10 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకు సెలవ్
♦ వచ్చే ఖరీఫ్‌లో పత్తిసాగు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం
♦ పప్పు ధాన్యాల సాగుకు ప్రోత్సాహం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పత్తి సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ నిర్ణయించింది. వచ్చే ఖరీఫ్ నుంచే రైతులను సమాయత్తం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రచిస్తోంది. వచ్చే నెల రెండో వారం తర్వాత పది రోజులపాటు ‘మన తెలంగాణ-మన వ్యవసాయం’ కార్యక్రమంలో భాగంగా గ్రామగ్రామాన పది రోజులపాటు రైతులను చైతన్యం చేస్తారు. ఈ ఖరీఫ్‌లో కనీసం 10 లక్షల ఎకరాలకు తగ్గకుండా పత్తి సాగు విస్తీర్ణాన్ని నిలుపుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పత్తి సాగు చేసే రైతులకు సూక్ష్మసేద్యం సబ్సిడీని నిలుపుదల చేయాలని కూడా ఉద్యానశాఖ యోచిస్తోంది.
పత్తి బదులు పప్పుధాన్యాలు...
దేశంలో అత్యధిక పత్తి సాగు చేసే రాష్ట్రాల్లో తెలంగాణ కీలకమైంది. 2015-16 ఖరీఫ్‌లో రాష్ట్రంలో 88.90 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరిగితే... పత్తి సాగు విస్తీర్ణమే 42.42 లక్షల ఎకరాలు ఉంది. రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న తేలికపాటి నేలల్లో పత్తి సాగు అనుకూలం కాదు. ఆదాయం ఎక్కువ వస్తుందన్న ఆశతో రైతులు పత్తిని సాగు చేస్తున్నారు. రైతు ఆత్మహత్యల్లో 80 శాతం మంది పత్తి రైతులేనని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. అధిక ఎరువులు, పురుగు మందులు, అధిక పెట్టుబడులు పెట్టే పంట కావడంతో రైతులు నష్టాల్లోకి వెళ్లిపోతున్నారు. అంతర్జాతీయంగా పత్తి ఎగుమతులు తగ్గాయి. పైగా కేంద్రం ఎక్సైజ్ సుంకం పెంచింది. దీంతో కనీస మద్దతు ధర కూడా లభించే పరిస్థితి లేకుండా పో యింది. అందుకే పత్తి సాగుకు ప్రత్యామ్నాయంగా పప్పుధాన్యాలు, మొక్కజొన్న, సోయాబీన్ వంటి పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఈ పంటల సాగుకు రైతులకు అవసరమైన విత్తన సబ్సిడీ ఇచ్చేందుకు వ్యవసాయశాఖ సన్నద్ధమైనట్లు సమాచారం.