
పద్మాక్షమ్మా.. క్షమించు!
సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ ప్రజల పెద్ద పండుగ బతుకమ్మ. సద్దుల బతుకమ్మకు వరంగల్ జిల్లా ప్రసిద్ధి. జిల్లా కేంద్రంలోని పద్మాక్షి గుట్ట వద్ద అధిక సంఖ్యలో మహిళలు చేరి సద్దుల బతుకమ్మ ఆడతారు. తెలంగాణలోనే సద్దుల బతుకమ్మకు ప్రసిద్ధిగాంచిన పద్మాక్షి గుట్టకు ఇప్పుడు ప్రమాదం ఏర్పడింది. నగరంలో పెరిగిన భూముల ధరలతో భూ ఆక్రమణదారులు ఇప్పుడు పద్మాక్షి గుట్టకు ఎసరు పెట్టారు. గుట్టకు సమీపంలోని పట్టా భూములను ఆసరాగా చేసుకుని గుట్ట చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములను స్వాహా చేస్తున్నారు.
నేరుగా ఇళ్లు, ఇతర నిర్మాణాలను చేపట్టకుండా... ఆలయాలు కట్టి, దేవుళ్లను ప్రతిష్టిం చి కబ్జాలకు పాల్పడుతున్నారు. రెండు నెలల క్రితం వరకు అధికారంలో ఉన్న పార్టీకి చెందిన పలువురు నేతలు కొద్ది కొద్దిగా గుట్టను కబ్జా చేస్తున్నారు. ఇన్నాళ్లు చూసీ చూడనట్లు వ్యవహరించిన రెవెన్యూ అధికారులు ఇప్పుడు కూడా చోద్యం చూస్తుండడంతో కబ్జాలో వీరి పాత్రపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హన్మకొండ చౌరస్తాకు కూత వేటు దూరంలో పద్మాక్షి గుట్ట ఉంది. 898 సర్వే నంబర్‌లో గుట్టతోపాటు దీనికి సమీపంలోని 78.03 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.
ప్రభుత్వం గతంలో 83 మందికి 80, 60 గజాల చొప్పున ఇళ్ల స్థలాలను కేటాయించింది. ఇలా ప్రభుత్వం కేటాయించిన భూముల కంటే భారీగా ప్రభుత్వ భూమి ఇప్పటికే కబ్జాకు గురైంది. పలువురు పేరొందిన రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల అనుబంధ సంస్థల నాయకులు ఇష్టారాజ్యంగా గుట్టకు సమీపంలోని స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. వాటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన రెవెన్యూ అధికారులు తాజాగా జరుగుతున్న ఆక్రమణలను కూడా పట్టించుకోవడం లేదు. పవిత్ర దేవాలయం ముసుగులో చారిత్రక పద్మాక్షి గుట్టను కొల్లగొట్టేందుకు ఆక్రమణ దారులు కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టారు.