ఆగస్టు 11న హజ్ యాత్ర షురూ
రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి షుకూర్
సాక్షి, హైదరాబాద్: 2017 హజ్ యాత్రికులు ఈ ఏడాది సౌదీ ఎయిర్‌లైన్స్ విమానాల ద్వారా ఆగస్టు 11 నుంచి హజ్ ఆరాధనలకు వెళుతున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి షుకూర్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత రెండేళ్ల నుంచి ఎయిర్ ఇండియా విమానాల్లో యాత్రికులు వెళ్లేవారని.. ఈసారి మార్పు జరిగినట్లు చెప్పారు. కేంద్ర హజ్ కమిటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర యాత్రికుల విమానాలు ఆగస్టు 11–22 మధ్య బయలుదేరతాయని తెలిపారు.
యాత్రికులు ఇక్కడి నుంచి ఎహెరామ్ (హజ్ ఆరాధన దుస్తులు)ల్లో జిద్దా వెళ్లి అక్కడి నుంచి మక్కా నగరానికి వెళతా రన్నారు. ఈ ఏడాది నుంచి మక్కా, మదీన నగరాల్లో ఆరాధనల సందర్భంగా వసతుల ఖర్చులు పెరిగాయన్నారు. మీనా, ముస్దలీఫాలో మౌల్లిమ్ ద్వారా మూడుపూటల భోజన ఏర్పాటు ఉందన్నారు. ప్రతీ ఏడాది హజ్ కమిటీ తరుఫున ఫోన్ సిమ్ కార్డులు ఇచ్చే వారని, ఈ ఏడాది నుంచి యాత్రికులే సిమ్‌కార్డులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జిద్దా ఎయిర్‌పోర్టులో సిమ్‌కార్డులను తీసుకునే సౌకర్యం ఉందన్నారు.