ఇరు ప్రభుత్వాలకు అధికారం లేదు | The High Court ruled that corporations, on the 9th of schedule | Sakshi
Sakshi News home page

ఇరు ప్రభుత్వాలకు అధికారం లేదు

Published Sun, Nov 16 2014 12:40 AM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM

ఇరు ప్రభుత్వాలకు అధికారం లేదు - Sakshi

ఇరు ప్రభుత్వాలకు అధికారం లేదు

9వ షెడ్యూల్‌లోని కార్పొరేషన్లపై తేల్చి చెప్పిన హైకోర్టు
ఏపీఎస్‌ఐడీసీఎల్ చైర్మన్, డెరైక్టర్లను తొలగించిన ఏపీ ప్రభుత్వం
జీవో అమలు నిలుపుదల.. కౌంటర్ల దాఖలుకు ఆదేశం


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తొమ్మిదో షెడ్యూల్‌లో ఉన్న కంపెనీలు, కార్పొరేషన్ల విభజన జరగనంతవరకు వాటి పాలక మండళ్ల రద్దు  అధికారం రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. తొమ్మిదో షెడ్యూల్‌లో ఉండి, ఇంకా ఉమ్మడిగా కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌ఐడీసీఎల్) చైర్మన్, డెరైక్టర్లను ఏపీ ప్రభుత్వం తొలగించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ నెల 1న జారీ చేసిన జీవో 58ను నిలుపుదల చేసింది.  ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి రెండు రోజుల క్రితం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ కేంద్రానికి, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేశారు. ఏపీఎస్‌ఐడీసీఎల్ చైర్మన్, డెరైక్టర్లుగా ఉన్న తమను తొలగించడాన్ని సవాలు చేస్తూ గంటా మురళీ రామకృష్ణ, ఎస్.శివారెడ్డి, వై.నాగయ్య, కె.జి.గంగాధర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.ఆర్.అశోక్ వాదనలు వినిపిస్తూ... పిటిషనర్ల పదవీకాలం వచ్చే ఏడాది జూలై 3 వరకు ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం తరువాత కొన్ని కార్పొరేషన్లు, కంపెనీలను ప్రభుత్వం 9వ షెడ్యూల్‌లో చేర్చిందని, పునర్విభజన చట్టంలోని సెక్షన్ 53 ప్రకారం వాటి ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల పంపిణీ పూర్తయ్యేంతవరకు అవి ఉమ్మడిగానే ఉంటాయని వివరించారు. కాబట్టి చైర్మన్, డెరైక్టర్లను తొలగించే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని వివరించారు. ఈ వాదనలను తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి సమర్థించారు. కాగా, ఏపీ ఏజీ వేణుగోపాల్ మాత్రం తమ చర్యలను సమర్థించుకున్నారు. పిటిషనర్లు ప్రభుత్వ ఆదేశాల మేరకు నియమితులయ్యారని, కాబట్టి అదే ఆదేశాల మేరకు పదవుల నుంచి తప్పుకోవాలన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి... తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు జీవో అమలును నిలుపుదల చేస్తున్నట్లు తన తీర్పులో పేర్కొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement