నేటి నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 250 పరీక్షా కేంద్రాల్లో 52,461మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షార్ధులు తమ హాల్‌టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించి కేంద్రాలకు చేరుకోవచ్చు. గంట ముందుగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. డీఈవో చంద్రమోహన్ జిల్లాకేంద్రంలోని మాడల్ బేసిక్ పాఠశాలలోని ఓ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు.
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్ : పదో తరగతి పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను డీఈఓ చంద్రమోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 250 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 47,021 మంది రెగ్యులర్, 5,440 మంది ప్రయివేట్ మొత్తం 52,461 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని అన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న 250 కేంద్రాల్లో పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్నారు. ఫర్నిచర్ కొరత ఉన్న కేంద్రాల్లో ఇతర పాఠశాలల నుంచి తెప్పించామన్నారు. ప్రతి కేంద్రంలో నీటి సౌకర్యం, వైద్యసదుపాయం కల్పిస్తామని వెల్లడించారు.
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు 250 పరీక్షా కేంద్రాల్లో 250 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 250 మంది డిపార్టుమెంటల్ అధికారులు, 3200 మంది ఇన్విజిలేటర్లను, 12 ప్లైయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించినట్లు తెలిపారు. పరీక్ష ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు ఉంటుందని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒక గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. తమ వెంట ప్యాడ్‌లు, పెన్నులు తెచ్చుకోవాలని, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వెంట తెచ్చుకోరాదని సూచించారు. హాల్‌టికెట్ చూపి ఆర్టీసీ బస్సులో విద్యార్థులు ఉచితంగా ప్రయాణించవచ్చని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఉంటుందని తెలిపారు.
పకడ్బందీగా నిర్వహించాలి
పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా ని ర్వహించాలని జిల్లా విద్యాధికారి చంద్రమోహన్ అన్నారు. బుధవారం డీఈఓ కార్యాలయంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, కస్టోడియన్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓఎంఆర్ పత్రం నింపడంలో విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఒక గంట ముందుగానే పోలీసుస్టేషన్ల నుంచి పరీక్షా పత్రాలను తెచ్చుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ ఈఓలు తదితరులు పాల్గొన్నారు.
‘టెన్త్’కు..రెడీ
Published Thu, Mar 27 2014 4:38 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement