గులాబీ కూలీ కాదు.. బహిరంగ అవినీతి
కేంద్ర హోంశాఖ, ఈసీ, సీబీఐలకు రేవంత్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: గులాబీ కూలీ పేరిట టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు చట్టవిరుద్ధంగా... బహిరంగ అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు వసూలు చేశారని, చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకొని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర హోం శాఖ, సీబీఐ, రాష్ట్ర ఏసీబీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గులాబీ కూలీ పేరిట జరిగిన బహిరంగ వసూళ్లకు సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా అందజేశారు. గులాబీ కూలీ పేరిట జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు తమ పరిధిలోని సంస్థల్లో కొద్ది సేపు పనిచేసినట్లు నటించి ఆయా సంస్థల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారని రేవంత్ ఫిర్యాదులో స్పష్టం చేశారు.
చేపల విక్రయం, టీ, కాఫీల అమ్మకాల ద్వారా కూడా పెద్ద మొత్తంలో వసూలు చేసుకోవచ్చన్న వినూత్న ఆలోచన కేవలం టీఆర్‌ఎస్ మంత్రులకే వచ్చిందని ఎద్దేవా చేశారు. గులాబీ కూలీ పేరిట జరిగిన వసూళ్లపై విచారణ జరపాలని, చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని కోరామని ఆయన ఒక ప్రకటనలో వివరించారు.