ఈ ఏడాదే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాదే ఐదు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను, వరంగల్‌లో ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారు లను ఆదేశించారు. సూపర్ స్పెషాలి టీ ఆస్పత్రుల్లో నాలుగింటిని హైదరాబాద్‌లో, ఒకదానిని వరంగల్‌లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటికి వచ్చే బడ్జెట్‌లో అవసరమైన నిధులు కేటాయించాలన్నారు.
ఇక వరంగల్ సెంట్రల్ జైలు, హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు, రేస్ కోర్సులను వేరే ప్రాంతాలకు తరలించే కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆస్పత్రుల నిర్మాణం, జైళ్ల తరలింపు అంశాలపై బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్షించారు. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ), దానిని ఆనుకుని ఉన్న సెంట్రల్ జైలు ప్రాంతాన్ని కలిపి.. ఆరోగ్య యూనివర్సిటీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ప్రసూతి బ్లాకులను నిర్మించాలని సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. సెంట్రల్ జైలును నగర శివార్లలోని మరో చోట పూర్తి స్థాయి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి తరలించాలన్నారు. వరంగల్ ఎంజీఎంను కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు.
ఇక హైదరాబాద్‌లో కొత్తగా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించాలని, వాటికి వచ్చే బడ్జెట్లోనే నిధులు కేటాయించాలని ఆదేశించారు. చంచల్‌గూడ జైలు, రేస్ కోర్సులను తరలించి.. వాటి స్థానంలో రెసిడెన్షియల్ విద్యా సంస్థలతో పాటు ఇతర ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టాలన్నారు. వీటికి సంబంధించిన ప్రతిపా దనలు తయారు చేయాలని ఆదేశించారు. సమీక్షలో వైద్యారోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, సీనియర్ అధికారులు రాజీవ్ త్రివేదీ, తివారీ, రామకృష్ణారావు, నర్సింగ్‌రావు, కాళోజీ ఆరోగ్య వర్సిటీ వీసీ కరుణాకర్, డీజీపీ అనురాగ్‌శర్మ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
1,907 పోస్టులు మంజూరు
రాష్ట్రంలోని మైనారిటీ, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్లకు 1,907 పోస్టులు మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన ఫైలుపై బుధవారం సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఇందులో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 1,640 పోస్టులు, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 267 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.