మాట్లాడుతున్న జస్టిస్ రాజేంద్రప్రసాద్
సాక్షి, హైదరాబాద్: న్యాయవ్యవస్థలో ఇప్పటికీ బ్రిటీష్ విధానాలను అనుసరిస్తుండటం వల్ల సామాన్యులకు సత్వర న్యాయం అంద డం లేదని అఖిల భారత జడ్జీల సంఘం అధ్య క్షుడు జస్టిస్ రాజేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఆదివారం రెండో జుడీషియల్ పే కమిషన్ అమలుకు సంబంధించి రాజేంద్రప్రసాద్ తెలంగాణ న్యాయాధికారులతో చర్చించారు. జస్టిస్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు న్యాయవ్యవస్థలో ప్రస్తుతం అమలవుతున్న సంస్కరణలను నిరంతరం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. హత్య, అత్యాచారం వంటి కేసుల్లో 2 నెలల్లో శిక్షలు తేలాలని, అప్పుడు ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని తెలిపారు.
ప్రస్తుతం 40 ఏళ్ల వ్యక్తిపై హత్యానేరం తేలేందుకు 30 ఏళ్లు పడుతోందన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సి ఉందన్నారు. ఏసీబీ దాడులకు సంబంధించి న్యాయాధికారుల రక్షణ సంగతి హైకోర్టు చూసుకుంటుందన్నారు. ఇటీవల ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన న్యాయాధికారి వి.వరప్రసాద్‌పై ఏసీబీ చేసిన ఆరోపణలను తాము పరిశీలించామని, ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని భావిస్తున్నామని చెప్పారు. దీనిపై హైకోర్టుకు వినతిపత్రం సమర్పిస్తామన్నారు. సమావేశంలో సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు వసంత్‌కుమార్ షా, ప్రధాన కార్యదర్శి అజయ్‌కుమార్ నతాని, కోశాధికారి రణధీర్ సింగ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment