద్యుత్ కేటాయింపుల్లో రాష్ట్రానికే తొలి ప్రాధాన్యం లభిస్తుందని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) దక్షిణ ప్రాంతీయ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వీబీ ఫడ్నవీస్ స్పష్టం చేశారు.
ఇప్పటికే అందులో నుంచి 85 శాతం విద్యుత్ వాటాలు రాష్ట్రానికి కేటాయించిన విషయం తెలిసిందే. రామగుండం ప్లాంట్ నుంచి 100 శాతం విద్యుత్‌ను రాష్ట్రానికే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రం పరిధిలో ఉందన్నారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో దక్షిణాదిలో ఎన్టీపీసీ సాధించిన వార్షిక పురోగతిని వెల్లడించారు. దేశం మిగులు విద్యుత్ సాధ నలో ఎన్టీపీసీ పాత్ర కీలకమన్నారు. 25 శాతం దేశ విద్యుత్ అవసరాలను ఎన్టీపీసీ తీరుస్తోందన్నారు.
పెరుగుతున్న కొత్త ప్లాంట్ల వ్యయంపై..
ఎన్టీపీసీ కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ వ్యయంతో పాటు విద్యుత్ ధరలూ పెరుగుతుండటం పట్ల రాష్ట్ర ఈఆర్సీ వ్యక్తం చేసిన ఆందోళనలపై ఫడ్నవీస్ స్పం దించారు. ప్రపంచస్థాయినాణ్యతాప్రమాణాలతో కొత్త ప్లాంట్లు నిర్మిస్తున్నామని, అందుకే సంస్థ ప్లాం ట్లు మన్నికగా ఉంటాయన్నారు. కొత్త ప్లాంట్ల నిర్మాణంపై మెగావాట్‌కు సగటున రూ.5 కోట్ల నుంచి రూ.5.5 కోట్ల వరకు వ్యయం జరుగుతోందన్నారు. కొత్త ప్లాంట్ల విద్యుత్ ధరలు యూనిట్‌కు రూ.5 నుంచి రూ.6 వరకు ఉంటాయన్నారు.
పాత విద్యుత్ ప్లాంట్లు కోర్బా నుంచి రూ.2.20కు, తాల్చేరు నుంచి రూ.2.50 కు యూనిట్ చొప్పున తక్కువ ధరకే విద్యుత్ విక్రయిస్తున్నామన్నారు. 1,600 మెగావాట్ల రామగుండం ప్లాంట్ నిర్మాణ వ్యయం రూ.10 వేల కోట్ల వరకు ఉంటుందని, ఈ ప్రాజెక్టు విద్యుత్ ధర యూనిట్‌కు రూ.3-3.50 వరకు ఉండవచ్చు అన్నారు.
ఇకపై పీఎల్‌ఎఫ్ ముఖ్యాంశం కాదు
విద్యుత్ ప్లాంట్లను బ్యాకింగ్ డౌన్ చేసి ఉత్పత్తి తగ్గించాల్సి వస్తున్న నేపథ్యంలో ఇకపై విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని కాపాడుకోవడం కంటే విద్యుత్ లభ్యతే ముఖ్యమని ఆయన అన్నారు. కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాక నాలుగేళ్లుగా విద్యుత్ డిమాండ్‌లో వృద్ధి లేదన్నారు. రాష్ట్రంలో 2,600 మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీ రెండో దశ ప్రాజెక్టు నిర్మాణంపై ఇంకా ఆదేశాలు అందలేదన్నారు. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం భవిష్యత్తులో భారంగా మారే అవకాశముందని, వాటి నిర్మాణంపై పునరాలోచన చేయాలని కేంద్ర సూచనల ప్రభావం రామగుండం రెండో దశ ప్లాంట్‌పై లేదన్నారు.
కేంద్రం నుంచి దేశీయ బొగ్గు కేటాయింపులు జరిగిన తర్వాత ఏపీలోని లాలమ్ కోడూరులో 4వేల మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ నిర్మాణ పనులను దేశీయ బొగ్గు పరిజ్ఞానంతో ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో రామగుండం ఎన్టీపీసీ ఈడీ పీకే మహాపాత్రో, కాయంకుళం జీఎం శంకర్ దాస్, సింహాద్రి జీఎం పీకే బొంద్రియా, అనంతపురం సోలార్ ప్రాజెక్టు జీఎం కేసీ దాస్ పాల్గొన్నారు.