
ప్రాజెక్టుల ‘నేల’ చూపులు!
తీవ్ర ప్రతిబంధకంగా మారిన భూసేకరణ
కొత్త భూసేకరణ చట్టంతో కొత్త చిక్కులు
సమస్య పరిష్కారంపై దృష్టి సారించిన ప్రభుత్వం
ప్రస్తుత ఏడాది 17వేల ఎకరాల భూ సేకరణ లక్ష్యంగా ప్రణాళిక
ఇతర శాఖలతో సమన్వయం లేని ఇరిగేషన్
హైదరాబాద్: కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన కొత్త భూసేకరణ చట్టం మార్గదర్శకాలు ఇంకా ఖరారుకాకపోవడం రాష్ర్టంలో నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతిబంధకంగా మారాయి. దీనిపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపకపోవడంతో ప్రాజెక్టుల పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. వీటితో పాటు హైవేలు, రైలుమార్గాలు పలుచోట్ల ఆటంకం కలిగిస్తున్నాయి. వివిధ శాఖలతో ఉన్న సమన్వయలేమి సైతం ఇరిగేషన్ శాఖకు పెద్ద గుదిబండగా మారింది. రాష్ట్రంలో చేపట్టిన 36 భారీ, మధ్య తరహా ప్రాజెక్టులతో కలిపి మొత్తంగా 3,85,364 ఎకరాల భూ సేకరణ జరపాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఈ ఏడాది జూలై వరకు 2,37,477 లక్షల ఎకరాలు సేకరించినట్టు ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కలు చెబుతున్నాయి. అయితే కేంద్రం గత ఏడాది డిసెంబర్‌లో కొత్త భూసేకరణ చట్టం తెచ్చాక భూ నిర్వాసితులకు పరిహారం ఎలా చెల్లించాలన్న దానిపై స్పష్టత కొరవడడంతో మిగిలిన భూసేకరణ పూర్తిగా నిలిచిపోయింది. పనులు చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయడంతో పాటు, పలు కొత్త ప్రాజెక్టుల కోసం ప్రస్తుత ఆర్ధిక ఏడాదిలో 17,031 ఎకరాల భూ సేకరణ జరపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2015-16 నాటికి మరో 19,840 ఎకరాల భూసేకరించాలని యోచిస్తోంది.
ప్రభుత్వం ఈ ఏడాది పూర్తి చేయాలని చూస్తున్న నీల్వాయి (40 ఎకరాలు), ర్యాలీవాగు(15 ఎకరాలు), గొల్లవాగు(90 ఎకరాలు), పెద్దవాగు(152 ఎకరాలు) ప్రాజెక్టుల్లో ఇంతవరకు భూ సేకరణ సమస్య తేలలేదు. దీంతో ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేది గగనంగా మారింది. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్టుల పరిస్థితి ఇలానే ఉంది. ఇక కొమురం భీమ్ కింద 210 ఎకరాలు, కాళేశ్వరం కింద 300 ఎకరాలు, కరీంగనర్‌లోని ప్రాణహిత ప్యాకేజీ 6,7ల కింద 1,194 ఎకరాలు, నిజామాబాద్‌లోని ప్యాకేజీ 20, 21ల కింద 3,053 ఎకరాలు ఈ ఏడాది భూ సేకరణకు నిర్ణయించారు. అయితే ఆర్ధిక ఏడాది ప్రారంభమై నాలుగు నెలలు గడిచినా అడుగు ముందుకు పడలేదు. వీటికి తోడు 21 చోట్ల రైల్వే క్రాసింగ్‌లకు సంబంధించి, మరో 6 చోట్ల జాతీయ రహదారుల భూములకు సంబంధించిన వివాదాలు ప్రాజెక్టు పనులకు మరో అవరోధాన్ని తెచ్చిపెట్టాయి.
సహాయ పునరావాసం అంతే..
ఇక ప్రాజెక్టుల కింద భూ సేకరణతో పాటు నిర్మాణంతో భూమిని కోల్పోయే నిర్వాసితులకు సహాయ పునరావాసం అంతే క్లిష్టంగా మారింది. మొత్తం 16 ప్రాజెక్టుల కింద ముంపునకు గురవుతున్న 88 గ్రామాల్లోని 42,457 మంది నిర్వాసితుల కోసం ఏర్పాటుచేయాలనుకున్న 78 సహాయ పునరావాస కేంద్రాల్లో చాలావరకు పూర్తి కాలేదు. ఇప్పటి వరకు కేవలం 31 కేంద్రాలను మాత్రమే పూర్తి చేయగా మరో 43 కేంద్రాల ఏర్పాటు చేయాల్సి ఉంది. భూమిని కోల్పోయిన నిర్వాసితుల్లో ఇప్పటికీ 27 వేల మందికి పట్టాలివ్వగా, మరో 15 వేల మందికి పట్టాలివ్వాల్సి ఉంది. ఈ తంతు అంతా ముగియాలంటే భూ సేకరణ మార్గదర్శకాలు మొదటగా తేలాల్సి ఉంది.
7న సమీక్ష..!
ప్రాజెక్టుల భూ సేకరణ సమస్యను అధిగమించి, సమస్యను ఓ కొలిక్కి తెచ్చేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, ైరె ల్వే, రహదారులు, ఆర్ అండ్ ఆర్ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మూడు రోజుల క్రితం ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్షించిన ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావు ఈ మేరకు 7న నిర్వహించే సమావేశంపై అధికారులకు సమాచారం ఇచ్చారు. కొత్త భూ సేకరణ చట్టం అమలు, సాధ్యాసాధ్యాలపై ఈ సమావేశంలో చర్చించి ముఖ్యమంత్రికి నివేదించే అవకాశాలున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.