పద్దులు తారుమారు.. ‘మిగులు’ గోల్‌మాల్‌ | Telangana government had exaggerated the revenue surplus, CAG report | Sakshi
Sakshi News home page

పద్దులు తారుమారు.. ‘మిగులు’ గోల్‌మాల్‌

Published Tue, Mar 28 2017 3:28 AM | Last Updated on Sat, Sep 22 2018 8:48 PM

పద్దులు తారుమారు.. ‘మిగులు’ గోల్‌మాల్‌ - Sakshi

పద్దులు తారుమారు.. ‘మిగులు’ గోల్‌మాల్‌

- ప్రభుత్వం రెవెన్యూ మిగులును ఎక్కువ చేసి చూపింది: తప్పుపట్టిన కాగ్‌
- అవాస్తవికంగా 2015–16 బడ్జెట్‌ అంచనాలు
- బలహీనంగా వ్యయ పర్యవేక్షణ, నియంత్రణ
- రూ.3,719 కోట్ల బడ్జెటేతర రుణాలను రాబడిలో చూపారు
- ద్రవ్యలోటు 3.23 శాతం నుంచి 3.87 శాతానికి పెరుగుతుందని అంచనా.. ప్రాజెక్టులు పడకేయడంతో ఆశించిన ప్రయోజనం దక్కలేదు
- సాగునీటి ప్రాజెక్టుల అంచనాలను రూ.14,051 కోట్ల మేర పెంచినా ఫలితం అంతంతే


సాక్షి, హైదరాబాద్‌:
పద్దుల తారుమారుతో రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ మిగులును ఎక్కువ చేసి చూపించిందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తప్పుపట్టింది. బడ్జెట్‌ అంచనాలు అవాస్తవికంగా ఉన్నాయని, వ్యయ పర్యవేక్షణ, నియంత్రణ బలహీనంగా ఉన్నాయని పేర్కొంది. 2015–16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్‌ ఆడిట్‌ నివేదికలను ప్రభుత్వం సోమవారం అసెంబ్లీకి సమర్పించింది. ఆ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ.238 కోట్ల రెవెన్యూ మిగులును సాధించింది. అయితే రూ.151 కోట్ల గ్రాంట్లను పెట్టుబడి (క్యాపిటల్‌) పద్దుల కింద ప్రభుత్వం తప్పుగా వర్గీకరించిందని, రూ.3,719 కోట్ల బడ్జెటేతర రుణాలు రెవెన్యూ రాబడిలో చూపించినట్లు కాగ్‌ గుర్తించింది. అంతమేరకు ద్రవ్యలోటును తక్కువ చేసి చూపించిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రభావంతో జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు 3.23 శాతం నుంచి 3.87 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. పీడీ ఖాతాలలోని మిగులు నిల్వలను రెవెన్యూ రాబడులకు జమ చేయాలని ఆదేశాలు జారీ చేసి పద్దుల విధానాలను ప్రభుత్వం అతిక్రమించిందని కాగ్‌ తప్పుపట్టింది. దీంతో రెవెన్యూ రాబడి రూ.4,218 కోట్ల మేరకు ఎక్కువ చూపించినట్లయిందని పేర్కొంది.

పరిమితి లోపే అప్పులు..
అవాస్తవిక కేటాయింపులతో భారీ మిగుళ్లు, అవసరం లేని అనుబంధ గ్రాంట్లు, కేటాయింపులు లేకుండా చేసిన ఖర్చులు, అదనపు కేటాయింపులన్నీ బడ్జెట్‌ నిర్వహణలో లోపాలుగా కాగ్‌ పేర్కొంది. రూ.1.39 లక్షల కోట్ల కేటాయింపులో వాస్తవంగా అయిన ఖర్చు రూ.1.04 లక్షల కోట్లుగా నిర్ధారించింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు 14వ ఆర్థిక సంఘం సూచించిన 21,55 శాతం పరిమితిలోపే ఉన్నాయని.. జీఎస్‌డీపీలో 21.37 శాతం అప్పులున్నాయని నిర్ధారించింది. ప్రస్తుతం ఉన్న అప్పుల్లో 53 శాతానికి పైగా రాబోయే ఏడేళ్లలోనే తీర్చాల్సి ఉందని అప్రమత్తం చేసింది. కార్పొరేషన్లు, ప్రభుత్వ కంపెనీలు, సహకార సంస్థల్లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ప్రభుత్వం రూ.947 కోట్లు ఎక్కువగా పెట్టుబడులు పెట్టింది. కానీ ప్రతిఫలం మాత్రం తగ్గిందని కాగ్‌ స్పష్టంచేసింది. బాకీల వసూళ్లు తగ్గిపోవటంతో రూ.5,233 కోట్ల చెల్లింపులకు.. కేవలం రూ.88 కోట్లు వసూలయ్యాయని, రెండింటి మధ్య అంతరం గణనీయంగా పెరిగిపోయిందని వివరించింది.

స్తంభించిన ప్రాజెక్టులు, పథకాలు
నీటిపారుదల, రహదారుల రంగాల్లోని ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకపోవటంతో ఆశించిన ప్రయోజనాలు నెరవేరలేదని కాగ్‌ తెలిపింది. అసంపూర్తిగా ఉన్న భారీ సాగునీటి ప్రాజెక్టుల్లో నిధులు స్తంభించిపోయాయని, పూర్తి కావాల్సిన 23 ప్రాజెక్టుల తొలి అంచనాలను రూ.14,051 కోట్ల మేరకు పెంచినా ప్రయోజనం నెరవేరలేదని పేర్కొంది. భూసేకరణ, పునరావాసంలో జాప్యం, అటవీ శాఖ క్లియరెన్సులతో ఆలస్యమైనట్లు ప్రభుత్వం వివరణ ఇచ్చిందని ప్రస్తావించింది. ప్రభుత్వం చేసిన విధాన నిర్ణయాలు, బడ్జెట్‌ విడుదల చేయపోవటం, పథకాలను అమలు చేసే సామర్థ్యం కొరవడటంతో పాక్షికంగా అమలయ్యాయని కాగ్‌ పేర్కొంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం, ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో ఆర్థిక చేయాతనిచ్చే పథకాలు, ఆరోగ్య లక్ష్మి, పోషకాహార పథకం, ప్రారంభిక్‌ శిక్షా కోష్, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన, స్మార్ట్‌ సిటీ డెవలప్‌మెంట్‌ స్కీమ్, తెలంగాణకు హరితహరం, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ పథకాల్లో నిధులు ఖర్చు కాలేదని పేర్కొంది. ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద 48 శాతం, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద 49 శాతం నిధుల వినియోగం జరిగిందని మిగతా నిధులు విడుదల చేయకపోవటంతో అనుకున్న ప్రయోజనం నెరవేరలేదని వివరించింది. శాసనసభ సాధికారత లేకుండానే రూ.5,881 కోట్ల మేర అదనపు వ్యయం చేశారని, నిర్దిష్టమైన ఖర్చుల వివరాలు లేకుండా రూ.55 కోట్లు గంపగుత్త కేటాయింపులు చేయటాన్ని కాగ్‌ తప్పు పట్టింది. జిల్లా పరిషత్‌లకు సంబంధించి భవిష్య నిధి (పీఎఫ్‌) చందాలపై రూ.716 కోట్ల మేరకు వడ్డీ చెల్లించాల్సిన ప్రభుత్వం అందుకు తగిన నిధులను కేటాయించలేదని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement