సాక్షి, వరంగల్ రూరల్: అంగన్‌వాడీ కేంద్రాలకు డిసెంబర్ 1 నుంచి విజయ పాల పాకెట్లకు బదులుగా.. టెట్రా ప్యాకెట్ పాలను సరఫరా చేయనున్నారు. ఇప్పటి వరకు సరఫరా చేస్తున్న పాల ప్యాకెట్లు ఎక్కువ కాలం నిల్వ ఉండక.. పగిలిపోతుండటంతో.. 90 రోజుల పాటు నెలల పాటు నిల్వ ఉండే టెట్రా ప్యాక్ పాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులు, 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి.
వీటి ద్వారా 22, 28,150 మందికి పౌష్టికాహారం అందిస్తున్నారు. ఇందులో గర్భిణులు, బాలింతలకు 200 మిల్లీ లీటర్ల పాలు అందిస్తున్నారు. వీటిని వేడి చేసి అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సరఫరా చేస్తున్న విజయ డైరీ పాల ప్యాకెట్లు ఒక రోజు కంటే ఎక్కువ నిల్వ ఉండవు. ఒక్కోరోజు ఆలస్యం అయితే పాలు వేడి చేయగానే పగిలిపోయేవి. గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు పాల ప్యాకెట్లు చేరడం కష్టంగా ఉండేది.
ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయ టెట్రా పాల ప్యాకెట్లను అందించాలని నిర్ణయించారు. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాలకు విజయ టెట్రా పాల ప్యాకెట్‌లను నెలకు సరిపడా సరఫరా చేశారు. రాష్ట్రంలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా 5,31,310 మంది గర్భిణులు, బాలింతలు ఉన్నారు. వీరికి రోజుకు 200 మిల్లీలీటర్ల పాలను అందించనున్నారు. ఈ లెక్కన రోజుకు 1,06,262 లీటర్ల పాలు సరఫరా చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment