‘కృష్ణా’లో పాత వాటా ఒప్పుకోం
కేంద్ర జల వనరుల శాఖకు స్పష్టం చేసిన తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగానికి సంబంధించి గత సంవత్సరాల మాదిరే 512:299 నిష్ప త్తిలో నీటిని పంచుకోవాలన్న కేంద్ర జల వనరుల శాఖ సూచనను తెలంగాణ తిరస్క రించింది. పాత వాటా ప్రకారమే 2017–18 వాటర్ ఇయర్‌లో నీటి వినియోగం ఉండా లన్న సూచనను ఒప్పుకోమని స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా జలాల్లో వాటా పెరగాల్సిందేనని, దీన్ని తేల్చేందుకు వీలైనంత త్వరగా తెలంగాణ, ఏపీలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది.
ఈ మేరకు నీటిపారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్‌కే జోషీ కేంద్ర జల వనరుల శాఖ జాయింట్ సెక్రటరీ సంజయ్ కుందూకు మంగళవారం లేఖ రాశారు. కృష్ణా జలాలపై ఇరు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలున్నా ఒక్కదానికీ పరిష్కారం దొరకలేదు. ఏటా తాత్కాలిక సయోధ్య కుదురుస్తోంది. అయితే, ఈ ఏడాది సమావేశాల ఊసే ఎత్తలేదు. పట్టిసీమ సహా దిగువ ప్రాజెక్టులకు నీటి విడుదల, ప్రాజె క్టుల నియంత్రణ అంశాలపై ఎటూ తేల్చ లేదు. నీటి వినియోగ అంశాల్లో కృష్ణా బోర్డు నేరుగా ఫిర్యాదు చేసినా పట్టనట్లు వ్యవహ రించిన కేంద్రం ఈ నెల రెండో వారంలో ఇరు రాష్ట్రాలకు లేఖ రాసింది.