
పాలమూరుకు 10 ఏళ్ల పాటు పన్ను రాయితీ
ఒక్క భాష, రెండు రాష్ట్రాల కోసమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి జై రాం రమేష్ తెలిపారు. బుధవారం మహబూబ్నగర్ విచ్చేసిన జై రాం రమేష్ మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా వ్యవహరించిందని అన్నారు. అటు తెలంగాణ, ఇటు సీమాంధ్రకు కాంగ్రెస్ న్యాయం చేసిందని తెలిపారు. తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్ల ఆయన ప్రకటించారు.
అందులోభాగంగా మహబూబ్నగర్ జిల్లాకు 10 ఏళ్ల పాటు పన్ను రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందే అంటే 2000 సెప్టెంబర్ 21న మహాబూబ్నగర్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటన చేసిన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ బిల్లు విషయంలో బీజేపీ రెండు నాల్కల ధోరణి అవలంభించిందని జై రాం రమేష్ ఆరోపించారు.
అలాగే టీడీపీ కూడా తెలంగాణకు ముందుగా మద్దతు ఇచ్చి ఆ తర్వాత మాట మార్చిందని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఐదారేళ్లలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కృషి చేస్తామని ఆయన తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చారు.