ఇవీ అవసరాలు..!
లోక్‌సభలో మనవారు కొలువుదీరారు. సభ్యులుగా ప్రమాణస్వీకారమూ చేశారు. ఇక మిగిలిందల్లా జిల్లా వాసుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో సంకల్పం చెప్పుకోవడమే. వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపి పాలమూరు వాకిట ప్రగతి కాంతులు చిందించడమే. నిధులను రప్పించుకొని అభివృద్ధికోసం అహరహం శ్రమించాల్సిందే. కర్తవ్య దీక్షకు కంకణం కట్టుకొని కార్యరంగంలోకి ఉరకాల్సిందే. ఇదే మన ఎంపీలు జితేందర్, నంది ఎల్లయ్యల నుంచి ఈ ప్రాంతవాసులు ఆశిస్తున్నారు.
సాక్షి, మహబూబ్‌నగర్: ‘సార్వత్రిక’ సమరం ముగిసింది. కొత్త ప్రభుత్వాలు కేంద్ర, రాష్ట్రాల్లో కొలువుదీరాయి. జిల్లానుంచి ఎన్నికైన ఏపీ జితేందర్ రెడ్డి (టీఆర్‌ఎస్), నంది ఎల్లయ్య (కాంగ్రెస్)లు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు పార్లమెంటు స్థానాలనుంచి గెలుపొంది లోక్‌సభ సభ్యులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేశా రు. ఈ నేపథ్యంలో జిల్లా వాసుల దృష్టంతా పేదరికంతో మగ్గుతున్న తమ ప్రాంతాన్ని ప్రగతి రస్తాపై ప్రతినిధులు నడిపించాలని కోరుకుంటున్నారు. కోటి ఆశలతో వారి ప్రాతినిధ్యంపై నమ్మకం పెట్టుకున్నా రు. పార్లమెంటులో పాలమూరు గొంతు వినిపించి ఇక్కడి అవసరాలు తీర్చాలని కోరుకుంటున్నారు.
కార్యాచరణ ప్రణాళికతో...
టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నేతగా జితేందర్‌రెడ్డి, మంచి పార్లమెంటేరియన్‌గా నంది ఎల్లయ్య ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో అవగాహనతో అగ్రభాగాన నిలువగలరన్న ఆ శాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. జలయజ్ఞంలో భా గంగా జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా శాసనసభ్యులతో కలిసి కృషిచేయాల్సిన బాధ్యత ఎంపీలపై ఉంది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశా లు కల్పించే దిశగా కొత్త పరిశ్రమలను జిల్లాకు తీసుకొచ్చే విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కర్తవ్యం వీరిపై ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి సమీపంలో ఉన్న పాలమూరును ఇండస్ట్రీయల్ కారిడార్‌గా అభివృద్ధి పర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మందకొడిగా జలయజ్ఞం...
జలయజ్ఞంలో భాగంగా జిల్లాలో చేపట్టి న నాలుగు భారీ ఎత్తిపోతల పథకాల ప నులు నిధుల లేమితో నత్తనడకన సాగుతున్నాయి. మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకాన్ని రూ.2990 కోట్ల వ్యయంతో ప్రారంభించినప్పటికి ఇప్పటి వరకు 80 శాతం పనులు కూడా జరగలేదు. రూ. 2601 కోట్లు ఖర్చుచేసినప్పటికీ ఒక్క ఎ కరాన్ని కూడా సాగునీటిని అందించలేని పరిస్థితి నెలకొని ఉంది. 2014-15 సంవత్సరం నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేయడం ద్వారా జిల్లాలోని 3.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంది.
ఈ పనుల పురోగతిపై ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులతో కలిసి ఎంపీలు కృషిచేయాల్సిన అవసరం ఉంది. 38,250 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా రూ.459 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయి. ఇంకా పది శాతం పనులు పూర్తికావాల్సిన అవసరం ఉంది. 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో రూ. 1863 కోట్ల అంచనా వ్యయంతో జవ హర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పనులు చేపట్టినప్పటికిని ఇప్పటి వరకు 85 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా పనులు ఈ ఏడాదిలోగా పూర్తయినట్లయితే రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది.
రూ.2158 కోట్ల అంచనా వ్యయంతో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన రాజీవ్ బీమా ఎత్తిపోతల పథకం పనులు 91 శాతం వరకు పూర్తయినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది వరకు పూర్తిచేయాలన్న లక్ష్యంతో పనులు కొనసాగిస్తున్నప్పటికీ నిధుల లేమితో నత్తనడకన నడుస్తున్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, పాలమూరు ఎత్తిపోతల పథకంపై దృ ష్టి సారించాల్సి ఉంది. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదాను తీసుకురావడం ద్వారా అధిక నిధులను రాబట్టవలసింది. పెండింగ్ ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులను సాధించుకున్నట్లయితే జిల్లాలోని ఎడారి, బీడు భూములను సస్యశ్యామలం చేయడం ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పర్చేందుకు అవకాశం ఏర్పడుతుంది.
వేధిస్తున్న వలసలు...
పనుల లేమి వల్లనే జిల్లా నుంచి ఏటా పదకొండు లక్షల మంది ప్రజలు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. వీటిని నివారిం చేందుకు జిల్లాను పారిశ్రామికగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. జిల్లాలో రైల్వే స్టేషన్‌ల అభివృద్ధి, డబుల్‌లైన్ ఏర్పాటు ముఖ్యమే. తాగునీటి స మస్య కూడా తీవ్రంగా ఉంది. మున్సిపాలిటీలు న గర పంచాయతీల్లోని ప్రజలు తాగునీటి సమస్యను ఎ దుర్కొంటున్నారు. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌లోనే 20 రోజులకోమారు మంచినీటిని సరఫరా చేస్తున్నారు. ఇదే పరిస్థితి మిగతా పట్టణాల్లో కూడా నెలకొని ఉంది. అచ్చంపేట, కల్వకుర్తి తదితర నియోజకవర్గాల్లో ఫ్లోరైడ్ వేధిస్తోంది. జిల్లాలో సుమారుగా 160 గ్రామాల్లో ఈ ఇబ్బంది ఉంది . మహానేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో జిల్లాకు మంజూరైన సాగు, తాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం దృష్టి సారించాలి. తెలంగాణ తొలి ప్రభుత్వం నుంచి, కేంద్రం నుంచి అత్యధికంగా నిధులను రాబట్టేందుకు ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో కృషిచేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం సంకల్పం చెప్పుకోవాలని కొత్త ఎంపీలను జిల్లా ప్రజలు కోరుతున్నారు.