The new Land Acquisition Act
-
సవాలుగా మారుతున్న భూసేకరణ
-
భూ సేకరణ సవాలే
* సాగునీటి ప్రాజెక్టులకు అడ్డంకిగా మారిన ప్రక్రియ * కొత్త భూ సేకరణ చట్టంపై మార్గదర్శకాల ఖరారుతో కదలిక * ఆగమేఘాలపై చర్యలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం * మూడు నెలల్లోగా 17 వేల ఎకరాల సేకరణకు కసరత్తు * తాజా నిబంధనలతో కష్టంగా మారిన ప్రక్రియ * మార్చితో ముగియనున్న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కాల పరిమితి * ఆలోగా సేకరించకుంటే ప్రక్రియ మొత్తం మొదటికి * ఇప్పటికే నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టుల నిర్మాణం * తొలి దశలో 6 లక్షల ఎకరాలకు సాగునీరే లక్ష్యం * 36 ప్రాజెక్టుల కోసం ఇంకా 88,151 ఎకరాలు అవసరం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. ప్రధానమైన ఈ ప్రక్రియ ఇంతవరకు ముందుకు సాగకపోవడంతో ప్రాజెక్టుల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కేంద్రం తెచ్చిన కొత్త భూ సేకరణ చట్టమే ఇంతకాలం ఇందుకు అవరోధంగా మారింది. అయితే ఈ చట్టం ప్రకారం రాష్ర్టంలో మార్గదర్శకాలు ఇటీవలే ఖరారు కావడంతో ప్రభుత్వ వర్గాల్లో ఒక్కసారిగా కదలిక వచ్చింది. ఇప్పటివరకు నిలిచిపోయిన భూ సేకరణ ప్రక్రియను శరవేగంగా పూర్తి చేసేందుకు అన్ని విభాగాలు సమాయత్తమవుతున్నాయి. కానీ కొత్త చట్టం ప్రకారం భూములను సేకరించి, నిర్ణీత సమయంలో లక్ష్యాన్ని చేరుకోవడం కత్తిమీదసాములా మారింది. కఠినంగా మారిన నిబంధనల మేరకు చర్యలు చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17 వేల ఎకరాల సేకరణ లక్ష్యాన్ని మిగిలిన 3 నెలల్లోనే పూర్తి చేయడం ప్రశ్నార్థకంగా మారింది. మార్చి నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేయని పక్షంలో భూ సేకరణకు ఇచ్చిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ గడువు ముగిసిపోతుంది. దీంతో ఇప్పటివరకు చేపట్టిన ప్రక్రియ మొత్తం మొదటికి వచ్చే ప్రమాదముంది. అటు ప్రాజెక్టుల పనులు కూడా ముందుకుసాగవు. తాజా పరిస్థితిపై ఆందోళన పడుతున్న ప్రభుత్వం దీనిపై ప్రత్యేక కసరత్తు ప్రారంభించింది. అడ్డుగా నిలిచిన కొత్త చట్టం రాష్ట్రంలో ఆయకట్టు అభివృద్ధి కోసం తలపెట్టిన 36 భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి కోసం 3,25,628 ఎకరాల భూములను సేకరించాల్సి ఉండగా.. ఇప్పటివరకు 2,37,477 ఎకరాల సేకరణ పూర్తయింది. మరో 88,151 ఎకరాల సేకరణ జరగాల్సి ఉంది. ఇందులో ప్రస్తుత ఏడాదికి ప్రాధాన్య క్రమంలో ప్రభుత్వం గుర్తించిన ప్రాజెక్టుల కోసం 17,031 ఎకరాల మేర భూ సేకరణ జరపాలని నీటి పారుదల శాఖ లక్ష్యంగా నిర్ధారించింది. వచ్చే ఏడాదికి ఏఎంఆర్పీ, భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, నీల్వాయి, గొల్లవాగు, దేవాదుల ప్రాజెక్టుల పనులను పూర్తిచేసి సుమారు 6 లక్షల ఎకరాలకు సాగు నీరివ్వాలని ప్రభుత్వం నిశ్చయించింది. వీటితో పాటే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం నాలుగు ప్యాకేజీల కింద సుమారు 4,200 ఎకరాలు, నిజాంసాగర్, సింగూరు, ఎస్సారెస్పీ కింద మరో వెయ్యి ఎకరాల మేర భూ సేకరణను లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కేంద్రం తెచ్చిన కొత్త భూ సేకరణ చట్టంపై స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడంతో ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క ఎకరాను కూడా సేకరించలేదు. దీంతో ప్రాజెక్టుల పనులేవీ ముందుకు సాగలేదు. అయితే ఈ చట్టానికి అనుగుణంగా కొత్త మార్గదర్శకాలను రాష్ర్ట ప్రభుత్వం ఇటీవలే ఖరారు చేసింది. వీటిని అనుసరించే ఇకపై భూ సేకరణ జరపాల్సి ఉంది. అంటే, భూముల మార్కెట్ ధరను నిర్ణయించడం, ఒక్క అంగుళం కోల్పోయిన వారికైనా సహాయ, పునరావాసం కల్పించడం, ప్రత్యామ్నాయ వ్యవసాయ భూములను కేటాయించడం తదితర నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అయితే దీని ప్రకారం మూడు నెలల్లోగా ప్రక్రియను పూర్తి చేయడం సాధ్యమయ్యే పనికాదని అధికారవర్గాలు అంటున్నాయి. భూ సేకరణకై ఇచ్చే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కాల పరిమితి ఏడాది మాత్రమేనని, ఆలోగా ప్రక్రియ మొదలు పెట్టని పక్షంలో మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి ప్రక్రియను మొదలు పెట్టాల్సి ఉంటుందని పేర్కొంటున్నాయి. ప్రస్తుత ఏడాది భూ సేకరణకు సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చే మార్చితో ముగుస్తాయి. ఈలోగా ప్రక్రియ మొదలవకుంటే ప్రాజెక్టుల పూర్తి, ఆయకట్టు లక్ష్యం నెరవేరడం కష్టం. ఈ నేపథ్యంలో ఆర్అండ్ఆర్ శాఖ ఆగమేఘాలపై రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి.. భూసేకరణ లక్ష్యాలపై మార్గనిర్దేశానికి ఉపక్రమించింది. మూడు నెలల్లో దాదాపు 17 వేల ఎకరాల సేకరణకు కార్యాచరణ ప్రారంభించింది. అయితే ఇన్ని విపరీత పరిస్థితుల మధ్య మార్చి నాటికి అది అసాధ్యమనే అనుమానాలు నెలకొన్నాయి. -
ప్రాజెక్టుల ‘నేల’ చూపులు!
తీవ్ర ప్రతిబంధకంగా మారిన భూసేకరణ కొత్త భూసేకరణ చట్టంతో కొత్త చిక్కులు సమస్య పరిష్కారంపై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రస్తుత ఏడాది 17వేల ఎకరాల భూ సేకరణ లక్ష్యంగా ప్రణాళిక ఇతర శాఖలతో సమన్వయం లేని ఇరిగేషన్ హైదరాబాద్: కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన కొత్త భూసేకరణ చట్టం మార్గదర్శకాలు ఇంకా ఖరారుకాకపోవడం రాష్ర్టంలో నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతిబంధకంగా మారాయి. దీనిపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపకపోవడంతో ప్రాజెక్టుల పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. వీటితో పాటు హైవేలు, రైలుమార్గాలు పలుచోట్ల ఆటంకం కలిగిస్తున్నాయి. వివిధ శాఖలతో ఉన్న సమన్వయలేమి సైతం ఇరిగేషన్ శాఖకు పెద్ద గుదిబండగా మారింది. రాష్ట్రంలో చేపట్టిన 36 భారీ, మధ్య తరహా ప్రాజెక్టులతో కలిపి మొత్తంగా 3,85,364 ఎకరాల భూ సేకరణ జరపాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఈ ఏడాది జూలై వరకు 2,37,477 లక్షల ఎకరాలు సేకరించినట్టు ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కలు చెబుతున్నాయి. అయితే కేంద్రం గత ఏడాది డిసెంబర్లో కొత్త భూసేకరణ చట్టం తెచ్చాక భూ నిర్వాసితులకు పరిహారం ఎలా చెల్లించాలన్న దానిపై స్పష్టత కొరవడడంతో మిగిలిన భూసేకరణ పూర్తిగా నిలిచిపోయింది. పనులు చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయడంతో పాటు, పలు కొత్త ప్రాజెక్టుల కోసం ప్రస్తుత ఆర్ధిక ఏడాదిలో 17,031 ఎకరాల భూ సేకరణ జరపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2015-16 నాటికి మరో 19,840 ఎకరాల భూసేకరించాలని యోచిస్తోంది. ప్రభుత్వం ఈ ఏడాది పూర్తి చేయాలని చూస్తున్న నీల్వాయి (40 ఎకరాలు), ర్యాలీవాగు(15 ఎకరాలు), గొల్లవాగు(90 ఎకరాలు), పెద్దవాగు(152 ఎకరాలు) ప్రాజెక్టుల్లో ఇంతవరకు భూ సేకరణ సమస్య తేలలేదు. దీంతో ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేది గగనంగా మారింది. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్టుల పరిస్థితి ఇలానే ఉంది. ఇక కొమురం భీమ్ కింద 210 ఎకరాలు, కాళేశ్వరం కింద 300 ఎకరాలు, కరీంగనర్‌లోని ప్రాణహిత ప్యాకేజీ 6,7ల కింద 1,194 ఎకరాలు, నిజామాబాద్‌లోని ప్యాకేజీ 20, 21ల కింద 3,053 ఎకరాలు ఈ ఏడాది భూ సేకరణకు నిర్ణయించారు. అయితే ఆర్ధిక ఏడాది ప్రారంభమై నాలుగు నెలలు గడిచినా అడుగు ముందుకు పడలేదు. వీటికి తోడు 21 చోట్ల రైల్వే క్రాసింగ్లకు సంబంధించి, మరో 6 చోట్ల జాతీయ రహదారుల భూములకు సంబంధించిన వివాదాలు ప్రాజెక్టు పనులకు మరో అవరోధాన్ని తెచ్చిపెట్టాయి. సహాయ పునరావాసం అంతే.. ఇక ప్రాజెక్టుల కింద భూ సేకరణతో పాటు నిర్మాణంతో భూమిని కోల్పోయే నిర్వాసితులకు సహాయ పునరావాసం అంతే క్లిష్టంగా మారింది. మొత్తం 16 ప్రాజెక్టుల కింద ముంపునకు గురవుతున్న 88 గ్రామాల్లోని 42,457 మంది నిర్వాసితుల కోసం ఏర్పాటుచేయాలనుకున్న 78 సహాయ పునరావాస కేంద్రాల్లో చాలావరకు పూర్తి కాలేదు. ఇప్పటి వరకు కేవలం 31 కేంద్రాలను మాత్రమే పూర్తి చేయగా మరో 43 కేంద్రాల ఏర్పాటు చేయాల్సి ఉంది. భూమిని కోల్పోయిన నిర్వాసితుల్లో ఇప్పటికీ 27 వేల మందికి పట్టాలివ్వగా, మరో 15 వేల మందికి పట్టాలివ్వాల్సి ఉంది. ఈ తంతు అంతా ముగియాలంటే భూ సేకరణ మార్గదర్శకాలు మొదటగా తేలాల్సి ఉంది. 7న సమీక్ష..! ప్రాజెక్టుల భూ సేకరణ సమస్యను అధిగమించి, సమస్యను ఓ కొలిక్కి తెచ్చేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, ైరె ల్వే, రహదారులు, ఆర్ అండ్ ఆర్ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మూడు రోజుల క్రితం ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్షించిన ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావు ఈ మేరకు 7న నిర్వహించే సమావేశంపై అధికారులకు సమాచారం ఇచ్చారు. కొత్త భూ సేకరణ చట్టం అమలు, సాధ్యాసాధ్యాలపై ఈ సమావేశంలో చర్చించి ముఖ్యమంత్రికి నివేదించే అవకాశాలున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.