
పార్టీ.. క్యాడర్‌ను కాపాడుకోవాలి
టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు
టవర్‌సర్కిల్ : ‘పక్కపార్టీని విమర్శించడం పక్కనబెట్టి మన పార్టీని ఎలా బాగుచేసుకోవాలో ఆలోచించండి.. కార్యకర్తల అసంతృప్తికి నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలే కారణం.. ఎన్నికలు ఇప్పట్లో లేవని, తిరిగితే ఖర్చవుతుందని ఆలోచిస్తున్నారు.. పార్టీ ఫండ్ ఇస్తే సగం ఖర్చు చేసి.. సగం జేబులో వేసుకుంటున్నారు... సభ్యత్వ రుసుం రూ.100 చొప్పున వసూలు చేశాం... ఇప్పటికీ కార్డులు రాలేదు... కాళ్లు, రెక్కలు విరిగిన కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయాం... ఏ మొఖం పెట్టుకుని కార్యకర్తల వద్దకు వెళ్లమంటారు...’ అంటూ మండల స్థాయి అధ్యక్ష,కార్యదర్శులు వారి ఆవేదనను వెళ్లగక్కారు...
తెలుగుదేశం పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం శనివారం కరీంనగర్‌లో జరిగింది. ఈ సందర్భంగా పలువురు మండలస్థాయి అధ్యక్ష,కార్యదర్శులు మాట్లాడుతూ పార్టీ ముఖ్య నేతలు వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. పార్టీని కాపాడుకుంటున్న కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చేవారే లేకుండా పోయారని అన్నారు. ఈనెల 29న పార్టీ ఆవిర్భావానికి మేము జండా గద్దెలకు బూజు దులుపుతం.. మీరు ఇన్‌చార్జీల బూజు దులుపాలని పార్టీ జిల్లా అధ్యక్షుడికి సూచించారు.
కార్యకర్తలను ప్రోత్సహించాలి -విజయరమణారావు
నియోజకవర్గ ఇన్‌చార్జీలు చురుకుగా పనిచేస్తేనే సంస్థాగత నిర్మాణం జరుగుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు అన్నారు. పార్టీని కాపాడుకోవాలంటే కార్యకర్తలను ప్రొత్సహించుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. పార్టీలో ఉండేవారు ఉంటరు.. పోయే వారు పోతరు.. ఎవరూ అధైర్యపడవద్దన్నారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ చెప్పేదొకటి చేసేదొకటిగా ఉందని పేర్కొన్నారు. 10న పెద్దపల్లి, 12న మానకొండూర్, కోరుట్ల, 14న మంథని, 15న కరీంనగర్, 16న ధర్మపురి, 17న సిరిసిల్ల, వేములవాడ, 18న చొప్పదండిలో సమావేశాలుంటాయన్నారు.
రామగుండం, జగిత్యాల, హుజురాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల తేదీలను ప్రకటిస్తామని వెల్లడించారు. నియోజకవర్గాల ఇన్‌చార్జీలు కర్రు నాగయ్య, రవీందర్‌రావు, కవ్వంపల్లి సత్యనారాయణ, మద్దెల రవీందర్, సాంబారి ప్రభాకర్, మేడిపల్లి సత్యం, అన్నమనేని నర్సింగరావు పాల్గొన్నారు.