సాక్షి, హైదరాబాద్ : కరోనా మహమ్మారి కట్టడికి లాక్‌డౌన్ అమలవుతున్న క్రమంలో అద్దె ఇళ్లలో ఉండేవారికి తెలంగాణ ప్రభుత్వం ఊరట కల్పించింది. మార్చి నుంచి మూడు నెలల పాటు ఇళ్ల అద్దెను వసూలు చేయరాదని గృహ యజమానులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. విపత్తు నిర్వహణ చట్టం 2005 సెక్షన్ 38(2), ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897ల ప్రకారం ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అద్దె బకాయిలను మూడు నెలల తర్వాత సులభ వాయిదాల్లో తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
ఈ మూడు నెలల అద్దె బకాయిలకు యజమానులు ఎలాంటి వడ్డీని వసూలు చేయరాదని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే సంబంధిత చట్టాల కింద కఠిన చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా ఇంటి యజమానులు మూడు నెలల పాటు అద్దె వసూలు చేయరాదని గతవారం జరిగిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ విపత్తు సమయంలో ప్రభుత్వ నిర్ణయానికి సహకరించాలని ఆయన ఇళ్ల యజమానులను కోరారు.
కాగా తెలంగాణతో కొత్తగా 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్‌లో 13, జోగులాంబ గద్వాల్‌లో 10 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 970కి చేరిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment