సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : వార్షిక రుణ ప్రణాళిక విడుదలైంది. ఈ ఏడాది రూ.2300 కోట్ల పంట రుణాలు పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్ణయించింది. గతేడాది రూ.2000 కోట్ల పంట రుణాలు లక్ష్యంగా ఎంచుకుంటే రూ.1805 కోట్లు పంపిణీ చేసింది. అంటే 90.27 శాతం లక్ష్యం సాధించింది. అప్పటితో పోలిస్తే పంట రుణాల వాటా అదనంగా రూ.300 కోట్ల మేరకు పెరిగింది.
పస్తుత ఖరీఫ్‌లో రూ.1650 కోట్లు, 2014-15 రబీలో రూ.650 కోట్లు పంపిణీకి బ్యాంకర్ల వారీగా ప్రణాళిక సిద్ధమైంది. పంట రుణాలతోపాటు వ్యవసాయ టర్మ్ రుణాలకు రూ.189.50 కోట్లు, వ్యవసాయ అనుబంధ యూనిట్లకు రూ.256.47 కోట్ల రుణ పంపిణీ లక్ష్యంగా నిర్దేశించింది. ఎన్నికల కారణంగా రెండు నెలలు ఆలస్యంగా జిల్లా యంత్రాంగం రుణ ప్రణాళికను విడుదల చేసింది. కానీ, కొత్తగా కొలువుదీరిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల రుణ మాఫీ పథకమెలా ఉంటుంది? మార్గదర్శకాలెలా ఉంటాయి? అప్పటివరకు పంట రుణాల పంపిణీ నిలిచిపోతుందా? అనే సందేహాలు రైతులను పట్టి పీడిస్తున్నాయి. రుణం మాఫీ అవుతుందనే ధీమాతో ఉన్నా.. ఖరీఫ్ పెట్టుబడులు అవసరమైన రైతులు తిప్పలు పడుతున్నారు.
సర్కారు సకాలంలో రుణాలు మాఫీ చేస్తేనే కొత్త రుణం తీసుకునే అవకాశమొస్తుందని ఎదురుచూస్తున్నారు. అప్పటివరకు బ్యాంకర్లు సైతం పంట రుణాలపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మార్చి 31 నుంచి మే 31 వరకు గత రెండు నెలల్లో జిల్లాలో రూ.58.33 కోట్ల పంట రుణాల పంపిణీ జరిగింది. దీంతో రైతులకు తక్షణం పెట్టుబడులకు కొత్త రుణాల అవసరాన్ని కళ్లకు కట్టిస్తోంది. కానీ.. రుణమాఫీ విధానం అమల్లోకి వచ్చేంతవరకు బకాయి ఉన్న రైతులకు రుణాలు పంపిణీ చేసే ప్రసక్తి లేదని బ్యాంకర్లు తేల్చిచెపుతున్నారు. కొన్ని బ్యాంకులు ఏకంగా ధాన్యం అమ్మిన రైతులకు ఐకేపీ కేంద్రాలు జారీ చేసిన చెక్కులను బకాయిల ఖాతాలో జమ చేసుకున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 386 బ్యాంకు బ్రాంచీలున్నాయి. వీటి పరిధిలో మొత్తం 4,77,663 మంది రైతులు రుణమాఫీపై ఆశలు పెంచుకున్నారు. అదే సమయంలో కొత్త పంట రుణాలు ఎప్పుడొస్తాయా... అని ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం రుణం మాఫీ చేస్తే పంట రుణాలకు ఎంచుకున్న రూ.2300 కోట్ల లక్ష్యం ఈ ఏడాది సునాయాసంగా అధిగమిస్తామని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు.
లక్ష్యం రూ.2300 కోట్లు
Published Wed, Jun 4 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM
Advertisement