
తిమ్మాపూర్ ముఖచిత్రం
సాక్షి, మోర్తాడ్ (నిజామాబాద్): పర్యావరణ పరిరక్షణ కు తిమ్మాపూర్ గ్రామస్తులు నడుం బిగించారు. ప్లాస్టిక్ రహిత గ్రామంగా తిమ్మాపూర్‌ను ప్రకటించిన గ్రామస్తులు స్వాతంత్ర దినోత్సవం నుంచి తమ గ్రామంలో కఠిన నియమ నిబంధనలను అమలు చేస్తున్నారు. గతంలో ఏకగ్రీవ ఎన్నికలతో పొరుగు గ్రామాలకు ఆదర్శంగా నిలచిన తిమ్మాపూర్ ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు, కప్పులు, గ్లాసులను నిషేధించి అన్ని గ్రామాలకు ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. తిమ్మాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ, సర్పంచ్ గడ్డం చిన్నారెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు ఆస్మా నాయకత్వంలో గ్రామస్థులు తీసుకున్న నిర్ణయానికి వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. తాము కూడా ప్లాస్టిక్ రహిత గ్రామంగా తిమ్మాపూర్‌కు గుర్తింపు తీసుకరావడానికి సహకరిస్తామని వ్యాపారులు హామీ ఇచ్చారు.
కిరాణ దుకాణాలు, మాంసం విక్రయదారులు, హోటల్ యజమానులు, కూరగాయల వ్యాపారులు ప్లాస్టిక్ కవర్లను వినియోగించబోమని స్పష్టం చేశారు. ప్లాస్టిక్‌కు బదులు బట్టతో తయారు చేసిన సంచులను వినియోగించడానికి అందరు సమ్మతం తెలిపారు. కాగా బట్ట సంచులను కొనుగోలు చేసి గ్రామస్తులకు ఉచితంగా పంపిణీ చేయడానికి గ్రామ పంచాయతీలో పాలకవర్గం తీర్మానం చేసింది. విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ను వినియోగించడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని పర్యావరణ ప్రేమికులు ఎంతో మొత్తుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ కవర్లను నిషేధించడం ఒక్కటే మార్గం అని గుర్తించి ఈ దశగా తిమ్మాపూర్ నిర్ణయం తీసుకుంది. తిమ్మాపూర్ గ్రామస్థులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఇతర గ్రామాలను కూడా ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చి దిద్దాలని పలువురు సూచిస్తున్నారు.
అందరి సమ్మతంతోనే..
తిమ్మాపూర్ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి అందరు సమ్మతించారు. అందువల్లనే ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నాం. పర్యావరణ పరిరక్షణ కోసం అందరు ముందుకు రావాల్సి ఉంది. తిమ్మాపూర్‌ను జిల్లాలో ఆదర్శ గ్రామంగా ఉంచడానికి కృషి చేస్తు న్నాం.
– గడ్డం చిన్నారెడ్డి, సర్పంచ్
గ్రామస్తుల సహకారం మరువలేనిది
తిమ్మాపూర్‌ను ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి గ్రామస్థుల సహకారం మరువలేనిది. మేము తీసుకున్న నిర్ణయానికి అందరు సమ్మతించా రు. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించి అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తాం. ప్రజలు ఇదే సహకారాన్ని కొనసాగించాలి.
- ఆస్మా, ఎంపీటీసీ
Comments
Please login to add a commentAdd a comment