
వేసవి సెలవుల్లోనూ.. మధ్యాహ్న భోజనం
జిల్లాలోని కరువు మండలాల్లో వేసవి సెలవుల్లోనూ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ....
► 19 కరువు మండలాల్లో అమలు
► 75,820 మంది విద్యార్థులకు లబ్ది
కరీంనగర్ ఎడ్యుకేషన్ : జిల్లాలోని కరువు మండలాల్లో వేసవి సెలవుల్లోనూ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణరుుంచింది. జిల్లాలో 57 మండలాలుగా ఉండగా.. జిల్లా అధికార యంత్రాంగం 40 కరువు మండలాల జాబితాను ప్రభుత్వానికి నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వం మెట్టప్రాంతాల్లోని 19 మండలాలను మాత్ర మే కరువు మండలాలుగా గుర్తించింది. ఈ మండలాల్లో 75,820 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. వీరికి ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవుల్లో మధ్యాహ్నభోజనం అందించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన కరువు పరిస్థితులు కమ్ముకున్నందున పల్లె జనాలు బతుకుదెరువు కోసం వలసబాట పడుతున్నారు.
ఇప్పటికే చాలా గ్రామాల్లో చిన్న పిల్లలను ఇంట్లో ఉన్న వృద్ధుల వద్ద వదిలి జవసత్వాలు ఉన్నవాళ్లంతా వలసబాట పట్టారు. దీంతో పిల్లలు కలో గంజో తాగుతూ పాఠశాలలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజనం కొంతవరకు వారి ఆకలి తీర్చనుంది.
42 రోజుల పాటు నిర్వహణ
ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు కొనసాగనున్నాయి. అంటే 42 రోజుల పాటు ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తారు. అయితే వంట బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. వేసవి సెలవుల్లో టీచర్లు బడికి వచ్చే ఆవకాశం లేనందున విద్యావాలంటీర్లు లేదా అంగన్‌వాడీలకు నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే ప్రస్తుతం వంట చేస్తున్న సిబ్బందితోనే వేసవి సెలవుల్లో వంటలు వండించే అవకాశాలున్నారుు. పర్యవేక్షణ బాధ్యత మాత్రం ప్రధానోపాధ్యాయులకు అప్పగించే అవకాశం ఉంది.