సంబురాలు షురూ...
సాక్షి, నల్లగొండ :మహిళల రంగవల్లులు.. బతుకమ్మ పాటలు.. ఉట్టిపడిన తెలంగాణ సంస్కృతీ సంప్రదాయం.. ఉత్సాహంగా సాగిన పురుషుల ఆటల పోటీలు.. వీటిని వీక్షించేందుకు పోటీపడిన ప్రజలతో బుధవారం జిల్లావ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా బుధవారం నుంచి ఆరు రోజుల పాటు అధికార యంత్రాంగం ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి రోజు అన్ని మండలాల్లో మహిళలకు మ్యూజికల్ చైర్, బతుకమ్మ, ముగ్గుల పోటీలు, పురుషులకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారు 29వ తేదీన డివిజన్‌స్థాయి పోటీల్లో పాల్గొంటారు. మహిళలు, పురుషులు చాలా ఉత్సాహంగా ఆటల పోటీల్లో పాల్గొని సంతోషాలను పంచుకున్నారు. కొన్ని మండలాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఉత్సవాలు ప్రారంభం కాగా... మరికొన్ని మండలాల్లో స్థానిక అధికారులు మొదలుపెట్టారు. జిల్లాకేంద్రంలోని మేకల అభినవ్ అవుట్‌డోర్ స్టేడియంలో కలెక్టర్ టి. చిరంజీవులు ఉత్సవాలను ప్రారంభించారు.
జిల్లావ్యాప్తంగా ఇలా.....
భువనగిరి, వలిగొండ, బీబీనగర్‌లో ఉత్సవాలను స్థానిక ఎమ్మెల్యే పి. శేఖర్‌రెడ్డి ప్రార ంభించారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రారంభించారు. నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూరు, రామన్నపేటలో ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. కోదాడలో మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓ, ఎమ్మార్వోలు ఉత్సవాలను ప్రారంభించారు. హుజూర్‌నగర్ మండల పరిషత్ కార్యాలయంలో మహిళలకు ముగ్గలు, బతుకమ్మ పోటీలు నిర్వహించారు. త హశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన వాలీబాల్ , కబడ్డీ పోటీల్లో పురషులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణంలో జూని యర్ కళాశాలలో పురుషులకు నిర్వహించిన పోటీలను ఆర్డీఓ ప్రారంభించారు. మహిళలకు ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ పోటీలు నిర్వహించారు. మొదటి రోజు విజేతల పేర్లను డివిజన్ స్థాయికి పంపించారు. వీరంతా 29వ తేదీన డివిజన్ స్థాయిలో జరిగే పోటీల్లో తలపడనున్నారు.