
బండి కాదు మొండి ఇది..
‘వజ్ర’తరహాలోనే మినీ పల్లెవెలుగు బస్సుల్లోనూ తీవ్ర సాంకేతిక సమస్యలు.. ఎక్కడికక్కడ ఆగిపోతున్న వైనం
సీన్–1
రెండు నెలల క్రితమే ఆ బస్సు రోడ్డెక్కింది. అందులో నెలన్నర రోజులు మూలనపడి ఉంది. అధికారులేమో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.. వారేమో బస్సు తయారు చేసిన కంపెనీకి సమాచారమిచ్చారు. కంపెనీ ఇంజనీర్లు వచ్చి దాన్ని పరిశీలించి, మరమ్మతు చేయటం కుదరదని చెప్పి ఏకంగా దాని ఇంజిన్‌నే మార్చారు.
సీన్–2
ప్రయాణికులను తీసుకుని వెళ్తున్న బస్సు ఉన్నట్టుండి రోడ్డుపై ఆగిపోయింది.. కంగారుపడ్డ డ్రైవర్ విషయాన్ని డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాడు.. ఆయనేమో ఉన్నతాధికారులకు.. అక్కడి నుంచి కంపెనీ ఇంజనీర్లకు సమాచారం వెళ్లింది.. వారు వచ్చి చూసి.. ఇంజిన్‌లోకి డీజిల్‌ను పంపే చోట దాన్ని నియంత్రించే డివైస్ పాడైందని చెప్పి షెడ్డుకు తీసుకెళ్లి కొత్తది వేశారు.
రిపేర్లతో షెడ్డుకు తిరగటమే ఎక్కువ
దాదాపు రూ.350 కోట్లు వెచ్చించి 450 వరకు కొత్త బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసింది. అందులో 100 వరకు మినీ బస్సులను కొనుగోలు చేసింది. అయితే ఈ మినీ బస్సుల కొనుగోలులో ఆర్టీసీ పొరపాట్లు చేసింది. నాణ్యమైనవి ఎంచుకునే విషయంలో నిర్లక్ష్యం వహించింది. మినీ బస్సుల తయారీలో కొన్ని కంపెనీలే అందుబాటులో ఉండటం, వాటిపై ఆర్టీసీకి పరిజ్ఞానం లేకపోవటంతో నాణ్యత గల్లంతైంది. అవి రోడ్లపై ఉన్నట్టుండి ఆగిపోయి మొరాయిస్తుండటంతో షెడ్డుకు తీసుకెళ్లి బాగు చేయాల్సి వస్తోంది. అవి ప్రయాణికుల కోసం తిరగటం కంటే షెడ్లకు తిరగటమే ఎక్కువై పోయింది.
గ్యారంటీ దాటితే..
కొత్త బస్సులు కావటంతో నిర్ధారిత సమయం వరకు వాటిని సరఫరా చేసిన కంపెనీలు ఉచితంగా మరమ్మతు చేస్తాయి. ఆ తర్వాత ఖర్చు ఆర్టీసీ భరించాల్సిందే. రెండు నెలల్లోనే అవి చుక్కలు చూపిస్తున్న నేపథ్యంలో.. గడువు తీరిన తర్వాత అవి ఖజానాను ఖాళీ చేస్తాయనే ఆందో ళన వ్యక్తమవుతోంది. త్వరలో మరి న్ని పొట్టి బస్సులు కొనాల్సి ఉండటంతో ఈ వ్యవహారం ఇప్పు డు ప్రాధాన్యం సంతరించుకుంది.
అన్నీ సమస్యలే..
బస్సులో డీజిల్ వినియోగాన్ని నియంత్రించే డివైస్‌లు సరిగా పనిచేయటం లేదు. ఉన్నట్టుండి చెడిపోయి బస్సులు రోడ్డుపైనే నిలిచిపోతున్నాయి. కొన్నింటిలో రేడియేటర్లు లీకై బస్సు ఇంజిన్ వేడెక్కి ఆగిపోతున్నాయి. క్లచ్ ప్లేట్ల సమస్యలు వస్తున్నాయి. ఇంజిన్ ఉన్నట్టుండి ఆగిపోతోంది. వైపర్లు పని చేయడం లేదు. దీంతో పెద్ద వర్షం కురిస్తే రోడ్డు కనిపించక డ్రైవర్లు బస్సును పక్కన నిలిపేస్తున్న సందర్భాలుంటున్నాయి.
ఫిర్యాదులకు వాట్సాప్ గ్రూపు
కొన్న బస్సుల్లో పెద్దవి బాగానే ఉండగా, మినీ బస్సులు మాత్రం నాసిరకంగా ఉన్నట్టు డిపో అధికారులు స్పష్టం చేస్తున్నారు. సగానికిపైగా బస్సులు ఏదో ఓ సమస్యతో మొరాయిస్తుండటంతో డిపో మేనేజర్లు ఫిర్యాదులతో విసిగిపోతున్నారు. దీంతో జిల్లాల వారీగా ఫిర్యాదులకు ఏకంగా వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. అందులో బస్ తయారీ కంపెనీ ఇంజనీర్లను కూడా చేర్చారు. ఇందుకోసం కంపెనీ ప్రత్యేకంగా ఇంజనీర్లను కేటాయించింది. ఎక్కడైనా బస్ మొరాయించగానే సంబంధిత డిపో అధికారులు వివరాలను అందులో అప్‌లోడ్ చేస్తున్నారు. వెంటనే కంపెనీ ఇంజనీర్లు వచ్చి మరమ్మతు చేస్తున్నారు. చాలా సందర్భాల్లో బస్సు అప్పటికప్పుడు
బాగు పడక కంపెనీ గ్యారేజీకి తీసుకెళ్లాల్సి వస్తోంది.
మినీ పల్లెవెలుగు పేరుతో..
ఆర్టీసీ కొనుగోలు చేసిన 100 మినీ బస్సుల్లో 48 ఏసీ బస్సులు పోగా మిగతావి నాన్ ఏసీ మినీ బస్సులు. కొన్ని ఏసీ బస్సులను వజ్ర పేరుతో నడుపుతుండగా.. నాన్ ఏసీ బస్సులను మినీ పల్లెవెలుగు పేరుతో నడుపుతున్నారు. వజ్ర పేరుతో హైదరాబాద్–నిజామాబాద్, హైదరాబాద్–వరంగల్ మధ్య తిరుగుతున్న ఏసీ బస్సులు తీవ్ర సాంకేతిక సమస్యలతో ఉన్న విషయం తెలిసిందే. వజ్ర బస్సులను ఓ కంపెనీ నుంచి, నాన్ ఏసీ మినీ బస్సులను మరో కంపెనీ నుంచి కొనుగోలు చేశారు. ఇప్పుడు ఇవి ఆర్టీసీకి గుదిబండలుగా మారాయి. ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉన్న రూట్లలో పల్లెవెలుగు బస్సులకు ప్రత్యామ్నాయంగా నాన్ ఏసీ మినీ బస్సులను వాడుతున్నారు. అయితే నాణ్యమైన బస్సులు కాకపోవటంతో ఇప్పుడు అసలుకే మోసం వచ్చే పరిస్థితి తలెత్తింది.
ఇలా చెబుతూ పోతే సమస్యలెన్నో.. అవేవీ పాతబడి మరమ్మతు దశకు చేరుకున్నవి కాదు. కొత్తగా రెండు నెలల క్రితమే కొనుగోలు చేసిన మినీ బస్సులు.