ప్రజల కోసం పోరాడండి | To fight for the people | Sakshi
Sakshi News home page

ప్రజల కోసం పోరాడండి

Published Sun, Dec 7 2014 12:49 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

To fight for the people

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే టాప్‌లో నిల వాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా శ్రేణులను కార్యోన్ముఖులను చేయాలని అన్నారు. శనివారం గాంధీభవన్‌లో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పొన్నాల మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని, మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు హామీలను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు.

సమగ్ర సర్వేతో పింఛన్లను ఏరివేశారని, రుణమాఫీ అమలులోనూ మాట నిలుపుకోలేదని ఆరోపించారు. సోనియాగాంధీ జన్మదిన కానుకగా సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగిరం చేయాలన్నారు. ఏఐసీసీ కార్యదర్శి కుంతియా మాట్లాడుతూ సభ్యత్వ నమోదులో పార్టీ శ్రేణులను కలుపుకోవాలని కోరారు. శాసనసభాపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు నాయకత్వం సమన్వయంతో ముందుకు సాగాలని, ప్రజలతో మమేకం కావడం ద్వారా అభిమానాన్ని చూరగొనాలని పిలుపునిచ్చారు.

కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ప్రసంగిస్తూ.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిని తక్షణమే సస్పెండ్ చేయాలని, లేనిపక్షంలో ఈ వ్యవహారంపై సోనియాకు ఫిర్యాదు చేస్తానని ఆనడంతో నివ్వెరపోయిన కుంతియా పార్టీ వ్యతిరేకులపై చర్యలు తీసుకోవాలని పీసీసీ క్రమశిక్షణా సంఘాన్ని ఆదేశించారు. డీసీసీ అధ్యక్షుడు క్యామ మాట్లాడుతూ సోనియా జన్మదినోత్సవం రోజున పార్టీ జెండాలు ఎగురవేసి, సామాజిక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

జిల్లాలో ఇప్పటివరకు సభ్యత్వ నమోదు 60శాతం పూర్తిచేశామని పార్టీ నేతలకు వివరించారు. సమావేశంలో ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, పార్టీ నేతలు బండారి లక్ష్మారెడ్డి, నర్సింహయాదవ్, మహిళా అధ్యక్షురాలు సదాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement