రుణ బాధల నుంచి రైతులకు ఉపశమనం కల్పించడం కోసం తెలంగాణ ప్రభుత్వం పంటల రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టింది. స్వల్పకాలిక ఉత్పాదక రుణాలకు, బంగారం తనఖా పెట్టి బ్యాంకుల వద్ద తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. 2014 మార్చి 31 నాటికి పంట రుణ వితరణ జరిగి ఉండి, ఇంకా బాకీ చెల్లించకుండా ఉన్న పంట రుణం మొత్తానికి 2014 ఆగష్టు 31 దాకా వర్తించే వడ్డీని కలిపిన మొత్తం లేదా లక్ష రూపాయలు, ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే ఆ మొత్తం మేరకు ఒక్కో రైతు కుటుంబానికి రుణమాఫీ అర్హత ఉంటుంది.
పంట రుణాల విషయంలో కాగ్ ఆడిట్‌లో వెల్లడైన ముఖ్యమైన అంశాలు..
► పథకం మార్గనిర్దేశాల ప్రకారం ఆధార్ నెంబరు తప్పని సరైనప్పటికీ అది లేకుండానే లబ్ధిదారుల ధృవీకరణ జరిగింది. డుప్లికేటు/బహుళ ఆర్థిక సాయం పొందిన లబ్ధిదారులను తొలగించేందుకు సామాజిక ఆడిట్ నిర్వహించలేదు.
► బహుళ జిల్లాల్లో లేదా మండలాల్లో ఉన్న వ్యవసాయ భూములపై రైతులు ఇతర జిల్లా బ్యాంకు శాఖల నుంచి తీసుకున్న రుణాలను డిపార్ట్‌మెంట్ సరిచూసుకోలేదు.
► రైతు కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణించే పథకంలోని మార్గదర్శకాలకు భిన్నంగా రైతు మిత్ర బృందాలు/రైతు సంఘాలకు చెందిన పంట రుణాలను మాఫీ చేశారు.
► లబ్ధిదారులు చెల్లించాల్సిన పంట రుణాలపై బ్యాంకులు రూ.183.98 కోట్ల వడ్డీని ఎక్కువగా క్లైయిమ్ చేశాయి. మాఫీ చేసే మొత్తంలో వడ్డీ కూడా ఇమిడి ఉంటుందని పథకం మార్గదర్శకాలు నిర్దేశించినా కొన్ని బ్యాంకులు వడ్డీని క్లైయిమ్ చేయలేదు. ఫలితంగా అర్హులైన రైతులు రూ. 66.16 కోట్ల మేర వడ్డీ మాఫీని పొందలేకపోయారు.
► నిధులను సరిపోల్చి చూసుకోవడంలో బ్యాంకుల జాప్యం కారణంగా బ్యాంకులు, జేడీఏలచే వినియోగం కాకుండా మిగిలిపోయిన మొత్తాలను ప్రభత్వ ఖాతాకు జమచేయడంలో జాప్యం ఉంది.
►డిపార్ట్‌మెంట్‌కు వినియోగ ధృవపత్రాలను సమర్పించిన తరువాత కూడా బ్యాంకు బ్రాంచీల వద్ద, నోడల్ బ్యాంకుల వద్ద ఖర్చుకాని మొత్తాలు ఉండిపోయాయి.