టీడీపీలో ‘జడ్పీ’ లొల్లి | tdp leaders have inner conflicts on zp chairman position | Sakshi
Sakshi News home page

టీడీపీలో ‘జడ్పీ’ లొల్లి

Published Sat, Aug 2 2014 2:02 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

టీడీపీలో ‘జడ్పీ’ లొల్లి - Sakshi

టీడీపీలో ‘జడ్పీ’ లొల్లి

సాక్షి, ఖమ్మం : జిల్లా పరిషత్ చైర్మన్ కుర్చీ కోసం టీడీపీలో ఆట మొదలైంది. పార్టీ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు ఎవరికి వారు తమ అనుచరులకే చైర్మన్ పీఠం దక్కేలా పావులు కదుపుతున్నారు. ముంపు మండలాలను ఈ ఎన్నిక నుంచి మినహాయించడం, పీఠం దక్కించుకునేందుకు మరో జెడ్పీటీసీ అవసరం కావడం.. ఇద్దరు నేతల మధ్య పొసగకపోవడంతో రాజీ కుదుర్చుకునేందుకు టీడీపీ జిల్లా రాజకీయం రాజధానికి చేరింది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇరువురు నేతల మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నా రాజీ కుదరకపోతే సమీకరణ లు మారే అవకాశం ఉంది.
 
జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీడీపీ 22 జెడ్పీటీసీ స్థానాలు దక్కించుకొని అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే ముంపు మండలాలను తాజాగా ఈ ఎన్నికల నుంచి మినహాయిస్తూ ఎన్నికల సంఘం ప్రకటించడంతో ఆ పార్టీ జెడ్పీటీసీల సంఖ్య మూడు తగ్గి 19కి చేరింది. ముంపు మండలాలను మినహాయిస్తే మిగిలిన 39 స్థానాల్లో టీడీపీ 19, కాంగ్రెస్ 10, వైఎస్సార్‌సీపీ 4, సీపీఎం 2, సీపీఐ 1, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ 3 స్థానాలను దక్కించుకున్నాయి. ఏ పార్టీ జెడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకోవాలన్నా 20 జెడ్పీటీసీ స్థానాలుండాలి. అయితే ఇందులో టీడీపీకి మరొక స్థానం ఉంటే జెడ్పీ చైర్మన్ దక్కించుకోనుంది. ఈ ఒక్క స్థానం మాట అటుంచితే చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు తుమ్మల, నామా వర్గాలు సై అంటే సై అంటున్నాయి.
 
తమ జెడ్పీటీసీలే ఎక్కువగా ఉన్నారని తమ్మల వర్గం, తమకే ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉందని నామా వర్గం భావిస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఇరువర్గాల జెడ్పీటీసీలు ఇలానే లెక్కలు వేసుకున్నారు. అయితే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువరించి ఈనెల 7న ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించడంతో ఇప్పుడు ఆ పార్టీలో చైర్మన్ పదవి రాజకీయం అగ్గి రాజేసింది. తెలంగాణలో ఖమ్మంలోనే టీడీపీ అత్యధిక జెడ్పీటీసీ స్థానాలు గెలుపొందడంతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు అధినేత చంద్రబాబు ఇరువురు నేతలను సయోధ్యకు రావాలని పిలిచినట్లు సమాచారం.
 
ఈ నేపథ్యంలో తుమ్మల, నామాతో పాటు వారి అనుచర నేతలు, జెడ్పీటీసీలు శుక్రవారం రాజధానికి వెళ్లారు. సాయంత్రం బాబు నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి తుమ్మల, నామా, పోట్ల నాగేశ్వర్‌రావు, సండ్ర వెంకటవీరయ్య, బాలసాని ల క్ష్మీనారాయణ, కొండబాల కోటేశ్వర్‌రావు తదితర నేతలు హాజరయ్యారు.

చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఏకాభిప్రాయానికి రావాలని తొలుత చంద్రబాబు ఇరువురు నేతలకు సూచించారని, వారు ఎటూ తేల్చలేక చివరకు అభ్యర్థి ఎంపికను బాబుకే వదిలేశారని సమాచారం. ఈ విషయంలో జిల్లా నేతలతో శనివారం మరోసారి బాబు సమావేశమై అభ్యర్థి పేరు ఖరారు చేస్తారని తెలిసింది. ఇక్కడ సయోధ్య కుదిరితే అనంతరం జెడ్పీటీసీలను క్యాంపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
 
బరిలో వెంకటాపురం, అశ్వాపురం, ఏన్కూరు జెడ్పీటీసీలు..
చైర్ పర్సన్ రేసులో తుమ్మల వర్గం నుంచి వెంకటాపురం జెడ్పీటీసీ గుడిపల్లి కవిత, నామా వర్గం నుంచి అశ్వాపురం, ఏన్కూరు జెడ్పీటీసీలు తోకల లత, కొపెల శ్యామల ఉన్నారు. టీడీపీ గెలిచిన 19 జెడ్పీటీసీల్లో ఎక్కువ మంది తమ వర్గం వారే ఉన్నారని, చంద్రబాబు తమ వర్గం సభ్యురాలినే చైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రకటిస్తారని తుమ్మల వర్గం భావిస్తోంది.
 
అయితే చంద్రబాబు వద్ద తనకున్న పలుకుబడితో నామా తన అనుచర సభ్యులకే జెడ్పీ చైర్మన్ దక్కేలా చూస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది. జిల్లాలో ఇక తుమ్మల ఆధిపత్యానికి పూర్తిగా బ్రేక్ వేయాలంటే జెడ్పీ చైర్మన్ పదవిని తన అనుచర సభ్యురాలికి దక్కేలా నామా చక్రం తిప్పుతున్నారని పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. నామా వర్గం సభ్యురాలిని చంద్రబాబు చైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రకటిస్తే చివరకు ఏం చేయాలన్న విషయమై ఇప్పటికే తుమ్మల వర్గం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
 
మరొకరి కోసం వేట..
చంద్రబాబు మాటే వేదంగా అంతా ఒక్కతాటిపైకి వచ్చినా టీడీపీలో ఏ వర్గం చైర్మన్ పీఠం దక్కించుకోవాలన్నా మరో పార్టీ సభ్యుడి మద్దతు కీలకం అవుతుంది. ఎన్డీ సభ్యులు గతంలో కూడా తటస్థంగా వ్యవహరించగా, ఈ సారి కూడా అదే విధానం పాటించాలని ఆ పార్టీ నేతలు ఓ నిర్ణయానికి వచ్చారు.

అయితే ఇప్పటికే తుమ్మల వర్గం ఓ అడుగు ముందుకేసి సీపీఎం, సీపీఐ నేతలతో మంతనాలు జరిపినట్లు సమాచారం. చైర్మన్ అభ్యర్థిగా చంద్రబాబు తమ వర్గం సభ్యురాలినే ప్రకటిస్తే ముందస్తు వ్యూహం ఫలిస్తుందని తు మ్మల వర్గం ధీమాగా ఉంది. నామా వర్గం కూడా ఇదే తరహాలో తమ వర్గం సభ్యురాలిని చైర్‌పర్సన్‌ను చేసేందుకు ఆ ఒక్క సభ్యుడి మద్దతు కోసం ఇతర పార్టీ నేతలతో రహస్యంగా మంతనాలు చేసినట్లు సమాచారం.
 
రాజీ కుదరకపోతే..
ఇరు వర్గాల మధ్య చంద్రబాబు చేసిన సయోధ్య కుదరక, తమ అనుచరురాలిని చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించకపోతే తుమ్మల వర్గం ఏం చేస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌కు 10 మంది జెడ్పీటీసీ సభ్యులున్నా అందులో పినపాక జెడ్పీటీసీ జాడి జానమ్మ మాత్రమే ఎస్సీ మహిళ.
 
ఆ పార్టీ చైర్‌పర్సన్ పీఠాన్ని దక్కించుకోవాలంటే మరో పది మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే  చైర్మన్ పీఠం రాజకీయాలకు ఆ పార్టీ నేతలు ఎవరికివారు అంటీముట్టనట్లుగా ఉన్నారు. చంద్రబాబు వద్ద చైర్మన్ పీఠం రాజీ కుదరకపోతే ఇతర పార్టీలు, కాంగ్రెస్ పొత్తుతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూడా తుమ్మల వర్గం వెనకాడదని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement