టెట్‌... ఓకే | TET exam finished | Sakshi
Sakshi News home page

టెట్‌... ఓకే

Published Mon, Jul 24 2017 1:17 AM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM

టెట్‌... ఓకే

టెట్‌... ఓకే

గతంతో పోల్చుకుంటే సులభంగా ప్రశ్నలు
ఈసారి ఎక్కువ మంది అర్హత సాధించే అవకాశం
  పేపర్‌–1లో 88.59 శాతం, పేపర్‌–2లో 90 శాతం హాజరు
  రెండు ప్రశ్నలకు సరిగ్గా లేని తెలుగు అనువాదం
  ఈ నెల 25 లేదా 26న ‘కీ’లు


సాక్షి, హైదరాబాద్‌
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ప్రశాంతంగా ముగిసింది. పేపర్‌–1 పరీక్షకు 88.59 శాతం, పేపర్‌–2 పరీక్షకు 90.09 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్‌–1 పరీక్షకు 1,11,647 మంది దరఖాస్తు చేసుకోగా 98,905 మంది హాజరయ్యారు. 12,742 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్‌–2 పరీక్షకు 2,56,265 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,30,881 మంది హాజరయ్యారు. 25,384 మంది గైర్హాజరయ్యారు. ప్రశ్నలు గతంలో కంటే ఈసారి కాస్త సులభంగా ఉన్నట్లు విద్యార్థులు, సబ్జెక్టు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఈసారి టెట్‌లో ఎక్కువ మంది అర్హత సాధించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. విషయ పరిజ్ఞాన సంబంధ, అవగాహనకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా అడిగారు. గణితం, ఇంగ్లిష్‌ బాగా రాయగలిగిన వారికి 110 కంటే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. పేపర్‌–2 గణితం అభ్యర్థులకు అనుకూలంగా ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

మొత్తానికి పరీక్షలకు హాజరైన వారిలో ఎక్కువ మంది 85 నుంచి 110 మార్కుల వరకు పొందే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కాస్త బాగా చదివిన వారికి 110–135 వరకు మార్కులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. పేపర్‌–1 సైకాలజీలో ఒక ప్రశ్నకు తెలుగు అనువాదం ఇంగ్లిష్‌తో పోల్చితే వేరుగా ఉందని, పేపర్‌–2లోనూ ఒక ప్రశ్నకు అనువాదం సరిగ్గా లేదని అభ్యర్థులు తెలిపారు. అలాగే పేపర్‌–1 సోషల్‌ ‘సి’ప్రశ్నపత్రంలో 127వ ప్రశ్నకు తెలుగు అనువాదం సరిగ్గా లేదని వివరించారు. పరీక్షల ‘కీ’లను ఈ నెల 25న లేదా 26న విడుదల చేసే అవకాశం ఉంది.

పేపర్‌–1లో కామారెడ్డి, వనపర్తిలో అధిక హాజరు
టెట్‌ పేపర్‌–1లో కామారెడ్డి, వనపర్తి జిల్లాల్లో అత్యధికంగా హాజరు శాతం నమోదైంది. కామారెడ్డిలో 98.11 శాతం మంది అభ్యర్థులు హజరు కాగా.. వనపర్తి జిల్లాలో 98.02 శాతం మంది హాజరయ్యారు. సంఖ్యాపరంగా చూస్తే ఎక్కువ మంది రంగారెడ్డి (14,774), ఖమ్మం (10,093) జిల్లాల నుంచి హాజరయ్యారు. మేడ్చల్‌ జిల్లాలో తక్కువ హాజరు శాతం (78.70%) నమోదైంది. పేపర్‌–2 పరీక్షలో కామారెడ్డిలో అధిక శాతం (97.81) హాజరు నమోదైంది. సంఖ్యాపరంగా రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ మంది అభ్యర్థులు (27,227) పేపర్‌–2కు హాజరయ్యారు.

భార్య కోసం వచ్చి దొరికిపోయిన టీచర్‌
వనపర్తి విద్యావిభాగం: టెట్‌లో తన భార్యకు సహకరించేందుకు పరీక్ష హాలుకు వచ్చిన ఓ స్కూలు అసిస్టెంట్‌ అడ్డంగా దొరికిపోయాడు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాన్‌గల్‌ మండలం రేమొద్దుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూలు అసిస్టెంట్‌ (ఇంగ్లిష్‌)గా పనిచేస్తున్న పరందామయ్య వనపర్తిలో జరిగిన టెట్‌–1 పరీక్షకు హాజరయ్యాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, అదికూడా స్కూలు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆయనకు ఈ పరీక్ష రాసే అవసరమే ఉండదు. ఆయన పరీక్ష రాయడాన్ని గమనించిన కొందరు అభ్యర్థులు.. డీఈవోకు ఫిర్యాదు చేశారు. పరీక్ష కేంద్రానికి వచ్చిన డీఈవో సుశీందర్‌రావు.. పరందామయ్యను నిలదీశారు. అదే పరీక్ష కేంద్రంలో మరో గదిలో తన భార్య విజయలక్ష్మి టెట్‌ రాస్తోందని, ఆమెకు స్కోర్‌ పెంచేందుకు సాయం కోసం వచ్చినట్లు అంగీకరించాడు. దీంతో డీఈవో వెంటనే పరందామయ్యను సస్పెండ్‌ చేశారు. మాస్‌ కాపీయింగ్‌ కోసం యత్నించారంటూ వనపర్తి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

స్ట్రెచర్‌పై పరీక్షకు..
వికారాబాద్‌: టెట్‌ పరీక్షకు ఆదివారం ఓ మహిళ స్ట్రెచర్‌పై వచ్చింది. మహబూబ్‌నగర్‌ పట్టణం ఇబ్రహీంబాగ్‌కు చెందిన చెన్నమ్మకు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. అయినా పరీక్ష కోసం వికారాబాద్‌లోని అనంతగిరిపల్లి సాంఘిక గురుకుల పాఠశాలకు వచ్చింది. చెన్నమ్మను ఆమె తల్లిదండ్రులు ఆదివారం ఉదయం అంబులెన్స్‌లో పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. స్ట్రెచర్‌పై లోపలికి తీసుకెళ్లి పరీక్ష రాయించారు.

జీవిత ఖైదీ.. అయితేనేం..!
నిజామాబాద్‌ అర్బన్‌: నిజామాబాద్‌లో భూమేశ్‌ అనే జీవిత ఖైదీ టెట్‌ పరీక్షకు హాజరయ్యాడు. బాన్సువాడకు చెందిన ఈయనకు హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. నిజామాబాద్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న భూమేశ్‌.. టెట్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. జైలు అధికారుల అనుమతితో ఆదివారం హరిచరణ్‌ మార్వాడీ పాఠశాలలో టెట్‌–1 పరీక్ష రాశాడు.

పరీక్ష హాల్‌ వద్ద సొమ్మసిల్లిన గర్భిణి
చెన్నారావుపేట(నర్సంపేట): వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్‌ మోడల్‌ స్కూల్‌ సెంటర్‌లో టెట్‌–2 పేపర్‌ రాసేందుకు వచ్చిన ఓ గర్భిణి సొమ్మసిల్లి పడిపోయింది. అభ్యర్థులను తనిఖీ చేసి పరీక్ష హాల్‌లోకి పంపిస్తుండగా కొత్తగూడ మండలం ముస్మికి చెందిన మౌనిక సొమ్మసిల్లి కిందపడిపోయింది. సెంటర్‌లో అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది ఆమెకు సపర్యలు చేసి ఓఆర్‌ఎస్‌ ద్రావణం తాగించారు. 15 నిమిషాల తర్వాత మౌనిక తేరుకుని పరీక్ష రాసింది.

15 నిమిషాల ఆలస్యం.. ఎగ్జామ్‌కు దూరం
సిరిసిల్ల: పరీక్ష కేంద్రానికి 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు ఓ అభ్యర్థి పరీక్షకు దూరం కావాల్సి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన లకావత్‌ శ్రీలత.. సిరిసిల్లలోని కుసుమ రామయ్య ఉన్నత పాఠశాలలో పరీక్ష రాయాల్సి ఉంది. కానీ పరీక్ష కేంద్రానికి 15 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది. దీంతో అధికారులు ఆమెను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. కన్నీళ్లు పెట్టుకుంటూ ‘ప్లీజ్‌ సార్‌..’అని వేడుకున్నా కనికరించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement