‘అవేర్’ కళాశాల వద్ద ఉద్రిక్తత | Tensions in awer college | Sakshi
Sakshi News home page

‘అవేర్’ కళాశాల వద్ద ఉద్రిక్తత

Published Tue, May 20 2014 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM

Tensions in awer college

అశ్వారావుపేట, న్యూస్‌లైన్ :   అవేర్ సంస్థకు చెందిన స్థానిక వ్యవసాయ ఇంటర్మీడియేట్ కళాశాల విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. ఏడుగురు విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో తొలుత రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో చేశారు. రాస్తారోకో చేయొద్దని, కళాశాల వద్దే ఆందోళన చేయాలని ఎస్సై రమేష్ సూచించడంతో అక్కడికి చేరుకున్నారు. కళాశాలలోకి ప్రవేశించేందుకు యత్నించగా యాజమాన్యం అనుమతించలేదు. దీంతో ఎస్సై జోక్యం చేసుకుని విద్యార్థులను లోపలికి పంపించారు. కళాశాలలో నాణ్యమైన ఆహారం అందించాలని, హాస్టల్‌లో భద్రత కల్పించాలని, పాములు వస్తున్నా పట్టించుకోవడం లేదని ఆందోళనకు దిగిన ఏడుగురిని సస్పెండ్ చేయడం అన్యాయమని విద్యార్థులు నినదించారు.

 సస్పెన్షన్‌ను ఎత్తివేసేంత వరకూ ఆందోళనను విరమించేది లేదని భీష్మించుకున్నారు. సస్పెన్షన్ ఎత్తివేత కుదరని సిబ్బంది కరాఖండిగా చెప్పడంతో విద్యార్థులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. ఇద్దరు విద్యార్థులు తరగతి గదిలోకి వెళ్లి ఉరేసుకునేందుకు యత్నించారు. పోలీసులు వారిని పక్కకు లాగేశారు. ఆ తర్వాత ఆ విద్యార్థులు చేతులు కోసుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో సిబ్బంది అసహనానికి గురయ్యారు. ఈ గొడవ తమకెందుకని, రాజీనామాలు చేసి వెళ్లిపోతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో కళాశాల వద్ద చోటుచేసుకున్న పరిణామాల గురించి అవేర్ ప్రధాన కార్యాలయానికి సమాచారం అందింది. స్పందించిన యాజమాన్యం విద్యార్థులపై సస్పెన్షన్‌ను ఎత్తేస్తామని, కళాశాలలోని సమస్యలు పరిష్కరిస్తామని ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement