వరంగల్ క్రైం : పోలీసులు పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు బాసటగా నిలవాలని కలెక్టర్ వాకాటి కరుణ సూచించారు. భీమారంలోని శ్రీశుభం కళ్యాణ వేదికలో వార్షిక నేర సమీక్షా సమావేశం ఎస్పీ అంబర్ కిశోర్‌ఝా ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ వాకాటి కరుణ హాజరై మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పనితీరు ప్రశంసనీయమన్నారు. జిల్లా పోలీసులు అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క -సారలమ్మ జాతరను విజయవంతం చేశారన్నారు. ప్రత్యేక ఉద్యమంలో కూడా పోలీసులు సంయమనంతో వ్యవహరించారని కొనియాడారు.
పట్టణ ప్రాంతంలో ల్యాండ్ మాఫియా జడలు విప్పుతోందని, భూ ఆక్రమణదారులను కట్టడి చేయడానికి రెవెన్యూ అధికారులు, పోలీసులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో గుడుంబా వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయని తెలిపారు. ఆ తర్వాత పోలీసు కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని జిల్లా పోలీసు అధికారుల సంఘం నేతలు చేసిన వినతిపై కలెక్టర్‌వాకాటి కరుణ సానుకూలంగా స్పందించారు. ఎస్పీ అంబర్ కిశోర్ ఝా మాట్లాడుతూ పోలీసులు ప్రజల విశ్వాసం పొందేలా పనిచేయాలన్నారు.
జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతోపాటు ట్రాన్స్‌పోర్ట్, ఫారెస్ట్, ఆర్టీసీ, ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్, ఆర్‌ఎంఓ, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, హౌసింగ్, ఎక్సైజ్, మహిళా శిశు సంక్షేమశాఖ, ఇతర శాఖల సమస్యలపై చర్చించారు. పోలీస్‌స్టేషన్ల వారిగా నమోదైన కేసులు, పెండింగ్ పిటిషన్లు, ఎంక్వైయిరీ, దర్యాప్తు జరుగుతున్న వివిధ కేసులు, ఆలస్యానికిగల కారణాలు, కేసుల పురోగతిపై జిల్లా పోలీసు అధికారులతో సమీక్షించారు. ఇటీవల ఉద్యోగవిరమణ పొందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామాంజనేయరెడ్డిని ఎస్పీతోపాటు జిల్లా పోలీసు అధికారులు ఘనం గా సత్కరించారు. సీఆర్‌పీఎఫ్ కమాండెంట్ అరవిందకుమార్, రూరల్, అర్బన్ అదనపు ఎస్పీలు కె.శ్రీకాంత్, జాన్ వెస్లీ, యాదయ్య, డిప్యూటీ డెరైక్టర్ ప్రాసిక్యూటర్ సర్ధార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పోలీసులు బాధితులకు బాసటగా నిలవాలి
Published Thu, Feb 26 2015 1:05 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement