శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గోరటి వెంకన్నకు పురస్కారాన్ని అందజేస్తున్న ఆర్.నారాయణమూర్తి. చిత్రంలో సుద్దాల అశోక్ తేజ, కర్నె ప్రభాకర్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: కలం యోధుడు సుద్దాల హనుమంతు, జానకమ్మ 2017 సంవత్సరం జాతీయ పురస్కారాన్ని ప్రజాకవి గోరటి వెంకన్న అందుకున్నారు. సుద్దాల ఫౌండేషన్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. ఫౌండేషన్ వ్యవస్థాపక అ«ధ్యక్షుడు సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. ఈ పురస్కారాన్ని గోరటి వెంకన్నకు అందించడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు.
ప్రభుత్వం ట్యాంక్ బండ్‌పై సుద్దాల హనుమంతు విగ్రహాన్ని పెట్టాలని, అలాగే ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. హనుమంతు విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. సాయుధ పోరాటంలో తన పాటతో ప్రజలను చైతన్యం చేసిన వ్యక్తి హనుమంతు అన్నారు. హనుమంతు వారసత్వాన్ని అందిపుచ్చుకొని అశోక్‌తేజ ఆ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ఈ పురస్కారాన్ని తనకివ్వడం పట్ల గోరటి వెంకన్న సంతోషం వ్యక్తం చేశారు.
నటుడు ఆర్. నారాయణ మూర్తి.. సుద్దాల హనుమంతు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తల్లిదండ్రులు స్ఫూర్తిని కొనసాగిస్తామంటూ సుద్దాల అశోక్ తేజ తన తండ్రిపై రాసిన గీతాన్ని హనుమంతు కుమార్తె రచ్చ భారతి ఆలపించారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.వి.యల్., సిహెచ్. స్వప్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment