అమలులోకి తెలంగాణ రాష్ట్ర పోలీసు కొత్త లోగో
-
అందరికీ ఒకటే 60 వేల మంది సిబ్బందికి దశలవారీగా పంపిణీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పోలీసులకు కొత్త లోగో అమలులోకి వచ్చింది. ఉమ్మడిరాష్ట్రంలో ధరించిన లోగోకు బదులుగా ఈ కొత్త లోగోను ధరించాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తమిళనాడు, హర్యానా, కర్ణాటకలకు చెందిన తయారీదారులకు మొత్తం 60 వేల లోగోలకు పోలీసుశాఖ ఆర్డర్లిచ్చినట్టు తెలిసింది. నెవీబ్లూ రంగు బ్యాక్‌గ్రౌండ్‌తో పైన బంగారురంగు సింహాలతో కూడిన అశోకచిహ్నం, దాని కింద ‘సత్యమేవజయతే’ సూక్తిని ఏర్పాటు చేశారు.
తెల్లరంగులో తెలంగాణ స్టేట్ అని రాసి, దాని కింద పోలీస్ అని రెడ్‌బ్రాండ్‌తో పెద్ద అక్షరాలను చిత్రీకరించారు. దీని కింద డ్యూటీ, ఆనర్, కంపాషన్ అని పోలీసు విద్యుక్త ధర్మాన్ని సూచించే అక్షరాలను పేర్కొన్నారు. ఈ లోగో రూపకల్పనకు వివిధ రాష్ట్రాలతో పాటు, కేంద్రప్రభుత్వ పరిధిలోని వివిధ పోలీసు బలగాలు, అంతర్జాతీయ పోలీసు శాఖలు ఉపయోగిస్తున్న లోగోలను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. ఆడంబరాలకు పోకుండా సరళంగా కనిపించేలా రాష్ట్ర పోలీసు లోగోను పోలీసు అధికారుల కమిటీ రూపొందించింది.
ఇందుకు ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ సహకారం తీసుకున్నారు. దీనిని అందరికీ ఆమోదయోగ్యంగా రూపొందించడంలో డీజీపీ అనురాగ్‌శర్మ నేతృత్వంలో ిపీ అండ్ ఎల్ ఐజీ నవీన్‌చంద్, ఇంటెలిజెన్స్ ఎస్‌పీ రమేశ్ తదితర అధికారులు నెలా పదిహేను రోజులుగా తీవ్రంగా కృషి చేశారు. లోగోలో పేర్కొన్న డ్యూటీ, ఆనర్, కంపాషన్ అనే పదాలకు అధికారులు విస్తృతార్థాలను కల్పించారు. డ్యూటీకి సంయమనం, నిష్పక్షపాతం, బాధ్యతాయుతం, రహస్యాలను కాపాడడం, చట్టాన్ని గౌరవించడంగా పేర్కొన్నారు.
అలాగే ఆనర్ అనే పదానికి నిజాయతీ, పారదర్శకత, సమగ్రత, ప్రతిష్ఠ, గౌరవంతో మెలగడంగా పేర్కొన్నారు. కంపాషన్ అంటే మానవత్వం, సానుభూతి, కరుణ, సహనం, సేవాగుణం, ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకోవడం, జవాబుదారీతనం, ప్రజాస్వామికంగా వ్యవహరించడం, స్నేహంగా మెలగడం వంటి గుణాలను విశదీకరించారు. ఇదిలాఉండగా, లోగో పొడవు 98 మిల్లిమీటర్లు, వెడల్పు 76 మిల్లిమీటర్లు ఉంది. ఇదే లోగోను కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు ధరించాల్సి ఉంటుంది.