సాక్షి ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్: జలవివాదాలను తిరగ దోడాలని, సాగునీటి సమస్యలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఎదురవుతున్న చిక్కులు, పాత వివాదాలపై తమవైఖరిని కేంద్రం వద్ద ఏకరువు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఉన్నతాధికారుల బృందంతో సాగునీటిశాఖమంత్రి హరీశ్‌రావు సోమవారం ఢిల్లీ వెడుతున్నారు. కేంద్రమంత్రి ఉమాభారతితోపాటు కృష్ణా, గోదావరి ట్రిబ్యునళ్ల ైచైర్మన్లు, కేంద్రజలసంఘం ఉన్నతాధికారులతోనూ భేటీ కానున్నారు. కృష్ణా నీటివిడుదల, లోయర్ సీలేరు తదితర అంశాలపై ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఏకపక్షధోరణి పై కూడా మంత్రి ఢిల్లీకి ఫిర్యాదు చేయనున్నారు.
మళ్లీ పంచాల్సిందే : కృష్ణాబేసిన్ పరిధిలోని నాలుగు రాష్ట్రాల నడుమ నీటికేటాయింపులను మరింత శాస్త్రీయంగా, అవసరాల ప్రాతిపదికన పునస్సమీక్షించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలతో పాటు, కల్వకుర్తి, కొడంగల్, జూరాల-పాకాల, పాలమూరు వంటి ఎనిమిది కొత్త ప్రాజెక్టుల అవసరాలను తీర్చాలని కోరనుంది. కొన్ని అక్రమ ప్రాజెక్టులు ట్రిబ్యునల్ దృష్టికి రాలేదనీ, ప్రస్తుతం వాటిపైనా విచారణ జరిగేందుకు కేంద్రజలసంఘం వద్ద ఒక పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. అలాగే కృష్ణా ట్రిబ్యునల్ చైర్మన్‌ను కలసి ఒక నివేదికనూ సమర్పించనుంది. సీమాంధ్రతో పోలిస్తే...తెలంగాణలోనే కృష్ణా పరీవాహక ప్రాంతం 52,229 చదరపు కిలో మీటర్ల (68.50 శాతం) ఉందని, కేటాయింపులు మాత్రం 36.86 శాతం మాత్రమే ఉన్నాయని చెప్పనుంది. ఇప్పటికే కేటాయించిన 299 టీఎంసీలతో పాటు మరో 441 టీఎంసీలను తెలంగాణకు కేటాయించాలని కోరనున్నారు. ప్రాజెక్టుల్లో నీటినిల్వలు లేకపోయినా ఆంధ్రప్రదేశ్‌కు ఏకపక్షంగా తాగునీటి పేరిట విడుదల కొనసాగించారనీ, అలాగే పోలవరం బిల్లు ద్వారా ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్లిన లోయర్ సీలేరు జలవిద్యుదుత్పత్తి లెక్కలు ఇవ్వకుండా సతాయిస్తున్నారనీ తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ వైఖరి తమకు ఇబ్బందిగా మారిందనీ, తమ ప్రభుత్వ ఆలోచనలను తప్పుబడుతూ, ఏపీ ప్రభుత్వ డిమాండ్లపై వేంగంగా స్పందిస్తున్న కేంద్రం, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయహోదాపై మాత్రం మాట్లాడటం లేదని ఆరోపించనుంది. ఇందుకోసం ఢిల్లీలో ప్రత్యేకంగా ఓ సమావేశం నిర్వహించాలని మంత్రి హరీశ్ కోరనున్నారు. కాగా, అంతర్రాష్ట్ర జలవివాదాల్ని పరిష్కరించుకుందామంటూ కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా లేఖలు రాయాలని కూడా సర్కార్ నిర్ణయించింది.
మా నీటి కటకటల మాటేమిటి?
Published Sun, Jul 13 2014 1:39 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM
Advertisement