బల్దియాలో ఎన్నికల కోలాహలం | Telangana Municipal Election Arrangements Karimnagar | Sakshi
Sakshi News home page

బల్దియాలో ఎన్నికల కోలాహలం

Published Fri, May 17 2019 12:35 PM | Last Updated on Fri, May 17 2019 12:35 PM

Telangana Municipal Election Arrangements Karimnagar - Sakshi

కరీంనగర్‌కార్పొరేషన్‌: కరీంనగర్‌ నగరపాలక సంస్థలో చివరి స్టాండింగ్‌ కమిటీకి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. స్టాండింగ్‌ కమిటీ ఎన్నిక పూర్తయితే నెల రోజులే పదవీకాలం ఉంటుంది. యేడాదికోసారి జరిగే స్టాండింగ్‌ కమిటీకి తీవ్ర పోటీ ఉండేది. పాలకవర్గం గడువు జూలై 2తో ముగియనుండడంతో చివరిసారిగా స్టాండింగ్‌ కమిటీకి ఎన్నికైన సభ్యులు నెలరోజులు తమ పదవిలో ఉంటారు. నెల రోజుల పదవి కోసం సైతం బల్దియాలో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈ నెల 29న స్టాండింగ్‌ కమిటీ నియామకం కోసం ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ జారీ చేశారు.

గురువారం నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది. ప్రస్తుత స్టాండింగ్‌ కమిటీ  కాలపరిమితి ఈ నెల 22తో ముగియనుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 23న, మండలి ఎన్నికల ఫలితాలు 27 వెలువడనుండడంతో బల్దియా స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలను 29న నిర్వహించనున్నారు. స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఆశావహుల్లో సందడి కనిపించింది. పాలకవర్గం ఏర్పడ్డ రెండేళ్ల తర్వాత 2016 మే 23న మొదటి స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలు జరుగగా, 2017 మే 23న రెండవ కమిటీకి, 2018 మే 23న మూడవ కమిటీ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం నాల్గవ(చివరి) కమిటీ కోసం పోటీ మొదలైంది.

ఏకగ్రీవానికే ప్రయత్నం..?
నెల రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండడంతో చాలామంది ఆసక్తి చూపడం లేదు. కొంతమంది స్టాండింగ్‌ కమిటీలో సభ్యులుగా ఉండాలనే పట్టుదలతో ఉన్నారు. ఈసారి చివరి అవకాశం కావడంతో ఆశావహులు కమిటీలో చోటు కోసం గట్టిపట్టు పట్టే అవకాశాలు ఉన్నాయి. అధికార పార్టీలో తీవ్ర పోటీ ఉండడంతో స్టాండింగ్‌ కమిటీ ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది. 2018లో జరిగిన స్టాండింగ్‌ కమిటీలో కాంగ్రెస్‌ అభ్యర్థిని బరిలో నిలిపి వారి బలానికి మించిన ఓట్లు సాధించారు.

ప్రస్తుతం అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో 41 మంది కార్పొరేటర్లు, కాంగ్రెస్‌ ఐదుగురు, బీజేపీ ఇద్దరు, ఎంఐఎంకు ఇద్దరు కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొదటి, రెండవ, మూడవ స్టాండింగ్‌ కమిటీలో సభ్యులుగా కొనసాగిన 15 మంది మినహాయిస్తే... దాదాపుగా అందరు కార్పొరేటర్లు స్టాండింగ్‌ కమిటీపై ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మేయర్‌ రవీందర్‌సింగ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌లు నిర్ణయించిన వారికే స్టాండింగ్‌ కమిటీలో చోటు దక్కనుంది. ఎలాంటి ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా స్టాండింగ్‌ కమిటీ ఎన్నిక పూర్తి చేసే ప్రయత్నం జరుగుతోంది.

షెడ్యూల్‌ ఇదీ...

  •      16 నుంచి 22 వరకు నామినేషన్ల స్వీకరణ
  •      23న పరిశీలన, అర్హత ఉన్న నామినేషన్ల ప్రకటన 
  •      24 నుంచి 26వ ఉపసంహరణ, అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రకటన
  •      29న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల నిర్వహణ, సాయంత్రం 4 గంటలకు ఓట్లు లెక్కించి విజేతల ప్రకటన

ఐదుగురికి అవకాశం...
స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలను జీవో 59 ప్రకారం నిర్వహిస్తారు. 50 డివిజన్లకు కలిపి 10 డివిజన్లకు ఒక సభ్యుని చొప్పున ఐదుగురు సభ్యలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. పోటీలో ఉన్న అభ్యర్థులకు కార్పొరేటర్లు ఐదు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఎ క్కువ ఓట్లు వచ్చిన వారు స్టాండింగ్‌ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారు. ఓటింగ్‌ సీక్రెట్‌ బ్యాలెట్‌ ద్వారానే జరగనుంది.

ఎన్నిక నామమాత్రమే..!
అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ బలం 41కి చేరుకోవడంతో ఎన్నిక ఏకపక్షంగానే ఉంటుందని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో 10 మంది కార్పొరేటర్లు ఉన్న కాంగ్రెస్‌ ప్రస్తుతం ఐదుగురు కార్పొరేటర్లకే పరిమితమైంది. బీజేపీకి 2, ఎంఐఎంకు 2 సీట్లు ఉన్నాయి. నెల రోజుల గడువు ఉన్నా సరే చివరి అవకాశంగా వచ్చిన ఈ ఎన్నికల్లో స్థానం దక్కించుకునేందుకు అధికార పార్టీకి చెందిన ఆశావహులు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. గతంలో స్టాండింగ్‌లో అవకాశం దక్కని వారు చివరి స్టాండింగ్‌ కమిటీలో తమకు అవకాశం ఇవ్వాలంటూ కార్పొరేటర్లు ఎవరికి వారు ఎమ్మెల్యే, మేయర్‌ల వద్ద ప్రయత్నం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement