పెన్‌పహాడ్ (నల్లగొండ జిల్లా) : ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులనే కొట్టి ఇంట్లో నుంచి గెంటివేసి ఇంటికి తాళం వేశాడు ఒక ఎస్సై. ఈ ఘటన నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్ మండలం దూపాడు గ్రామంలో వెలుగుచూసింది. దూపాడు గ్రామానికి చెందిన మేకల ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో ఎస్సైగా పని చేస్తున్నాడు.
ఇంటికి వెళ్లిన అతను ఆస్తిని పంచాలంటూ తల్లిదండ్రులతో గొడవపడి, వారిని కొట్టి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. మనస్తాపం చెందిన తల్లిదండ్రులు మండల కేంద్రంలోని పోలీసులను ఆశ్రయించగా వారు పట్టించుకోలేదు. దీంతో తెలిసిన వారి ద్వారా సుర్యాపేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని ఎస్సై తల్లిదండ్రులు పోలీసులను వేడుకున్నారు.