దట్టమైన అడవిలో కొండల మధ్య కృష్ణమ్మ హొయలు.. పక్షుల కిలకిలరావాలు.. జింకల పరుగులు.. పులుల గాండ్రిపులు.. ఎంతో అరుదైన ఔషధ వృక్షాలు.. ప్రకృతి ఒడిలో సేద తీరాలనిపించే చల్లనిగాలులు.. అబ్బురపరిచే రాతికొండలు, చె క్కిన శిల్పాల్లా భ్రమించే రాతిశిలలు.. భక్తిభావంగా నిలిచే పురాతన ఆలయాలు.. ఇలా ఎన్నెన్నో అందాలకు నల్లమల నెలవు. ఇంతటి అందమైన కృష్ణాతీరానికి పర్యాటక శోభ సంతరించుకోనుంది. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది.
నల్లమల కృష్ణాతీరానికి పర్యాటక శోభ
కొల్లాపూర్: మహబూబ్‌నగర్, కర్నూల్ జిల్లా సరిహద్దులో నల్లమల కొండల మధ్య ప్రవహిస్తున్న కృష్ణాతీరాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కారు చర్యలు ప్రారంభించింది. కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల నుంచి కృష్ణానది గుండా భక్తులు, పర్యాటకులు శ్రీశైలం చేరుకునేందుకు ప్రత్యేకబోట్లను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం సోమశిలకు ప్రత్యేకబోట్లు రప్పిస్తోంది. రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ స్వయంగా సోమశిలకు విచ్చేసి పర్యాటక ఏర్పాట్లను చర్చించనున్నారు. పర్యాటన ఇంకా ఖరారు కాకపోయినా..అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
అందాల కొలువు
సోమశిల గ్రామం నుంచి శ్రీశైలానికి కృష్ణానదీ గుండా మరబోట్లలో ప్రయాణం సాగించేందుకు 120 కి.మీ ఎనిమిది గంటల సమయం పడుతుంది. తీరం వెంట మత్స్యకారుల నివాసాలు, చెంచుగూడేలు మాత్రమే ఉంటాయి. కృష్ణమ్మ పరవళ్లు, తీరం వెంట నల్లమల అడవి ప్రకృతిసోయగాలు, పక్షుల అందాలు ప్రయాణిలను కనువిందు చేస్తాయి. నవంబర్ నెల నుంచి ఫిబ్రవరి మధ్యలో నల్లమల అడవిపచ్చగా కనువిందు చేస్తోంది. నదీ ప్రయాణాలు సాగించే వారు సోమశిలలోని చారిత్రక లలితాంబికా సోమేశ్వరాలయంలో గల ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. సోమశిలకు సమీపంలో కృష్ణానది మధ్యన కర్నూలు జిల్లా భూభాగంలో గల సంగమేశ్వర ఆలయాన్ని చూడొచ్చు.
ఈ ఆలయం ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు కృష్ణానదిలో మునిగి ఉంటుంది. సోమశిల నుంచి 15 కి.మీ దూరంలో చీమలతిప్ప దీవి వస్తుంది. సమీపంలో కొండపై అత్యంత పురాతనమైన ఆంకాలమ్మ కోట ఉంటుంది. కాళీమాత, ఆంజనేయస్వామి దేవతామూర్తులను ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అక్కడి నుంచి 75 కి.మీ దూరంలో నీటిగంగ జలపాతం కొండలు కనిపిస్తాయి. అక్కడ శివుడి ఆలయం ఉంది. ఇక్కడి నుంచి కొండలపైకి ఎక్కి 45 నిమిషాల్లో శ్రీశైలం గుడివద్దకు చేరుకుంటారు. ప్రయాణం సాగించేందుకు వీలుగా కాలిబాట ఉంటుంది.
నీటిగంగ కొండల నుంచి బోటులో ప్రయాణిస్తే శ్రీశైలానికి చేరుకునేందుకు రెండున్నర గంటల సమయం పడుతుంది. 15కి.మీ బోటులో ప్రయాణిస్తే అక్కమాంబ గుహలు కనిపిస్తాయి. అక్కడినుంచి నల్లమల కొండలో ఏడు కి.మీ కాలినడక వెళ్తే కదిరివనం చేరుకోవచ్చు. అక్కమాంబ గుహల నుంచి బోటులో 15కి.మీ దూరం ప్రయాణిస్తే శ్రీశైలంలోని పాతాళ గంగను చేరుకుంటాం.
పర్యాటక ప్రాంతంగా..
నదీప్రయాణాలకు ప్రభుత్వం పర్యాటక బోట్లను ఏర్పాటుచేస్తే కృష్ణాతీర ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చెందుతాయి. పాపికొండలను తలపించే నల్లమల అందాలకు గుర్తింపు లభిస్తుంది. సోమశిల, అమరగిరి గ్రామాల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ప్రస్తుతం శ్రీశైలానికి వెళ్లే పర్యాటకులు చేపలవేటకు వినియోగించే మరబోట్లకు రూ.ఐదువేల వరకు చెల్లిస్తున్నారు. ఈ బోట్లను ఏర్పాటుచేసే ఖర్చు పెద్దమొత్తంలో తగ్గుతుంది.
రక్షణ పరమైన చిక్కులు
కృష్ణానదిలో మరబోటుపై ప్రయాణిస్తే రక్షణ పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. బోటు ప్రయాణమంతా దట్టమైన నల్లమల అడవి మధ్యలో సాగుతుంది. ఈప్రాంతం మావోయిస్టులకు గతంలో ప్రధానంగా కేంద్రంగా ఉండేది. జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు ఇక్కడే ఆశ్రయం పొందిన సందర్భాలూ ఉన్నాయి. నదీప్రయాణం సమయంలో చాలాచోట్ల సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందవు. ప్రయాణ సమయంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ప్రథమ చికిత్సలు చేయించుకునే వీలు కూడా ఉండదు. ప్రభుత్వం చొరవచూపితే కృష్ణాతీరం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది.
అందాల నిలయం.. ప్రకృతి సోయగం
Published Thu, Feb 26 2015 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM
Advertisement