- ప్రభుత్వ విధానాల ఫలితం
- మూడో రోజుకు చేరిన లారీ ఓనర్ల సమ్మె
- నిలిచిపోయిన ఇసుక తవ్వకాలు
- నేడు మళ్లీ అధికారులతో చర్చలు
విజయవాడ : ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఇసుక విధానంతో కృష్ణాతీరంలో తుఫాన్ చెలరేగింది. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఇసుక రవాణా సమస్య తలెత్తడంతో లారీ యజమానులు సమ్మెబాట పట్టారు. ఇసుక అమ్మకాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన విది విధానాలపై లారీ యజమానుల్లో తీవ్ర వ్యతిరేక త వ్యక్తమవుతోంది.
ఇసుక క్వారీలను డ్వాక్రా సంఘాలకు, మీసేవల ద్వారా ఇసుక కొనుగోళ్లు చేసే విధంగా కొత్త విధానాన్ని ప్రారంభించింది. దీంతో మీసేవలో చెల్లింపులు తీవ్ర ఆలస్యమవుతున్నాయని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ట్రాన్స్‌పోర్టర్లు మూడు రోజులుగా నిరవధిక సమ్మెకు దిగిన విషయం విదితమే. దీంతో రెండు జిల్లాల్లో దాదాపు 10 క్వారీల్లో ఇసుక రవాణా స్తంభించిపోయింది. కృష్ణా జిల్లా, జాయింట్ కలెక్టర్ బుధవారం రెండు జిల్లాల లారీ యజమానులతో చర్చలు జరిపారు.
గురువారం గుంటూరు జాయింట్ కలెక్టర్ చలు జరిపారు. శుక్రవారం సబ్-కలెక్టర్ కార్యాలయంలో కృష్ణా జిల్లా యంత్రాంగం మరో ధపా చర్చలు జరపనుంది. 10కిలో మీటర్ల దూరానికి లారీకి రూ. 800 చొప్పున కిరాయి ఇచ్చే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లారీ యజమానులు రూ.1500 కిరాయి డిమాండ్ చేస్తున్నారు. వినియోగదారుని నుంచి నేరుగా తాము కిరాయి తీసుకునే వెసులుబాటు కల్పించాలని లారీ యజమానులు కోరుతున్నారు. అలా సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. కృష్ణా జిల్లాలో ఫెర్రి, సూరాయిపాలెం, గుంటుపల్లిలో, గుంటూరు జిల్లాలో తెనాలి, పొన్నూరులో ఇసుక క్వారీలను డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో నడుపుతున్నారు.
ఈ రెండు జిల్లాల్లో దాదాపు రెండు వేల లారీలు ఐదు లారీ అసోసియేషన్ల ద్వారా ఇసుకను రవాణా చేస్తున్నాయి. నెల రోజులుగా ఇసుక అమ్మకాలు సాగుతుండగా తోలిన కిరాయి డబ్బులు రాకపోవడం తదితర సమస్యలను లారీ యజమానులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రెండు జిల్లాల్లో లారీ యజమానులు సంఘటితమై పోరాటం చేస్తున్నారు. కాగా లారీ యజమానుల సమస్య కొలిక్కి వచ్చేటట్లు కనపడడం లేదు. ప్రభుత్వ నిబంధనలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
ఇసుక కొరత ...
కాగా లారీ యజమానుల సమ్మెతో జిల్లాలో ఇసుక కొరత ఏర్పడింది. ఇసుక దొరకడం లేదని బిల్డర్లు చెబుతున్నారు. కాగా జిల్లాలో ఇసుక లేక పనులు నిలిచిపోయాయి. రాజ మండ్రి తదితర ప్రాంతాల నుంచి వచ్చే ఇసుకను అధిక రేటుకు విక్రయిస్తున్నారు. 10టైర్ల లారీకి రూ. 27వేలు వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా లారీలు నిలిచిపోవడంతో కృష్ణానది ప్రాంతంలో రాత్రిపూట దొంగతనంగా ట్రాక్టర్లతో ఇసుకను దళారులు తోడేస్తున్నారు. కొందరు సంచుల్లో తరలించి అధిక రేట్లు వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.