అనుకున్నారు.. సాధించారు..
ఆదిమానవుల చిత్రాలను గుర్తించిన విద్యార్థులు
హైదరాబాద్ శివారు కొత్వాల్‌గూడ గుట్టల్లో నిక్షిప్తం
హైదరాబాద్: గణతంత్ర దినోత్సవాన్ని ఆటపాటలకే పరిమితం చేయకుండా ఏదో కొత్త విషయాన్ని గుర్తించేందుకు వినియోగించు కోవాలని ఆరాటపడ్డ విద్యార్థులు చివరకు దాదాపు మూడున్నర వేల ఏళ్ల క్రితం నాటి రాతి చిత్రాలను గుర్తించారు. పాఠశాలకు చేరువలో ఉన్న గుట్టలను గాలించి అలనాటి అద్భుత చిత్రాలను వెలుగులోకి తెచ్చారు. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలోనే ఉన్నా ఇప్పటి వరకు ఇవి వెలుగుచూడకపోవటం విశేషం. ఇలాంటి చిత్రాలు ఆ ప్రాంతంలో అధిక సంఖ్యలోనే ఉన్నా చాలావరకు దెబ్బతినగా.. కొన్ని మాత్రమే మిగిలాయి. మిగిలిన వాటిలోనూ స్పష్టంగా ఉన్న చిత్రాలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఔటర్ రింగురోడ్డు పనులు నిర్వహించే వేళ గుట్టలను తొలచటం, జిలెటిన్ స్టిక్స్ పేల్చటంతో అపురూప చిత్రాలు ధ్వంసమయ్యాయి.
కొత్వాల్‌గూడ గుట్టల్లో..
హిమాయత్‌సాగర్ చెరువుకు సమీపంలో ఉన్న కొత్వాల్‌గూడ శివార్లలోని గుట్టల్లో ఈ చిత్రాలు వెలుగు చూశాయి. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రశాంత్, సతీశ్, రమేశ్, అఖిల్, చందూలు గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆ రోజు గుర్తుండిపోయేలా ఏదైనా మంచి పని చేయాలని నిర్ణయించుకున్నారు. పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు వేముగంటి మురళీకృష్ణ.. ఆదిమానవులు, వారి జాడలు, గుట్టల్లో వారు వేసిన చిత్రాల గురించి చెప్తుండటం, తరచూ అలాంటి వాటి అన్వేషణకు వెళ్లి వాటిని గుర్తిస్తుండటంతో తాము కూడా అలాంటి అన్వేషణ చేయాలని భావించారు. ఆయన సాయంతో సమీపంలోని కొత్వాల్‌గూడ ప్రాంతంలో ఉన్న గుట్టల్లోకి వెళ్లారు. అక్కడి భారీ పడగరాతి గుహలను గాలిస్తుండగా జాజు రంగులో ఉన్న చిత్రాలు వెలుగు చూశాయి. అక్కడి చాలా రాళ్లపై అలాంటి చిత్రాలుండటం విశేషం. సమీపంలో నిర్మించిన ఔటర్ రింగురోడ్డు వల్ల వీటిలో చాలావరకు దెబ్బతిన్నాయి. గుట్టను తొలిచి రోడ్డును నిర్మించినందున ఆ తొలచిన చోట ఇలాంటి చిత్రాలు వందల సంఖ్యలో గల్లంతై ఉంటాయని భావిస్తున్నారు. వాటి ఆకృతి, చిత్రించిన తీరు ఆధారంగా మూడున్నర వేల ఏళ్ల క్రితంవిగా భావిస్తున్నారు.
చాలా వరకు ధ్వంసం
బృహత్‌శిలాయుగం నాటి మానవులు తాము నివాసం ఉన్న గుట్ట రాళ్లకు నేరుగా బొమ్మలు వేసేవారు. కానీ ఇక్కడ రాతిపై తొలుత సున్నం పూసి దాని మీద చిత్రాలు వేసినట్టు తెలుస్తోంది. రింగు రోడ్డు కోసం గుట్టను ధ్వంసం చేసేందుకు జిలెటిన్ స్టిక్స్ పేల్చినప్పుడు ఆ సున్నం పెచ్చులు ఊడిపోయినట్టు తెలుస్తోంది. సున్నం మిగిలిన చోటనే చిత్రాలు కనిపిస్తున్నాయి. ఎనుబోతులు, వేట, గుర్తు తెలియని లిపిలో అక్షరాలు, వ్యవసాయం, ఇతర జంతువుల చిత్రాలు రాళ్లపై ఉన్నాయి. ఆ చిత్రాలు దెబ్బతినకుండా కాపాడాలని ఉపాధ్యాయుడు వేముగంటి మురళీకృష్ణ, విద్యార్థులు కోరుతున్నారు.