
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరిగాయి. సగటున 4.42 శాతం చొప్పున పెంచుతూ ఛార్జీల టారిఫ్ ఆర్డర్ను ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ శుక్రవారం విడుదల చేశారు. గృహ అవసరాల విద్యుత్ పై 1.3 శాతం ఛార్జీలను పెంచారు. పౌల్ట్రీలకు యూనిట్ పై రెండు రూపాయల తగ్గింపు ప్రకటించారు. మొత్తంగా 4.42 శాతం విద్యుత్ ఛార్జీలను పెంచారు.
పెంచిన విద్యుత్ ఛార్జీలతో తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.816 కోట్లు కాగా, తెలంగాణ ప్రభుత్వంపై పడనున్న సబ్సిడీ భారం రూ. 4,227 కోట్లు. కుటీర పరిశ్రమలకు విద్యుత్ ఛార్జీల పెంపు లేదని ఈ సందర్భంగా ఇస్మాయిల్ అలీఖాన్ వెల్లడించారు. అయితే మొదటి 200 యూనిట్ల వరకు పాత విద్యుత్ ఛార్జీలే అమలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. అంటే.. గృహ అవసరాలకు వాడుకునే విద్యుత్తులో కూడా 200 యూనిట్లకు మించని పక్షంలో పాత చార్జీలే అమలవుతాయి. ఆ పైన మాత్రమే 1.3 శాతం చొప్పున పెరుగుతాయన్నమాట.