జూబ్లీహిల్స్: సైన్స్ ఎగ్జిబిషన్స్ ద్వారా చిన్నారుల్లో దాగివున్న ప్రతిభ వెల్లడవుతుందనడానికి నిదర్శనంగా నిలిచారు..యూసుఫ్‌గూడ సాయికృప పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తమీమ్ ఫాతిమా. ఆమె రూపొందించిన ‘సురక్షా బ్యాండ్ ’ పరికరం ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన రాష్ట్రస్ధాయి ఎగ్జిబిషన్‌లో ఉత్తమ బహుమతి సాధించింది. అలాగే ఈనెల 12న డిల్లీలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి సైన్స్ ప్రదర్శనకు కూడా ఎంపికై మన్ననలు అందుకుంటుంది. తమీమ్ తండ్రి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. తల్లి గృహిణి.
సురక్షా బ్యాండ్ తయారీ..
నానో మెటీరియల్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్, క్రిస్టల్ ఏసీ తదితర పరికరాలను తమీమా మార్కెట్లో సేకరించింది. ఇంటర్‌నెట్‌లో శోధించి బ్యాండ్ రూపకల్పనపై ఒక అవగాహనకు వచ్చింది. పాఠశాల సైన్స్ టీచర్ సంతోష్ సహకారంతో దాదాపు ఆరు నెలలపాటు శ్రమించి మణికట్టుకు కట్టుకునే బ్యాండ్‌ను రూపొందించింది.
బ్యాండ్ పనితీరు ఇలా....
బ్యాండ్‌కు ఒక బటన్ అమర్చి ఉంటుంది. ఆపద సమయంలో బటన్ నొక్కితే చాలు వారు ఎంచుకున్న ఫోన్ నెంబర్లకు, పోలీసులకు సంక్షిప్త సందేశం వెళుతుంది. వారు అప్రమత్తమై వెతుక్కుంటూ వచ్చేలా జీపీఎస్ మ్యాపింగ్‌తో బ్యాండ్ అనుసంధానమై ఉంటుంది.
జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటుతా..
కొన్నేళ్ల క్రితం మా చెల్లెలు ఆడుకుంటూ తప్పిపోయింది. మేము చాలా టెన్షన్ పడ్డాం. అదృష్టవశాత్తు తెలిసినవాళ్లు మా చెల్లిని చూసి అప్పగించారు. అప్పుడే నామదిలో ఈ ఆలోచన మెరిసింది. అప్పటినుండి బ్యాండ్ రూపకల్పన కోసం ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. పిల్లలు, బయటకు వెళ్లే మహిళలు, వృద్ధులకు ఈ బ్యాండ్ ఎంతో ఉపకరిస్తుంది. నా బ్యాండ్ జాతీయ పోటీల్లోనూ సత్తా చాటుతుంది. – తమీమ్ ఫాతిమా
మా ప్రోత్సాహం ఉంటుంది..
ట్రాఫికింగ్‌కు గురయ్యేవారికి ఈ బ్యాండ్ ఎంతో మేలు చేస్తుంది. తమీమ్ పరిశోధనలకు మా ప్రోత్సాహం ఉంటుంది. డిల్లీలో జరగనున్న జాతీయస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌లో సురక్షాబ్యాండ్ ఎంపికైతే తమీమాకు ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది. మరిన్ని పరిశోధనలు చేయడానికి ప్రభుత్వం నిధులు కూడా అందిస్తుంది. – అంజనారావు, ప్రిన్సిపల్, సాయికృప పాఠశాల, యూసుఫ్‌గూడ
Comments
Please login to add a commentAdd a comment