‘గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట..’ పాటను ఓ అల్ట్రామోడ్రన్ క్లబ్/పార్టీ ప్లేస్‌లో వినడం సాధ్యమా? ‘రావయ్యా ముద్దుల మావా.. నీకు రాసిస్తా రాయలసీమా’ పాటను కాలేజ్ ఈవెంట్స్‌లోనో, కాఫీ హౌస్‌లోనో ఊహించగలమా? ‘ఇదిఅరబిక్ కడలందం, ప్రియా ప్రియా చంపొద్దే’ తదితర పాటలు ఇంకెక్కడైనా వినొచ్చేమో, ఆశించొచ్చేమో... కానీ లాంజ్‌లు, గ్యాలరీల్లో కాదు కదా! ఇలాంటి అంచనాలను తలకిందులు చేస్తూ తెలుగు సినిమా పాటల్ని మోడ్రన్ వేదికలపైవినిపిస్తుందో బ్యాండ్.
సాక్షి, సిటీబ్యూరో: సిటీలో ఏ క్లబ్‌కి వెళ్లినా, ఏ కల్చరల్ హబ్‌కి వెళ్లినా, కాఫీషాప్‌కి వెళ్లినా... తెలుగు పాటలు వినిపించడం కష్టమే. ఎవరో పాత తరానికి, తలపండిన పండితులకు తప్ప.. కాలేజీ వేడుకల్లో, పార్టీ ప్లేస్‌లలో, డ్యాన్స్ ఫ్లోర్‌లలో నవతరానికి మన పాట చాలా దూరంగా ఉందనిపిస్తున్న పరిస్థితుల్లో... ఇప్పుడిప్పుడే నగరంలో తెలుగు రాక్ సౌండ్ వినిపిస్తోంది. సాధారణంగా సిటీలో ఆర్ట్, మ్యూజిక్‌కి పేరొందిన గ్యాలరీ కెఫె లాంటి చోట్ల బ్యాండ్స్ అందించే ఇంగ్లిష్, వెస్ట్రన్ మ్యూజిక్ కోసం జనం ఎదురు చూస్తారు. చురాలియా హై, గులాబీ ఆంఖే తదితర డీజే మిక్స్ చేసిన బాలీవుడ్ పాటలే సందడి చేస్తాయి. అయితే ఇప్పుడు 788 అవెన్యూ, హైలైఫ్, టబ్యుల్లా రాసా లాంటి పార్టీ ప్లేస్‌లలో కూడా తెలుగు సరాగాలు వీనుల విందు చేస్తున్నాయి. ఆధునికులకు నచ్చే రీతిలో మన భాషలో సందడి చేసే మ్యూజిక్ బ్యాండ్స్ సిటీలో కాప్రిసియో, జామర్స్, నిరావల్, థియరీ తదితర ఉన్నాయి. వీటిలో తొలి తెలుగు ఫ్యూజన్ బ్యాండ్‌గా కాప్రిసియో పేరొందింది. ఏడాదిన్నర క్రితం ప్రారంభమైన ఈ బ్యాండ్ కొన్ని పాటల్ని కలిపి కుట్టి, వెరైటీగా అందించే మెడ్లీలకు పాపులర్ అయింది.
పాటల బాటలో...
ఈ బ్యాండ్‌లోని సింగర్ ఏక్‌నాథ్ కిరణ్ పాడుతా తీయగా, రేడియో సిటీ సూపర్ సింగర్స్, బీట్స్ ఆఫ్ బీటెక్ తదితర కాంటెస్ట్‌ల ద్వారా పేరొందాడు. ఏడేళ్ల వయసులోనే తబలా సాధన ప్రారంభించి 60 నిమిషాల్లో 30 వాయిద్యాలను ప్లే చేసి లిమ్కాబుక్స్‌లో చోటు దక్కించుకున్న పెర్క్యుషనిస్ట్ సాయితేజ... షార్ట్‌ఫిల్మ్ మ్యూజిక్ కంపోజర్‌గా అవార్డు అందుకున్న పాకలపాటి శ్రవణ్.. హిప్‌హాప్ మ్యూజిక్ ప్రేమికుడిగా, బేస్ గిటారిస్ట్‌గా పేరొందిన శామ్... వీరందరూ సంగీతంతో పాటు తెలుగుపై ఇష్టంతో చేతులు కలిపారు. పాటల బాటలో బ్యాండ్‌గా ఏర్పడ్డారు. ‘మేమంతా క్లాసికల్ మ్యూజిక్‌లో శిక్షణ పొందినవాళ్లమే. అందరికీ సంగీతం ఉమ్మడి అభిరుచి. విభిన్న రకాల పాటల మేళవింపుతో ఒక వినసొంపైన సంగీతాన్ని అందించాలనే ఆలోచనతో ఈ బ్యాండ్ ప్రారంభించాం’ అంటూ వీరు గుర్తు చేసుకున్నారు.
తెలుగుకే డిమాండ్...
‘మేం కూడా అన్ని బ్యాండ్స్‌లాగే పాడడంతో ప్రారంభించాం. స్టోన్ వాటర్స్ లాంటి చోట్ల బాలీవుడ్ వినిపించేవాళ్లం. అయితే మధ్యమధ్యలో తెలుగును వినిపించడం మొదలెట్టాం. ఆ సమయంలో అతిథుల నుంచి మరిన్ని తెలుగు పాటల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. దాంతో బాలీవుడ్–టాలీవుడ్ సగం పాడేవాళ్లం. ఇప్పుడు పూర్తి తెలుగు ఫ్యూజన్ బ్యాండ్‌గా పేరొందాం’ అంటూ వివరించిందీ బృందం. ప్రాంతీయ సంగీతాన్ని ప్రోత్సహిస్తున్న మమ్మల్ని... తెలుగుకే పరిమితం కావాలని కోరుతూ మూన్‌షైన్ ప్రాజెక్ట్ పీపుల్ ఇందులో సహకరించారు. ఈ బ్యాండ్స్‌కి ప్రాధాన్యం పెరుగుతున్న క్రమంలో టాలీవుడ్ సింగర్స్ సైతం ఇటువైపు వస్తున్నారు. నేపథ్య గాయకుడిగా దాదాపు 100 పాటలు పాడిన సింగర్ దినకర్ కల్వల ఈ బ్యాండ్‌తో గొంతు కలపనున్నారు.
మోత మోగించాలని...
విఖ్యాత సంగీత దిగ్గజాలు ఇళయరాజా, ఏఆర్ రెహమాన్‌ల పాటలు వింటూ పెరిగిన వీరు... త్వరలో తమ సొంత ట్రాక్స్‌తో ఆల్బమ్ విడుదల చేయాలనుకుంటున్నామన్నారు. ‘అంతర్జాతీయ స్థాయిలో తెలుగు పాటల్ని తీసుకెళ్లాలనేది మా ఆలోచన. మోడ్రన్ వేదికలపై మరింతగా తెలుగు మోత మోగించాలని కోరుకుంటున్నాం’ అని చెప్పారు. తమ అభిమాన బ్యాండ్ అగమ్ కాగా, తైక్కుండామ్ బ్రిడ్జ్, మసాలా కాఫీ వంటి బ్యాండ్స్ కూడా ఇష్టమేనన్నారు. తెలుగుకు ప్రాధాన్యత ఇచ్చినంత మాత్రాన తామేమీ ఆంగ్ల ట్రాక్స్‌కి వ్యతిరేకం కాదనీ... జాన్ మేయర్, కోల్డ్ ప్లే వంటివారి పాటల్ని బాగా ఇష్టపడతామని, వాటిలోని మంచి ఫ్లేవర్‌ని మన పాటల్లో ఉపయోగించేందుకు ప్రయత్నిస్తుంటామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment