Krishna coast
-
అందాల నిలయం.. ప్రకృతి సోయగం
దట్టమైన అడవిలో కొండల మధ్య కృష్ణమ్మ హొయలు.. పక్షుల కిలకిలరావాలు.. జింకల పరుగులు.. పులుల గాండ్రిపులు.. ఎంతో అరుదైన ఔషధ వృక్షాలు.. ప్రకృతి ఒడిలో సేద తీరాలనిపించే చల్లనిగాలులు.. అబ్బురపరిచే రాతికొండలు, చె క్కిన శిల్పాల్లా భ్రమించే రాతిశిలలు.. భక్తిభావంగా నిలిచే పురాతన ఆలయాలు.. ఇలా ఎన్నెన్నో అందాలకు నల్లమల నెలవు. ఇంతటి అందమైన కృష్ణాతీరానికి పర్యాటక శోభ సంతరించుకోనుంది. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. నల్లమల కృష్ణాతీరానికి పర్యాటక శోభ కొల్లాపూర్: మహబూబ్‌నగర్, కర్నూల్ జిల్లా సరిహద్దులో నల్లమల కొండల మధ్య ప్రవహిస్తున్న కృష్ణాతీరాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కారు చర్యలు ప్రారంభించింది. కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల నుంచి కృష్ణానది గుండా భక్తులు, పర్యాటకులు శ్రీశైలం చేరుకునేందుకు ప్రత్యేకబోట్లను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం సోమశిలకు ప్రత్యేకబోట్లు రప్పిస్తోంది. రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ స్వయంగా సోమశిలకు విచ్చేసి పర్యాటక ఏర్పాట్లను చర్చించనున్నారు. పర్యాటన ఇంకా ఖరారు కాకపోయినా..అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అందాల కొలువు సోమశిల గ్రామం నుంచి శ్రీశైలానికి కృష్ణానదీ గుండా మరబోట్లలో ప్రయాణం సాగించేందుకు 120 కి.మీ ఎనిమిది గంటల సమయం పడుతుంది. తీరం వెంట మత్స్యకారుల నివాసాలు, చెంచుగూడేలు మాత్రమే ఉంటాయి. కృష్ణమ్మ పరవళ్లు, తీరం వెంట నల్లమల అడవి ప్రకృతిసోయగాలు, పక్షుల అందాలు ప్రయాణిలను కనువిందు చేస్తాయి. నవంబర్ నెల నుంచి ఫిబ్రవరి మధ్యలో నల్లమల అడవిపచ్చగా కనువిందు చేస్తోంది. నదీ ప్రయాణాలు సాగించే వారు సోమశిలలోని చారిత్రక లలితాంబికా సోమేశ్వరాలయంలో గల ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. సోమశిలకు సమీపంలో కృష్ణానది మధ్యన కర్నూలు జిల్లా భూభాగంలో గల సంగమేశ్వర ఆలయాన్ని చూడొచ్చు. ఈ ఆలయం ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు కృష్ణానదిలో మునిగి ఉంటుంది. సోమశిల నుంచి 15 కి.మీ దూరంలో చీమలతిప్ప దీవి వస్తుంది. సమీపంలో కొండపై అత్యంత పురాతనమైన ఆంకాలమ్మ కోట ఉంటుంది. కాళీమాత, ఆంజనేయస్వామి దేవతామూర్తులను ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అక్కడి నుంచి 75 కి.మీ దూరంలో నీటిగంగ జలపాతం కొండలు కనిపిస్తాయి. అక్కడ శివుడి ఆలయం ఉంది. ఇక్కడి నుంచి కొండలపైకి ఎక్కి 45 నిమిషాల్లో శ్రీశైలం గుడివద్దకు చేరుకుంటారు. ప్రయాణం సాగించేందుకు వీలుగా కాలిబాట ఉంటుంది. నీటిగంగ కొండల నుంచి బోటులో ప్రయాణిస్తే శ్రీశైలానికి చేరుకునేందుకు రెండున్నర గంటల సమయం పడుతుంది. 15కి.మీ బోటులో ప్రయాణిస్తే అక్కమాంబ గుహలు కనిపిస్తాయి. అక్కడినుంచి నల్లమల కొండలో ఏడు కి.మీ కాలినడక వెళ్తే కదిరివనం చేరుకోవచ్చు. అక్కమాంబ గుహల నుంచి బోటులో 15కి.మీ దూరం ప్రయాణిస్తే శ్రీశైలంలోని పాతాళ గంగను చేరుకుంటాం. పర్యాటక ప్రాంతంగా.. నదీప్రయాణాలకు ప్రభుత్వం పర్యాటక బోట్లను ఏర్పాటుచేస్తే కృష్ణాతీర ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చెందుతాయి. పాపికొండలను తలపించే నల్లమల అందాలకు గుర్తింపు లభిస్తుంది. సోమశిల, అమరగిరి గ్రామాల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ప్రస్తుతం శ్రీశైలానికి వెళ్లే పర్యాటకులు చేపలవేటకు వినియోగించే మరబోట్లకు రూ.ఐదువేల వరకు చెల్లిస్తున్నారు. ఈ బోట్లను ఏర్పాటుచేసే ఖర్చు పెద్దమొత్తంలో తగ్గుతుంది. రక్షణ పరమైన చిక్కులు కృష్ణానదిలో మరబోటుపై ప్రయాణిస్తే రక్షణ పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. బోటు ప్రయాణమంతా దట్టమైన నల్లమల అడవి మధ్యలో సాగుతుంది. ఈప్రాంతం మావోయిస్టులకు గతంలో ప్రధానంగా కేంద్రంగా ఉండేది. జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు ఇక్కడే ఆశ్రయం పొందిన సందర్భాలూ ఉన్నాయి. నదీప్రయాణం సమయంలో చాలాచోట్ల సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందవు. ప్రయాణ సమయంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ప్రథమ చికిత్సలు చేయించుకునే వీలు కూడా ఉండదు. ప్రభుత్వం చొరవచూపితే కృష్ణాతీరం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. -
ఇప్పుడేం చేస్తారు..!
కృష్ణా కరకట్ట దిగువన భారీ భవనానికి శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ట్రస్ట్ శ్రీకారం నేడు భూమిపూజ చేయనున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇరిగేషన్ మంత్రి అనుమతి ఇస్తారా.. అడ్డుకుంటారా.. ఆక్రమణలపై సాగని సర్వే విజయవాడ : కృష్ణానది తీరంలో గుంటూరు వైపు కరకట్ట దిగువన భారీ నిర్మాణానికి డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ట్రస్ట్ పేరుతో బీజేపీ నేతలు శ్రీకారం చుట్టారు. కరకట్ట వెంబడి ఆక్రమ నిర్మాణాలను అనుమతించబోమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించి నెల రోజులు కూడా గడవలేదు. ఇంతలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఆధ్వర్యాన నూతన భవన నిర్మాణాన్ని చేపట్టడం చర్చనీయాశంగా మారింది. ఎటువంటి అనుమతులు లేకుండానే నిర్మాణానికి ఏర్పాట్లుచేస్తున్న ఈ భవనానికి శనివారం ఉదయం కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు భూమి పూజ చేయనున్నారు. ఎంపీ గోకరాజు గంగరాజు స్థలం విరాళం... నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజుకు చెందిన సుమారు 40 సెంట్ల స్థలాన్ని డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చారు. ఇదే ట్రస్ట్‌కు కొలనుకొండ వద్ద డాక్టర్ మాదల శ్రీనివాసరావు అర ఎకరం, నిడమానూరులో వెలగపూడి గోపాలకృష్ణ 1,000 గజాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ మూడు ప్రదేశాల్లో భవనాలను నిర్మించాలని ట్రస్ట్ భావిస్తోంది. తొలుత కృష్ణా కరకట్ట వెంబడి ఎంపీ గంగరాజు ఇచ్చిన స్థలంలో బహుళ అంతస్తుల భవనం నిర్మించేందుకు ట్రస్ట్ సిద్ధమైంది. ఆ తర్వాత ఇదే భవనాన్ని బీజేపీ రాష్ట్ర కార్యాలయంగా మార్చే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి ఉమాకు తెలియదా? కృష్ణానది తీరంలో గుంటూరు వైపు సుమారు 45 పెద్దపెద్ద భవనాలు ఉన్నాయి. గత నెలాఖారులో మంత్రి ఉమా విలేకరులను తీసుకుని కృష్ణానదిలో పర్యటిస్తూ ఈ భవనాలను చూసి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కృష్ణానది తీరంలో ఇంత భారీ భవనాలు ఉన్నట్లు తనకు తెలియదని చెప్పారు. ఇప్పుడు ఆ భవనాల పక్కనే బీజేపీ మరో భవనాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. నూతనంగా నిర్మించే భవనం గురించి మంత్రి ఉమాకు తెలియదా.. అని పలువురు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. భూమి పూజ తర్వాత ఈ భవనానికి రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి, ఇరిగేషన్ అధికారులు అనుమతిస్తారా.. లేదా.. అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కృష్ణానది కరకట్ట దిగువన భారీ నిర్మాణాలకు ఇప్పటివరకు ఇరిగేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. గతంలో నాలుగైదు ప్రాంతాల్లో మాత్రమే షెడ్లు వేసుకునేందుకు అనుమతిచ్చారు. ఇప్పుడు బీజేపీ ఆధ్వర్యంలో నిర్మించే భవనాన్ని మంత్రి, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తారా.. లేక అడ్డుకుంటారా వేచి చూడాలి. కృష్ణా కరకట్ట వెంబడి అక్రమంగా నిర్మించిన భవనాలు, నూతన నిర్మాణాల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి దేవినేని ఉమా భావిస్తున్నట్లు తెలిసింది. -
కృష్ణా తీరంలో ఇసుక తుపాను
ప్రభుత్వ విధానాల ఫలితం మూడో రోజుకు చేరిన లారీ ఓనర్ల సమ్మె నిలిచిపోయిన ఇసుక తవ్వకాలు నేడు మళ్లీ అధికారులతో చర్చలు విజయవాడ : ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఇసుక విధానంతో కృష్ణాతీరంలో తుఫాన్ చెలరేగింది. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఇసుక రవాణా సమస్య తలెత్తడంతో లారీ యజమానులు సమ్మెబాట పట్టారు. ఇసుక అమ్మకాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన విది విధానాలపై లారీ యజమానుల్లో తీవ్ర వ్యతిరేక త వ్యక్తమవుతోంది. ఇసుక క్వారీలను డ్వాక్రా సంఘాలకు, మీసేవల ద్వారా ఇసుక కొనుగోళ్లు చేసే విధంగా కొత్త విధానాన్ని ప్రారంభించింది. దీంతో మీసేవలో చెల్లింపులు తీవ్ర ఆలస్యమవుతున్నాయని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ట్రాన్స్పోర్టర్లు మూడు రోజులుగా నిరవధిక సమ్మెకు దిగిన విషయం విదితమే. దీంతో రెండు జిల్లాల్లో దాదాపు 10 క్వారీల్లో ఇసుక రవాణా స్తంభించిపోయింది. కృష్ణా జిల్లా, జాయింట్ కలెక్టర్ బుధవారం రెండు జిల్లాల లారీ యజమానులతో చర్చలు జరిపారు. గురువారం గుంటూరు జాయింట్ కలెక్టర్ చలు జరిపారు. శుక్రవారం సబ్-కలెక్టర్ కార్యాలయంలో కృష్ణా జిల్లా యంత్రాంగం మరో ధపా చర్చలు జరపనుంది. 10కిలో మీటర్ల దూరానికి లారీకి రూ. 800 చొప్పున కిరాయి ఇచ్చే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లారీ యజమానులు రూ.1500 కిరాయి డిమాండ్ చేస్తున్నారు. వినియోగదారుని నుంచి నేరుగా తాము కిరాయి తీసుకునే వెసులుబాటు కల్పించాలని లారీ యజమానులు కోరుతున్నారు. అలా సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. కృష్ణా జిల్లాలో ఫెర్రి, సూరాయిపాలెం, గుంటుపల్లిలో, గుంటూరు జిల్లాలో తెనాలి, పొన్నూరులో ఇసుక క్వారీలను డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో నడుపుతున్నారు. ఈ రెండు జిల్లాల్లో దాదాపు రెండు వేల లారీలు ఐదు లారీ అసోసియేషన్ల ద్వారా ఇసుకను రవాణా చేస్తున్నాయి. నెల రోజులుగా ఇసుక అమ్మకాలు సాగుతుండగా తోలిన కిరాయి డబ్బులు రాకపోవడం తదితర సమస్యలను లారీ యజమానులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రెండు జిల్లాల్లో లారీ యజమానులు సంఘటితమై పోరాటం చేస్తున్నారు. కాగా లారీ యజమానుల సమస్య కొలిక్కి వచ్చేటట్లు కనపడడం లేదు. ప్రభుత్వ నిబంధనలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇసుక కొరత ... కాగా లారీ యజమానుల సమ్మెతో జిల్లాలో ఇసుక కొరత ఏర్పడింది. ఇసుక దొరకడం లేదని బిల్డర్లు చెబుతున్నారు. కాగా జిల్లాలో ఇసుక లేక పనులు నిలిచిపోయాయి. రాజ మండ్రి తదితర ప్రాంతాల నుంచి వచ్చే ఇసుకను అధిక రేటుకు విక్రయిస్తున్నారు. 10టైర్ల లారీకి రూ. 27వేలు వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా లారీలు నిలిచిపోవడంతో కృష్ణానది ప్రాంతంలో రాత్రిపూట దొంగతనంగా ట్రాక్టర్లతో ఇసుకను దళారులు తోడేస్తున్నారు. కొందరు సంచుల్లో తరలించి అధిక రేట్లు వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.