అర్ధరాత్రి భారీవర్షం
- ఆదివారం రాత్రి కుండపోత వాన
- మునిగిన పత్తి, మొక్కజొన్న పంటలు
- ఆర్డీఎస్ కాల్వకు గండి
- ఆలస్యంగానైనా కరుణించిన వరుణుడు
- మానవపాడులో అత్యధికం
సాక్షి, మహబూబ్‌నగర్: వరుణుడు మరిపించి.. ఆపై మురిపించాడు. దాదాపు నెలరోజుల తరువాత కాస్త కరుణ కురిపించాడు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు జిల్లాలోని అలంపూర్, గద్వాల, కొల్లాపూర్, అచ్చంపేట, వనపర్తి నియోజకవర్గాల్లో భారీవర్షం కురిసింది. దీంతో నిన్నటివరకు భానుడి నిప్పుల సెగకు వాడిపోయిన మెట్టపంటలకు ఊపిరి పోసినట్లయింది. అయితే, కొన్ని మండలాల్లో భారీవర్షంతో మొక్కజొన్న పత్తి, వరిపంటలు నీట ముని గాయి. వరద ఉధృతి పెరగడంతో ఆర్డీఎస్ కా ల్వకు గండి పడి పంటలు కొట్టుకుపోయాయి.
మానవపాడు మండల కేంద్రంలో కుండపోత వర్షం కురిసింది. ఇక్కడ అత్యధికంగా 80 మి. మీ, అలంపూర్ మండలంలో అత్యల్పంగా 38.4 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీవర్షం తో నియోజకవర్గ రైతులకు కాస్త ఊరట లభిం చినట్లయింది. అయితే శాంతినగర్ మండలం లో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి రాజోలి శివారులోని వరిపొలాలు కోతకు గురయ్యాయి. పలు గ్రామాల్లో పంటపొలాలు నీటమునిగా యి. వాగులు, వంకలు పొంగిపార్లడంతో పడమటి గార్లపాడు రోడ్డు కొట్టుకుపోవడంతో దిగువన ఉన్న పొలాల్లో భారీగా ఇసుకచేరింది. అ లాగే రోడ్డు తెగిపోవడంతో పడమటి గార్లపాడు గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.
ఆర్డీఎస్ కాల్వకు గండి
భారీవర్షానికి ఆర్డీఎస్ ప్రధానకాల్వ 29వ డ్రిస్టిబ్యూటర్‌కు మూడుచోట్ల గండిపడి సుమారు 100ఎకరాల్లో పంట నీట మునిగింది. దీంతో జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ప్రకాశ్ తన సిబ్బందితో హుటహుటిన సోమవారం ఉదయమే డిస్ట్రిబ్యూటరీ వద్దకు చేరుకుని కాల్వను పరిశీలించారు. ఆర్డీఎస్ కాల్వకు గండ్లు పడినచోట పకడ్బందీగా మరమ్మతులు చేపట్టి కోతలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
ఆదివారం కురిసిన వర్షానికి పంటపొలాల్లోని నీరు కాల్వలోకి చేరడం, కొన్నిచోట్ల కాల్వలో చెత్తచెదారం పేరుకుపోవడంతోనే ఈ గండ్లు పడ్డాయని సీఈ తెలిపారు. కాల్వకు మరమ్మతులు వెంటనే చేపట్టాలని, రబీ సీజన్‌కు ఎలాంటి ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. సీఈ ప్రకాష్ వెంట ఈఈ రాజేంద్ర, డీఈ రమేష్, ఏఈలు రాజు, వరప్రసాద్‌లు, నీటిసంఘం అధ్యక్షుడు ప్రకాశంగౌడ్, వర్కుఇన్‌స్పెక్టర్ అబ్దుల్లాషేక్ తదితరులు ఉన్నారు.
24.3 మి.మీ వర్షపాతం నమోదు
ఆదివారం అర్దరాత్రి కురిసిన వర్షం రైతులకు ఊరటనిచ్చింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పంటలకు ప్రాణం పోసినట్లయింది. జిల్లాలో సరాసరిగా 24.3మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వీపనగండ్ల, బిజినేపల్లి మండలాలలో 110మి.మీటర్లుగా నమోదైంది. కొన్ని మండలాలు మినహా చాలాచోట్ల చిరు జల్లులకే పరిమితమైంది. లింగాల, భూత్పూర్, అచ్చంపేట, ఉట్కూరు, నారాయణపేట, మిడ్జిల్ తదితర మండలాల్లో నాలుగైదు మి.మీ మాత్రమే కురిసింది.
కొడంగల్, షాద్‌నగర్, కొత్తూరు, కోస్గి, దౌల్తాబాద్, బాలానగర్, ఆమన్‌గల్, మాడ్గుల మండలాలలో చుక్క వాన కురవలేదు. ఆగస్టు నెల ముగుస్తున్నప్పటికీ సాధారణ వర్షపాతానికి అందనంత దూరంలో ఉంది. ఈ నెలలో సాధారణంగా 121 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవాల్సి ఉండగా, ఇప్పటివరకు 56 మిల్లీమీటర్లే నమోదైంది. గతేడాది ఇదే సమయానికి 154.6మిల్లీమీటర్లు నమోదైంది.
నీటమునిగిన పంటలు
ఆదివారం రాత్రి కురిసిన భారీవర్షం రైతులకు నష్టం కలిగింది. ఇటీవల నాట్లువేసిన వరిపొలాలు కోతకు గురయ్యాయి. వీపనగండ్ల మండలంలోని వీపనగండ్ల, గోవర్ధనగిరి తదితర గ్రామాల్లో వరిపంట నీటమునగడంతో రైతులు ఆందోళనచెందారు. చిన్నంబావి చౌరస్తా, కొప్పునూర్ తదితర గ్రామాల్లో కూడా మొక్కజొన్న పంట పొలంలోనే నేలకొరిగింది. జూరాల పంటకాల్వ డిస్ట్రిబ్యూటర్ 27 సమీపంలోని పం టపొలం కోతకు గురైంది.
అలాగే ధరూరు మండలంలో సోమవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగిపారాయి. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం నుంచి ఇంత పెద్దవర్షం కుర వడం ఇదే ప్రథమం. మండలంలోని పారుచర్ల, సోంపురం, ధరూరు గ్రామాల్లో చెరువులు నిండాయి. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం లో భాగమైన ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి ఓబులోనిపల్లి, ధరూరు చెరువులకు విడుదల చేస్తున్న నె ట్టెంపాడు జలాలకు వర్షపునీరు తోడవడంతో వాగులకు జలకళ సంతరించుకుంది.