తొలిదశలో 1,600 మెగావాట్ల ప్లాంటు | The 1,600-megawatt plant in the first phase | Sakshi
Sakshi News home page

తొలిదశలో 1,600 మెగావాట్ల ప్లాంటు

Published Mon, Sep 8 2014 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM

తొలిదశలో 1,600 మెగావాట్ల ప్లాంటు

తొలిదశలో 1,600 మెగావాట్ల ప్లాంటు

ఎన్టీపీపీ 4వేల మెగావాట్ల
{పాజెక్టులో భాగంగా  వెంటనే నిర్మాణం
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్‌గోయల్ వెల్లడి
ఢిల్లీ నుంచి రాష్ట్రాల విలేకరులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్

 
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వెంటనే 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించనున్నట్లు కేంద్ర విద్యుత్, బొగ్గు శాఖల మంత్రి పీయూష్‌గోయల్ తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీపీసీ 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మొదటి దశలో ఈ కేంద్రాన్ని నిర్మించనున్నట్లు వివరించారు. ఆదివారం ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల్లోని విలేకరులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్‌ప్లాంట్‌ను కూడా ఎన్టీపీసీ నిర్మిస్తుందని, అందుకోసం ఐదువేల ఎకరాలు ఇవ్వడానికి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అంగీకరించారని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. శనివారం తెలంగాణ సీఎం కేసీఆర్ తనను కలిసారని, అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడానని పీయూష్‌గోయల్ పేర్కొన్నారు. ఎవరికీ కేటాయించని విద్యుత్ నుంచి తెలంగాణకు 500 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయడానికి తాను ఎలాంటి హామీ ఇవ్వలేదని, ప్రస్తుతం ఇస్తున్న వంద మెగావాట్ల విద్యుత్‌ను వచ్చే సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు వినియోగించుకునేలా కేటాయించినట్లు చెప్పారు.

విద్యుత్ మిగులు ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు విద్యుత్ ఇవ్వాలన్నా.. ట్రాన్స్‌మిషన్ లైన్లు లేని కారణంగా సరఫరా జరగడంలేదన్నారు. విద్యుత్ ప్రసార లైన్లు సిద్ధమైతే అదనపు విద్యుత్ ఇవ్వడానికి సిద్ధమని మంత్రి స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన బొగ్గు కేటాయింపులు, పర్యావరణ అనుమతులు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే బొగ్గు కేటాయింపులకు సంబంధించి మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పును అనుసరించి ఆ కేటాయింపులు ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణలో 24 గంటలు విద్యుత్ సరఫరా చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామని, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందుగా వచ్చినందున ఢిల్లీ, రాజస్థాన్‌తోపాటు ఆ రాష్ట్రాన్ని ఎంపిక చేసినట్లు గోయల్ వెల్లడించారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement