
జీవ వైవిధ్యం..పూడికతో విధ్వంసం
- హుస్సేన్‌సాగర్ తీరంలో కొలువుదీరిన సహజవనం
- కొన్నేళ్ల కింద ‘వెట్‌ల్యాండ్ ఎకో కన్జర్వేషన్’ జోన్‌గా అభివృద్ధి
- ఇప్పుడు హుస్సేన్‌సాగర్ పూడిక తొలగింపు పేరుతో ఎసరు
- పూడిక మట్టిని వేసేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర యంత్రాంగం
- ఇప్పటికే పొదలు దహనం.. చిన్న చిన్న చెట్ల నరికివేత
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌కు తలమానికంగా నిలిచిన హుస్సేన్‌సాగర్ నెక్లెస్ రోడ్డులో దాదాపు 13 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ప్రకాశ్‌నగర్ నాలా సాగర్‌లో కలిసే ప్రాంతంలో ఉన్న ఈ స్థలం చాలాకాలం పాటు కోర్టు వివాదాల్లో ఉంది. తర్వాత ప్రభుత్వం చేతిలోకి చేరేసరికే అందులో ఓ చిట్టడివి పెరిగి ఉంది. దానిని ఎలా అభివృద్ధి చేయాలనేదానిపై సర్వే చేసే క్రమంలో... అప్పట్లోనే ఓ ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. చుట్టూ ఉన్న జనారణ్యం మధ్యలో... పలు రకాల పక్షులు, సీతాకోక చిలుకలు, పాములు, వివిధ జాతుల చెట్లు వంటి అద్భుతమైన జీవ వైవిధ్యం ఈ 13 ఎకరాల స్థలంలో ఉన్నట్లు వెల్లడైంది. ఈ ప్రాంతాన్ని ఇతర పార్కుల్లాగా తీర్చిదిద్దితే వీటన్నింటికీ ప్రమాదకరమని గుర్తించిన అప్పటి హుడా అధికారులు ‘వెట్‌ల్యాండ్ ఎకో-కన్జర్వేషన్ జోన్ (పర్యావరణ రక్షిత ప్రాంతం)’గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఆ స్థలంలో పొగడ, ఇప్ప, నెమలినార, రావి, మేడి, మర్రి, తెల్లమద్ది, గంగరావి, ఈతలాంటి రకరకాల మొక్కలు నాటి పెంచారు. ప్రస్తుతం అవన్నీ పెరిగి ఆ ప్రాంతమంతా ఒక చిట్టడవిలాగా మారింది.
సహజ వైవిధ్యం..
ఈ 13 ఎకరాల ప్రాంతాన్ని ఎకో కన్జర్వేషన్ జోన్‌గా అభివృద్ధి చేయడంతో... కొన్ని రకాల విదేశీ పక్షులు సహా పాములు, సీతాకోక చిలుకలు, సాలీళ్లు, తూనీగలు, స్థానిక పక్షులు ఇక్కడ ఆవాసం ఏర్పరుచుకున్నాయి. దాదాపు అన్నిరకాలూ కలిపి దాదాపు 300 జాతులు ఇక్కడ జీవిస్తున్నట్లు ‘ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ ఫండ్ (డబ్ల్యూ డబ్యూఎఫ్)’ ఇండియా విభాగం ప్రతినిధులు ప్రత్యేక సర్వేలో గుర్తించారు. హుస్సేన్‌సాగర్ తీరంలోని ఇతర ప్రాంతాల్లో లేని కొన్ని జీవజాతులు ఈ 13 ఎకరాల్లో ఉన్నాయని తేల్చారు. అయితే ఇప్పుడు ఈ జీవ వైవిధ్యానికి ముప్పు ఏర్పడింది.
కొంతకాలంగా హుస్సేన్‌సాగర్‌లో తీరం వెంబడి పూడికను తొలగిస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత పూడిక మట్టిని తీసి అందులోని తడి పోయేవరకు ఒడ్డున డంప్ చేసి తర్వాత వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు మూడు నాలాల పరిధిలో పూడిక తీత పూర్తయింది. నాలుగోది కూకట్‌పల్లి నాలా. అత్యంత ప్రమాదకర రసాయనాలు ఇందులోంచే సాగర్‌లో చేరుతాయి. దీని పరిధిలో పూడికను తీసి తొలుత డంప్ చేసేందుకు ఈ ‘ఎకో కన్జర్వేషన్ జోన్’ స్థలాన్ని వినియోగించుకోనున్నారు.
వద్దన్నా వింటేగా...
గత ఏడాదే ఈ వనంలోని చె ట్లను తొలగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం వాల్టా చట్టం మేరకు ఏర్పడ్డ ‘ట్రీ ప్రొటెక్షన్ కమిటీ’కి దరఖాస్తు చేశారు. కానీ ఆ వనం జీవ వైవిధ్యపరంగా ప్రత్యేకమైనదని స్పష్టం చేస్తూ... కమిటీ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో వెనక్కి తగ్గిన అధికారులు తొలుత ఆ ప్రాంతం వెనుక ఉన్న ఖాళీ స్థలంలో సాగర్ పూడిక డంప్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే ఇంతలో హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సాగర్ నీటిని పూర్తిగా తొలగించి పూడిక తీయాలనేది ఈ కొత్త ఆలోచన. అయితే ఆ పని మొదలయ్యేలోపు కూకట్‌పల్లి నుంచి వచ్చే నాలా కలిసే చోట మేటవేసిన ప్రమాదకర రసాయనాల పూడిక తొలగించాలని భావిస్తున్నారు. కానీ ఈ బాధ్యతను హెచ్‌ఎండీఏ తీసుకుంటుందా, జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తుందా? అన్న విషయంలో అధికారులకు స్పష్టత రాలేదు. దీంతో తాత్కాలికంగా డంప్ యోచనను నిలిపేశారు.
‘మంట’ పెట్టేస్తున్నారు..!
పూడికతీత పనులు ఎప్పుడు మొదలుపెట్టినా... ఈ 13 ఎకరాల వెట్ కన్జర్వేషన్ జోన్‌లోనే పూడిక మట్టిని వేస్తామని అధికారులు పేర్కొంటుండటం గమనార్హం. ఇందుకోసం ఇప్పటికే ఈ ప్రాంతం లోపలివైపు మంటలు పెట్టి పొదలను ధ్వంసం చేశారు. కొన్ని చిన్న చెట్లను తొలగించేశారు. పెద్ద చెట్లు తొలగిస్తే పర్యావరణ ప్రేమికుల నుంచి వ్యతిరేకత వస్తుందనే యోచనతో వాటి మధ్యలోనే పూడిక మట్టి వేయాలని భావిస్తున్నారు. అదే జరిగితే పూడికలోని రసాయనాల ధాటికి చెట్లు చనిపోవటం ఖాయమని పర్యావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
యుఫోర్బియా సెబెస్టినీ అనే అతి అరుదైన మొక్క కూడా ఈ ప్రాంతంలో కనిపించింది. 65 ఏళ్ల కిందట ఓ విదేశీ శాస్త్రవేత్త దీనిని మొదటిసారిగా మూసీ నది ఒడ్డున కనుగొన్నారు. ఆ తర్వాత మళ్లీ దాని జాడ దొరకలేదు. ఇప్పుడు హుస్సేన్‌సాగర్ ఒడ్డున కనిపించింది.
జపాన్, చైనా, అసోంలలో కనిపించే అరుదైన ‘గ్రే హెడెడ్ లాప్విన్’ అనే పక్షి వానాకాలంలో ఇక్కడ తారసపడింది. ఆ జాతి పక్షులు హుస్సేన్‌సాగర్ ప్రాంతాన్ని తమ వలస కేంద్రంగా భావిస్తున్నాయి.
డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రతినిధులు తేల్చిన అంశాలు..
సాగర్ చుట్టూ 117 జాతుల మొక్కలున్నాయి.
77 రకాల పక్షులు ఇక్క సంచరిస్తున్నాయి. కొన్ని విదేశీ వలస పక్షులు కూడా ఉన్నాయి.
40కిపైగా జాతుల సీతాకోకచిలుకలు, 14 రకాల సాలె పురుగులు, 6 రకాల తూనీగలు, 3 రకాల పాములు, 6 రకాల చేపలు ఉన్నాయి.
వెరసి దాదాపు 300 రకాల జీవజాతులు సాగర్ చుట్టూ బతుకుతున్నాయి.
ఆ ఊపు ఏమైంది..?
హైదరాబాద్‌లో అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు జరిగినప్పుడు హైదరాబాద్ నగరానికి ప్రత్యేకంగా జీవ వైవిధ్య సూచికను రూపొందించారు. దేశంలో ఈ సూచీ ఏర్పాటు చేసిన తొలి నగరం మనదే. 2012లో ఆ సూచీ ఆధారంగా హైదరాబాద్‌ను బేరీజు వేసుకుంటే 31 పాయింట్లు వచ్చాయి. అంటే నగరం పలు విషయాల్లో వెనకబడి ఉందని వెల్లడైంది. దీంతో భవిష్యత్‌లో పరిస్థితిని మెరుగుపరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పుడు జరుగుతున్నది అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది.
ఇవి కూడా కోర్టు ధిక్కారమే
‘‘పర్యావరణాన్ని బాగు చేయాలనే ఆలోచనే మన యంత్రాంగానికి లేదు. 2003లోనే దీనిపై కోర్టుకు వెళ్లాం. పర్యావరణానికి విఘాతం కలిగించే చర్యలను నిలిపివేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పుడు వెట్‌ల్యాండ్ ఎకో కన్జర్వేషన్ జోన్‌లో చె ట్లకు నష్టం చేసే ప్రయత్నం కోర్టు ధిక్కారమే అవుతుంది’’
- జీవానందరెడ్డి, ఫోరం ఫర్ సస్టెయినబుల్ ఎన్విరాన్‌మెంట్ కన్వీనర్
ఇప్పటికే తిరస్కరించినా...
‘‘సాగర్ పూడిక మట్టి వేసేందుకు ఆ 13 ఎకరాల్లో చెట్లు కొట్టేస్తామని హెచ్‌ఎండీఏ అనుమతి కోరింది. కానీ దానిని ట్రీ ప్రొటెక్షన్ కమిటీ తిరస్కరించింది. అక్కడి చెట్లు ధ్వంసం చేయడం జీవ వైవిధ్యంపై ప్రభావం చూపుతుంది.
- ఫరీదా, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా హైదరాబాద్ డెరైక్టర్