భారతమాతకు పరాయిపాలన నుంచి విముక్తి కలిగినరోజులవి.. కానీ తెలంగాణ మాత్రం నిజాం రజాకార్ల దుష్టపాలన కింది నలిగిపోయింది. తెలంగాణ స్వేచ్ఛ, స్వాతంత్రం కోసం ఉద్యమం ఊపందుకుంది. యువత, కార్మిక, కర్షక, విద్యార్థి లోకం కదిలొచ్చింది.. ఇది రుచించని నిజాంసైన్యం ఉద్యమకారులపై గురిపెట్టింది. అప్పంపల్లికి చేరిన పోలీసుదళం గ్రామస్తులపై కాల్పులకు తెగబడింది. భీకరంగా తుపాకుల శబ్దం.. చెల్లాచెదురైన జనం.. చివరికి 11 మందిని పొట్టనపెట్టుకుంది.
చిన్నచింతకుంట, న్యూస్‌లైన్: 1947 ఆగస్టు 15న స్వాతంత్ర సంబరాలు మిన్నంటాయి. ఆంగ్లేయుల చెర నుంచి విముక్తి లభించింది. తెలంగాణ ప్రాంతం మాత్రం నిజాం నిరంకుశ పాలనలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆత్మకూర్ సంస్థానంలో జాతీయ పథకం ఎగరలేదు. ఆగస్టు 22న త్రివర్ణపతాకాన్ని ఎగరవేసినందుకు అమరచింతకు చెందిన దేశాయి మురళీధర్‌రెడ్డి, దాసర్‌పల్లి బుచ్చారెడ్డిలను అరెస్టు చేశారు. ఈ జెండా సత్యగ్రహంలో కీలకభూమిక పోషించిన అప్పంపల్లి ఉద్యమనేత బెల్లం నాగన్న ఈ ప్రాంతంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఎలాగైనా అతని అరెస్ట్‌చేయాలని 1947 అక్టోబర్ 7న రిజర్వుపోలీసు దళాలు అప్పంపల్లికి బయలుదేరాయి. మార్గమధ్యంలో తిర్మలాపూర్ చెరువుకట్టపై కల్లు బండిని బలవంతంగా ఆపి మనస్సారా కల్లు తాగారు.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు రావిచెట్టు వద్ద సమావేశమయ్యారు.
ఆ మత్తులో అప్పంపల్లికి చేరిన పోలీసు బలగాలు వారితో వాగ్వాదానికి దిగారు. తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో పక్కనే ఉన్న విడిది భవనంలోకి వెళ్లి తలదాచుకున్నారు. ఆ రోజు సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో భవనం కిటికి నుంచి రావి చెట్టు వద్ద నిలబడిన ఉద్యమకారులపై భాష్పవాయువును ప్రయోగించి విక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 11 మంది ఉద్యమ కారులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 25 మంది తూటాలు తగిలి తీవ్రంగా గాయపడ్డారు.
సమరయోధులుగా గుర్తించాలి
అప్పంపల్లి తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలి. రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. స్వాతంత్ర సమరయోధుల మాదిరిగా గుర్తించి పింఛన్ ఇవ్వాలి. ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి.
- బెల్లం సాయులు,
ఉద్యమనేత వంశీయులు, అప్పంపల్లి
అమరులు వీరే...
తంగెడి రాంరెడ్డి, చాకలి కురుమన్న, తంగేడి బాల్‌రెడ్డి, కటికె మన్నెమ్మ, హరిజన్ కిష్టన్న, హరిజన్ తిమ్మన్న, తంగేడి లక్ష్మరెడ్డి, గొల్ల గజ్జలన్న, వడ్డెమాన్ నర్సన్న, కుర్వ సాయన్న, పోతురాజు ఈశ్వరయ్య మృతిచెందారు. గార్లపాటి భీంరెడ్డి, మన్నెం కురుమన్న, ఈడిగ తిమ్మక్క, హరిజన్ కిష్టన్న, కల్వలి రాంచెంద్రయ్య క్షతగాత్రులయ్యారు. వీరిని విప్లవకారుడు బెల్లం నాగన్న రైలుమార్గం ద్వారా కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఇంత జరిగినా గ్రామస్తులు నాగన్న ఆచూకీని పోలీసులకు తెలుపలేదు. అనారోగ్యంతో 1983లో మృతిచెందారు.
ఖమ్మం స్ఫూర్తితోనే ఉద్యమం
1969 కంటే రెండు, మూడేళ్ల ముందు తెలంగాణ వ్యాప్తంగా స్థిరపడిన ఆంధ్ర ఉద్యోగాలు వెళ్లిపోవాలని నిరసనలు మొదలైనవి. 1959లో వనపర్తి దివంగత రాజారామేశ్వర్‌రావు భారత ప్రధాని నెహ్రూచే ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలను స్థాపించారు. ఆ కళాశాలలో నేపాల్, భూటన్‌తో పాటు చదువుకునేందుకు విద్యార్థులు, బోధించేందుకు ఆంధ్రోపాధ్యాయులు వచ్చారు. తెలంగాణ ఉద్యమం కారణంగా వారంతా వెళ్లిపోయారు. ఆంధ్రోళ్లు ఇడ్లీ సాంబారుతో తెలంగాణను మభ్యపెడుతున్నారని భావించి అప్పట్లో ‘ఇడ్లీ సాంబారు గోబ్యాక్’ ఉద్యమాలొచ్చాయి. పోలీసుల వేధింపులను తాళలేక అడవులు, ఇతర గ్రామాల్లో రెండు మాడురోజులు ఆహారం లేకుండా తలదాచుకున్నాం.
1969లో గద్వాలకు చెందిన తోటి ఉద్యమకారుడు సర్వోత్తమరెడ్డిని కోల్పోవడం బాధకలిగించే విషయం. ఉద్యమ తీవ్రత ఫలింతగా ఇక్కడున్న సీమాంధ్ర విద్యార్థులు, ఉపాధ్యాయులు వెళ్లిపోయారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం కాకతీయ, సెంట్రల్ యూనివర్సిటీలను మంజూరుచేసింది. ధైర్యంలేని ఉద్యమాలు ఇప్పుడు కొనసాగుతుండటం మూలంగానే ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు జాప్యం జరిగింది.
- వి.రాములు, రిటైర్డ్ కంట్రోలర్, నాగవరం బల్‌రాం మిత్రులు వనపర్తి
నాటి పోరాటం స్ఫూర్తిదాయకం
అప్పటి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడికక్కడ రైలు, బస్‌లను ఆపేశాం. ఇందులో ఎక్కిన మా టిక్కెట్ ‘జై తెలంగాణం’ అని మదనపురంలో ఉద్యమం లేవతీశాం. అప్పటి స్వాతంత్ర సమరయోధుడు దశరథయ్య నేతత్వంలో తెలంగాణ పోరాటం నిర్వహించాం. సమైక్యకు వత్తాసు పలికిన రాజారామేశ్వర్‌రావును ఘెరావ్ చేశాం. మర్రి చెన్నారెడ్డి వెంట యువ నాయకుడిగా తిరుగుతూ ప్రసంగాలు చేసేవాణ్ని. అప్పట్లోకూడా సుమారు 400 మంది విద్యార్థులు చనిపోవడంబాధ కలిగించింది. అప్పట్లో మేధావుల సంఖ్య కూడా తక్కువగా ఉండేది. దీనికితోడు చదువుకున్న వారు తక్కువగా ఉన్నారు. అప్పటికీ సంపన్నులు అరకొరగానే ఉద్యమంలో పాల్గొన్నారు. మదన్‌మోహన్, శ్రీధర్‌రెడ్డి, మల్లికార్జున్, మర్రి చెన్నారెడ్డి, రాజారామేశ్వర్‌రావు వీళ్లంతా తెలంగాణ ప్రజాసమితి తరఫున పార గుర్తుమీద గెలిచి ఇందిరాగాంధీ ముందు మోకరిల్లి పదవుల కోసం తెలంగాణవాదాన్ని పక్కనబెట్టారు.
- స్వరాజ్యం, తెలంగాణవాది వనపర్తి
ప్లాష్‌బ్యాక్ 1969
ఉద్యమమే ఊపిరిగా..
తెలంగాణ ప్రాంతానికి నీళ్లు, నిధులు, ఉద్యోగాల కేటాయింపులో జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహించలేకపోయారు. విద్యార్థులు, యువత, కర్షకులు, కార్మికులను ఏకంచేశారు. ఊరూవాడా ఉద్యమాన్ని ర గిలించారు. నిరంకుశ నిజాం నవాబుకు ఎదురునిలిచారు. ప్రత్యేకరాష్ట్ర ఆకాంక్షను చాటారు. తొలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన నాటి ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవం వేళ తమ జ్ఞాపకాలను ఇలా పంచుకున్నారు..
- న్యూస్‌లైన్, వనపర్తిటౌన్
చాలాసార్లు జైలుకెళ్లాను..
1969లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అప్పట్లో నేను మల్టీపర్పస్ కోర్సు చదువుతుండే వాణ్ని. అప్పట్లో కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్, శ్రీధర్‌రెడ్డి నాయకత్వంలో ఉద్యమాలు జరిగాయి. తెలంగాణ ఉద్యమంలో భాగంగా పదిపదిహేను సార్లు జైలుకు కూడా వెళ్లాను. సీఆర్‌పీ పోలీసులు అడుగడునా ఉద్యమకారులను అదుపులోకి తీసుకునేందుకు నిఘా ఉండేది. ఇప్పడున్న వనపర్తి ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో అప్పట్లో సీఐ కార్యాలయం ఉండేది దానిని తగులబెట్టిన ఉద్యమకారుల్లో నేనూ ఒక్కణ్ని. అప్పట్లో ఈ ప్రాంతానికి రాజకీయ చైతన్యవంతులైన నాయకులుగా దివంగత వనపర్తి ఎమ్మెల్యే జయరాములు, వి. బాల్‌రెడ్డి, టైప్ కృష్ణయ్య ఉన్నారు. అప్పట్లో బంద్‌కు ప్రజలు కూడా పూర్తిస్థాయిలో సహకరించారు. తెలంగాణ ఆకాంక్ష బలపడటంతో 1971లో జరిగిన పార్లమెంట్ మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు చీలిపోయి పారగుర్తుతో తెలంగాణ ప్రజాసమితి తెలంగాణలో 13 ఎంపీస్థానాలకు 11 సీట్లను గెలుచుకుంది.
- యిటూకూరి వెంకటయ్య, వనపర్తి
త్యాగాలతల్లి!
Published Sun, Jun 1 2014 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM
Advertisement
Advertisement