ఉద్యమిస్తాం.. సాధిస్తాం.. | Sub BC instruments | Sakshi
Sakshi News home page

ఉద్యమిస్తాం.. సాధిస్తాం..

Published Mon, Aug 31 2015 3:18 AM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM

ఉద్యమిస్తాం.. సాధిస్తాం..

ఉద్యమిస్తాం.. సాధిస్తాం..

వరంగల్ అర్బన్ :  బీసీ సబ్‌ప్లాన్ సాధన కోసం కలిసి పోరాడాలని, మద్దతివ్వని రాజకీయ పార్టీల నేతలను బహిష్కరించాలని బీసీ సబ్‌ప్లాన్ సాధన  కమిటీ రాష్ట్ర చైర్మన్ కె.మురళీ మనోహర్ పిలుపునిచ్చారు. ఆదివారం వరంగల్ స్టేషన్ రోడ్డులోని మహేశ్వరీ గార్డెన్‌లో గ్రేటర్ బీసీ సబ్‌ప్లాన్ సాధన సదస్సు తిరుణగిరి శేషు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బీసీ ఉద్యమకారులైన జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, దొడ్డి కొంరయ్య, చాకలి అయిలమ్మ చిత్ర పటాలకు పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మురళీ మనోహర్ మాట్లాడుతూ.. తమకు ముప్పు వాటిల్లుతుందని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు బీసీల సంఖ్యను వెల్లడించడం లేదన్నారు. పార్లమెంటు, అసెంబ్లీలో ప్రశ్నించినా ఆందోళనలు చేసినా అగ్రవర్ణాల ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలను కట్టడి చేస్తున్నారని విమర్శించారు. జనాభాలో నూటికి 50 శాతం మంది బీసీలు ఉన్నారని తెలిపారు.

కానీ, చట్టసభలు, రిజర్వేషన్లు, సామాజిక పరంగా అవకాశలు కల్పించలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ఓట్లు మావి.. సీట్లు మీవా? ఇదేక్కడి న్యాయమని ప్రశ్నించారు. అభివృద్ధి చెందిన కులాలే రాజకీయ, న్యాయ, పరిశ్రమ, కార్పొరేట్ సంస్థలను ఏర్పాటు చేసుకుంటూ దేశ సంపదను దోచుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం క్రిమిలేయర్ విధానాన్ని తీసుకొస్తూ విద్య, ఉద్యోగాల్లో బీసీలకు ప్రాధాన్యత లేకుండా కుట్రలు చేస్తుందన్నారు. అగ్రవర్ణాలందరూ ఓబీసీలుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, వారిని తిప్పకొట్టాలన్నారు. వృత్తులను నమ్ముకొని జీవనం కొనసాగించలేక వలసలు పోతున్నారని, కార్పొరేట్ కంపెనీలతో వృత్తులు నేలమట్టమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఏ పార్టీతో మాకు సంబంధం లేదని, కలిసి వచ్చే పార్టీల నేతలు బీసీ సబ్ ప్లాన్‌కు కట్టుబడి ఉంటున్నట్లుగా ప్రమాణం చేస్తేనే ఆహ్వానిస్తామని సూచించారు. నిర్ణయూధికార శక్తిగా బీసీలు ఎదగాలని కోరారు.

 7న పికెటింగ్
 సెప్టెంబర్ 7న అన్ని జిల్లా కేంద్రాల్లో బీసీ సబ్ ప్లాన్ కోసం పికెటింగ్ చేపట్టాలని, హైదరాబాద్‌లో ఇందిర పార్కు వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్ల తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని, బీసీలు అందరూ జరుగుతున్న అన్యాయాలపై కళ్లు తెరవాలని కోరారు. బీసీ సబ్ ప్లాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో బీసీలలో 112 కులాలకు చెందిన వారు ఉన్నారని తెలిపారు. అందులో 60 కులాలు సంచార జాతులేనని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి కనీస సౌకర్యాలు, స్థిర నివాసం లేదన్నారు. బడ్జెట్‌లో బీసీల కోసం రూ.200 కోట్లు కేటాయించారని, ఇప్పటి వరకు చిల్లిగవ్వ విదిల్చలేదన్నారు. కాగా, బీసీ సబ్ ప్లాన్ సాధన సదస్సుకు కోసం పెద్ద ఎత్తున వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి ర్యాలీగా స్టేషన్ రోడ్డులోని మహేశ్వరీ గార్డెన్‌కు తరలి వచ్చారు.

గ్రేటర్ బీసీ సదస్సులో సంచార జాతికి చెందిన పూసల కులస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సదస్సులో జిల్లా కన్వీనర్ సాదుల నివాస్, రాష్ట్ర నాయకులు ఎంవీ రమణ, జిల్లా నాయకులు గోపు సుధాకర్, డాక్టర్ వడ్డే రవీందర్, మల్లేశం, సుధాకర్, రమేష్, వెంకటేశ్వర్లు, అడ్వొకేట్స్ లలితా కుమారీ, పోడిశెట్టి నవీన్, కోల జనార్దన్, రమేష్, శ్రీరాములు, శ్రీ రాముల సురేష్, సిరబోయిన కరుణాకర్, దుబ్బా శ్రీనివాస్, వేణు, శివాజీ, బాబురావు, ఆడేపు భిక్షపతి, భూపాల్‌రావు, పల్లం రవి, అప్పరాజు రాజు, రాగుల రమేష్, మర్రి శ్రీనివాస్, అకేనపల్లి యాదగిరి, కొప్పల శ్రీనివాస్, బషీర్, వివిధ బీసీ కులాల సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement