
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పగలూ రాత్రి సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఒకట్రెండు చోట్ల మినహా చాలా ప్రాంతాల్లో నాలుగైదు డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మహబూబ్‌నగర్‌లో సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రత 35 డిగ్రీలు నమోదు కావడం గమనార్హం. హైదరాబాద్, ఖమ్మం, మెదక్‌లలో 4 డిగ్రీలు అధికంగా 33 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హకీంపేటలోనూ నాలుగు డిగ్రీలు ఎక్కువగా 31 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. భద్రాచలంలో 2 డిగ్రీలు అధికంగా 32 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే మూడు డిగ్రీల వరకు పెరిగాయి. మహబూబ్‌నగర్‌లో 3 డిగ్రీలు ఎక్కువగా రాత్రి 20 డిగ్రీలు నమోదైంది. నిజామాబాద్, రామగుండంలలో 3 డిగ్రీలు అధికంగా, హైదరాబాద్‌లో 2 డిగ్రీలు అధికంగా 17 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఖమ్మంలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా 13 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక ఆదిలాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రత ఏకంగా 7 డిగ్రీలే నమోదుకాగా, పగటి ఉష్ణోగ్రత మాత్రం దానికి నాలుగు రెట్లకంటే అధికంగా 30 డిగ్రీలు రికార్డు కావడం విశేషం. ఇతర ప్రాంతాల్లో రాత్రి, పగటి ఉష్ణోగ్రతల మధ్య తేడా రెండింతలు అటుఇటుగా నమోదుకాగా, ఆదిలాబాద్‌లో నాలుగింతలకంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment