
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆన్‌లైన్ విత్తన ధ్రువీకరణను ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర బృందం ప్రశంసించింది. మంగళవారం కేంద్ర వ్యవసాయ శాఖ విత్తన విభాగ సహాయ కమిషనర్ డాక్టర్ డీకే శ్రీవాస్తవ, ఎన్‌ఐసీ సంచాలకులు రాజేశ్ శ్రీవాస్తవ తదితరుల ఆధ్వర్యంలోని బృందం తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ సంస్థను సందర్శించింది. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విత్తనాభివృద్ధి సంస్థల, విత్తన ధ్రువీకరణ సంస్థల అధికారులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ వచ్చే ఖరీఫ్ నుంచి ప్రతి విత్తన ప్యాకెట్‌పై క్యూఆర్ కోడ్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర రాష్ట్రాలలో అమలు చేయడానికి కావలసిన సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. బార్ కోడింగ్ లేదా క్యూఆర్ కోడింగ్ విధానం ద్వారా విత్తన లాట్లను గుర్తించే విధానాన్ని అమలు చేయడం వల్ల విత్తన నకిలీని అరికట్టవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విత్తన విభాగ సహాయ కమిషనర్ డాక్టర్ డీకే శ్రీవాస్తవ మాట్లాడుతూ.. రాష్ట్రాలకు ఆన్‌లైన్ విత్తన ధ్రువీకరణను ప్రవేశపెట్టటానికి నిధులు సమకూర్చినా ఏ రాష్ట్రం కూడా పూర్తిగా అమ లు చేయలేదని, కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ మొదలు పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తెలంగాణ మాత్రం పూర్తి స్థాయిలో అమలుచేయటం అభినందనీయమని ప్రశంసించారు.
క్యూఆర్ కోడింగ్ విధానం వల్ల ఉత్పత్తిదారుని వివరాల నుండి విత్తన పరీక్షా వివరాల వరకు సంక్షిప్తంగా పొందుపర్చవచ్చని, తద్వారా విత్తనం నాణ్యమైనదో కాదో సులభంగా తెలుసుకోవచ్చన్నారు. తెలంగాణలో అమలుపరచి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు మాట్లాడుతూ 2016 ఖరీఫ్ నుంచి ఎన్నో సమస్యలను అధిగమించి సంపూర్ణంగా ఆన్‌లైన్ విత్తన ధ్రువీకరణ చేస్తున్నట్టు చెప్పారు.
ఈ క్రమంలో చాలావరకు వేరుశనగ, శనగ, సోయాబీన్ పంటల విత్తనోత్పత్తిలో నకిలీ విత్తన కంపెనీలను నివారించినట్టు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఆన్‌లైన్ విత్తన ధ్రువీకరణ క్రమాన్ని అమలు చేయటానికి కావలసిన పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. సమావేశంలో ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సూర బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment